మద్దతు మాయే!

ABN , First Publish Date - 2021-03-03T06:50:18+05:30 IST

ధాన్యం రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. వారికి మద్దతు ధర కల్పించేందుకు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు నామమాత్రంగా పనిచేస్తున్నాయి.

మద్దతు మాయే!
రైతులు రాక మూసివేసి ఉన్న దర్శిలోని ధాన్యం కొనుగోలు కేంద్రం

నామమాత్రంగా ధాన్యం కొనుగోళ్లు

మొక్కుబడిగా కొనుగోలు కేంద్రాలు

రైతులకు తలనొప్పిగా మారిన ఈక్రాప్‌

గిట్టుబాటు ధర లభించక నిరాశ

పట్టించుకోని అధికారులు

దోచుకుంటున్న ప్రైవేటు వ్యాపారులు

దర్శి, మార్చి 2 : ధాన్యం రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.  వారికి మద్దతు ధర కల్పించేందుకు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు నామమాత్రంగా పనిచేస్తున్నాయి. అక్కడ మొక్కుబడిగా ధాన్యం సేకరణ జరుగుతుండటంతో ప్రైవేటు వ్యాపారుల పంట పండుతోంది. రైతుల అవసరాన్ని ఆసరా చేసుకొని ధరలను దిగజార్చి దోచుకుంటున్నారు. జిల్లాలో ఈ ఏడాది 110 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మూడు నెలల క్రితం వీటిని ప్రారంభించినా ఇప్పటివరకు వెయ్యి మంది రైతుల వద్ద మాత్రమే ధాన్యం కొనుగోలు చేశారు. 60వేల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం కాగా 9,569 మెట్రిక్‌ టన్నులు మాత్రమే సేకరించారు. 

అడ్డంకిగా నిబంధనలు

కొనుగోలు కేంద్రాల్లో రైతులు పంటను విక్రయించుకునేందుకు నిబంధనలు అడ్డంకిగా మారాయి. దీంతో కొనుగోలు జరగడం లేదు. ధాన్యం పండించిన రైతు తప్పనిసరిగా పంటను ఈ-క్రాప్‌ చేసుకోవాల్సి ఉంది. దీంతోపాటు నిబంధనల ప్రకారం తేమశాతం ఉంటేనే కొనుగోలు చేస్తారు. అధికశాతం మంది రైతులు పంటను ఈ-క్రాప్‌ చేయకపోవడంతో కేంద్రాల్లో పంటను విక్రయించుకునే అవకాశం లేకుండాపోయింది. ప్రభుత్వం ధాన్యం గ్రేడ్‌-1 రకానికి క్వింటాళ్లు ధర రూ.1,888 గిట్టుబాటు ధర కల్పించింది, గ్రేడ్‌-2 రకానికి క్వింటాళ్లు రూ.1,868 నిర్ణయించింది. దీంతో ఆ మేరకు కేంద్రాల్లో విక్రయిస్తే రైతులకు న్యాయం జరుగుతుంది.

ఈ-క్రాప్‌ కొర్రీ

ఈ-క్రాప్‌ చేసుకోకపోవడంతో కేంద్రాల్లో విక్రయించే అవకాశం లేక రైతులు ప్రైవేట్‌ వ్యాపారులకు తక్కువ ధరలకు విక్రయించుకోవాల్సి వస్తోంది. గ్రేడ్‌-1 ధాన్యాన్ని ప్రైవేట్‌ వ్యాపారులు కేవలం రూ.1,500కు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. గ్రేడ్‌-2 రకాన్ని రూ.1,350 కొనుగోలు చేస్తున్నారు. ఇదేమని అడిగితే నాణ్యత సరిగా లేదని సాకులు చెప్పి సొమ్ము చేసుకుంటున్నారు. అన్నదాతలు తప్పనిసరి పరిస్థితుల్లో తక్కువ ధరలకు విక్రయించి నష్టపోతున్నారు. ప్రభుత్వం నిబంధనలు సడలించినట్లు అయితే రైతులకు న్యాయం జరుగుతుంది. 

కొనుగోలు కేంద్రాల్లోనూ దోపిడీ

నిబంధనల ప్రకారం ఈ- క్రాప్‌ నమోదు చేసి కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకుపోయినా అక్కడ కొత్తరకం దోపిడీ జరుగుతోంది. క్వింటాకు 10 కిలోలు అదనంగా ధాన్యాన్ని తీసుకుంటున్నారు. దీనికి తోడు రవాణా చార్జీ పేరుతో టన్నుకు రూ.450 చొప్పున వసూలు చేస్తున్నారు. తేమ నిబంధన కొనుగోలు కేంద్రాల వద్ద నిర్వాహకులు కాసులు కురిపిస్తోంది. దీంతో అన్నదాతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2021-03-03T06:50:18+05:30 IST