రైతు ఉద్యమానికి మద్దతివ్వండి

ABN , First Publish Date - 2021-01-25T04:21:58+05:30 IST

దేశానికి అన్నం పెట్టే అన్నదాతలు రెండునెలల నుంచి ఎముకలు కొరికే చలిలో ఉద్యమం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. రాష్ట్రంలోనూ అడ్డగోలుగా జీవోలను తీసుకొచ్చి ఆస్తిపన్ను పెంచటం సరికాదన్నారు.

రైతు ఉద్యమానికి మద్దతివ్వండి
సమావేశంలో మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

చీకటి జీవోలు ఉపసంహరించుకోవాలి

రౌండ్‌టేబుల్‌ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

విజయనగరం (ఆంధ్రజ్యోతి) జనవరి 24 : దేశానికి అన్నం పెట్టే అన్నదాతలు రెండునెలల నుంచి ఎముకలు కొరికే చలిలో ఉద్యమం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు.  రాష్ట్రంలోనూ అడ్డగోలుగా జీవోలను తీసుకొచ్చి ఆస్తిపన్ను పెంచటం సరికాదన్నారు. వాటిని వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ ఆధ్వరంలో ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నేతలతో రౌండ్‌టేబుల్‌ సమావేశం ఆదివారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రామకృష్ణ మాట్లాడుతూ ప్రధాన మంత్రి మోదీ రైతులకు నష్టం కలిగే విధంగా, కార్పొరేట్‌ సంస్థలకు మేలు చేసేలా తీసుకొచ్చిన జీవోలను భేషరతుగా ఉపసంహరించుకోవాలన్నారు. దేశ రాజధానిలో రైతన్నలు చేపట్టిన దీక్షలు, ఆందోళనలతో కేంద్రంలో వణుకు మొదలైందని, అందుకే  రైతు నాయకులతో 11 పర్యాయాలు సంప్రదింపులు చేసి జీవోలను 18 మాసాలు వాయిదా వేస్తామంటున్నారని చెప్పారు. కానీ జీవోలను రద్దు చెయ్యడం లేదన్నారు. రైతుల దీక్షలో నిజాయితీ ఉందని, కొందరు చనిపోయినా.. మృతదేహాలను ఇంటికి పంపించారు కానీ ఢిల్లీనుంచి ఎవ్వరూ కదల్లేదని గుర్తుచేశారు. రైతులకు మేలుచేసే ఎంఎస్‌ స్వామినాథన్‌ సిఫార్సులు అమలు చేస్తే కేంద్ర ప్రభుత్వానికి నష్టమేమి లేదని, కేవలం రూ.2 లక్షల 28 వేల కోట్లు మాత్రమే ఖర్చువుతుందన్నారు. ఇది కేంద్ర బడ్డెట్‌లో 8 శాతం మాత్రమేనన్నారు. ఈ నెల 26న చేపట్టే రైతుల మద్దతు కవాతుకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.  టీడీపీ మహిళా నేత అదితి గజపతిరాజు మాట్లాడుతూ రైతులు కన్నీరు పెడితే దేశానికి అశుభమని, కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక జీవోలను రద్దుచెయ్యాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో ఆమ్‌ఆద్మీ పార్టీ నేత దయానంద్‌ , కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు సరగడ రమేష్‌కుమార్‌, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌, పి.కామేశ్వరావు, జిల్లా కార్యదర్శి ఒమ్మ రమణ, సిపిఎం నేత తమ్మినేని సూర్యనారాయణ, టిడిపీ నేతలు ఐవీపీ రాజు, బొద్దల నర్శింగరావు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు బుగత ఆశోక్‌, ఆనంద్‌, ఏఐటీయూసీ ప్రతినిధి వి.కృష్ణంరాజు, సీఐటీయూ ప్రతినిధి రమణ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-25T04:21:58+05:30 IST