వంశధార నిర్వాసితులకు అండగా ఉంటాం

ABN , First Publish Date - 2022-05-25T05:41:14+05:30 IST

వంశధార నిర్వాసితులకు అండగా ఉంటామని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు భరోసా ఇచ్చారు. మంగళవారం హిరమండలం పాతబస్టాండ్‌ వద్ద నిర్వాసితులతో ఆయన సమావేశమయ్యారు. నిర్వాసితుల సమస్యలు తెలుసుకున్నారు.

వంశధార నిర్వాసితులకు అండగా ఉంటాం
నిర్వాసితుల సమస్యలు తెలుసుకుంటున్న సోము వీర్రాజు

- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు
- సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌
హిరమండలం, మే 24 :
వంశధార నిర్వాసితులకు అండగా ఉంటామని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు భరోసా ఇచ్చారు. మంగళవారం హిరమండలం పాతబస్టాండ్‌ వద్ద నిర్వాసితులతో ఆయన సమావేశమయ్యారు. నిర్వాసితుల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రమంత్రి ప్రతి 15 రోజులకోసారి రివ్యూ చేస్తున్నారు. వంశధార ప్రాజెక్టుకు సంబంధించి మీరెందుకు రివ్యూ చేయరు. నిర్వాసితులకు ఎందుకు న్యాయం చేయరు’ అని అధికారపార్టీ నేతలను ప్రశ్నించారు.  ‘వంశధార నిర్వాసితులకు 2013 చట్టం అమలు చేస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. కానీ ప్రస్తుతం దాని ఊసేలేదు. ఇటీవల బీజేపీ నేతలు నిర్వాసితుల సమస్యలపై మాట్లాడితే.. రెవెన్యూ మంత్రి వచ్చి మాట్లాడతారని సీఎం చెప్పారు. రెవెన్యూ మంత్రిని నిర్వాసితులు వెళ్లి కలిసి న్యాయం చేయాలని కోరగా.. ఎటువంటి హామీ ఇవ్వలేనని చెప్పేశారు. అందుకే మేమే బాధ్యత వహించి నిర్వాసితుల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామ’ని సోమువీర్రాజు తెలిపారు. రెవెన్యూ మంత్రికి దమ్ముంటే ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు 2013 చట్టం అమలు చేసి.. నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం నిర్వాసితుల సమస్యలపై తహసీల్దార్‌ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పైడి వేణుగోపాలరావు, ఎస్‌.ఉమామహేశ్వరి, ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌, రెడ్డి నారాయణరావు, కుమారస్వామి, ఎ.రవిబాబ్జీ, డి.శ్రీకాంత్‌ రెడ్డి, సి.హెచ్‌ గాంధీ, సలాన రాఘవరావు, బోయిన ధర్మారావు  పాల్గొన్నారు.

Updated Date - 2022-05-25T05:41:14+05:30 IST