నూపుర్‌కు మద్దతు పలికాడని.. తల నరికివేత!

ABN , First Publish Date - 2022-06-29T08:53:08+05:30 IST

అది దుస్తులు కుట్టే దుకాణం. మధ్యాహ్నం సమయం. లోపల షాపు యజమాని తన పని తాను చేసుకుంటున్నాడు.

నూపుర్‌కు మద్దతు పలికాడని.. తల నరికివేత!

రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌లో టైలర్‌ హత్య


నుపుర్‌ శర్మకు మద్దతుగా నెట్‌లో షాపు యజమాని పోస్టు 

కొన్నిరోజులుగా ఆయనకు బెదిరింపులు

కస్టమర్లలా దుకాణంలోకి ఇద్దరు.. 

కొలతలు తీసుకుంటుండగానే కత్తితో వేటు 

ఇస్లాం అవమానానికి ప్రతీకారమని వ్యాఖ్య

తామే చంపామంటూ 3 వీడియోల విడుదల

నిప్పు రాజేశారంటూ మోదీకి బెదిరింపులు 

నిందితుల అరెస్టు.. ఘటనకు  నిరసనలు 

రాష్ట్రమంతటా నెలపాటు 144 సెక్షన్‌ 

పాక్‌ ప్రేరేపిత చర్యగా ఎన్‌ఐఏ అనుమానం

ఎవ్వరినీ వదలం: ముఖ్యమంత్రి గెహ్లోత్‌

ఘటనను ఖండించిన రాహుల్‌, ఒవైసీ


జైపూర్‌, జూన్‌ 28: అది దుస్తులు కుట్టే దుకాణం. మధ్యాహ్నం సమయం. లోపల షాపు యజమాని తన పని తాను చేసుకుంటున్నాడు. బయటి నుంచి కస్టమర్ల రూపంలో ఇద్దరు వ్యక్తులు షాపులోకి వచ్చారు. వారిలో ఒకరికి షాపు యజమాని దుస్తుల కొలతలను తీసుకుంటుండగానే దాచుకున్న కత్తులు బయటకు తీశారు. ఇద్దరిలో ఒకరు మొబైల్‌లో వీడియో తీస్తుండగా మరో వ్యక్తి కత్తితో ఆ యజమానిపై దాడి చేశాడు. మెడపై వేటు వేయడంతో ఆ దర్జీ తల శరీరం నుంచి వేరైంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మంగళవారం పట్టపగలు జరిగిన దారుణమిది. ‘ఇస్లాంకు అవమానం జరిగింది. అందుకు ప్రతీకారం తీర్చుకున్నాం’ అని ఓ వీడియోలో నిందితులు ప్రకటించారు.


హతుడిని ఉదయ్‌పూర్‌కే చెందిన కన్హయ్యా లాల్‌గా గుర్తించారు. మహ్మద్‌ ప్రవక్తపై ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నూపుర్‌ శర్మకు మద్దతుగా పది రోజుల క్రితం కన్హయ్యాలాల్‌ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ పెట్టాడు. దీనిపై ఓ వర్గానికి చెందిన వ్యక్తులకు, కన్హయ్యకు మధ్య వాడివేడి వాదనలు జరిగాయి.  అనంతరం కన్హయ్యాలాల్‌కు వారి నుంచి బెదిరింపులు కూడా వచ్చాయి. కొన్నాళ్లు షాపు మూసేసి అజ్ఞాతంలో గడిపిన ఆయన మళ్లీ వ్యాపారాన్ని మొదలు పెట్టారు.  కాగా హత్య జరిగిన తీరును బట్టి పక్కా పథకం ప్రకారమే ఈ ఘటన జరిగిందని పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనకు ఐసిస్‌ ఉగ్రవాదకు సంస్థకు లేదా పాక్‌ ఉగ్రవాద సంస్థకు లింకులున్నాయా? అనే అనుమానాలూ వ్యక్తమవవుతున్నాయి. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మాత్రం ఈ ఘటనను ‘పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద చర్య’గా భావిస్తోంది. ఈ కేసు దర్యాప్తును ఎన్‌ఐకే అప్పగించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో  ఎన్‌ఐఏకు చెందిన ఓ బృందం ఉదయ్‌పూర్‌కు వెళ్లడం విశేషం. ఈ ఘటన అనంతరం రాజస్థాన్‌ అంతటా నిషేధాజ్ఞలు అమల్లోకి వచ్చాయి. మతపరమైన ఉద్రిక్తతలు జరగకుండా ఉండేందుకు ఆ రాష్ట్రమంతా  హై అలర్ట్‌ ప్రకటించారు.   రాత్రి 8 గంటల ప్రాంతంలో ఉదయ్‌పూర్‌లో కర్ఫ్యూ విధించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేదాకా ఈ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రకటించారు. ఒకనెల పాటు రాజస్థాన్‌ అంతటా 144 సెక్షన్‌ విధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా  ఉదయ్‌పూర్‌ అంతటా దాదాపు 600 మంది పోలీసులను మోహరించారు. ఉదయ్‌పూర్‌ వ్యాప్తంగా 24 గంటలపాటు ఇంటర్‌నెట్‌ సేవలను నిలిపివేశారు.  


పరిహారం చెల్లించాలని డిమాండ్‌  

 హత్య అనంతరం నిందితులు ఘటనాస్థలి నుంచి పారిపోయారు. తర్వాత సోషల్‌ మీడియాలో వీడియోలను పోస్ట్‌చేశారు. హత్య ఘటనతో ఉదయ్‌పూర్‌లోని వ్యాపార వర్గాలు తమ షాపులను మూసేశారు. మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించేందుకు వచ్చిన పోలీసులును అడ్డుకొన్నారు. నిందితులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని, బాధిత కుటుంబానికి నష్టపరిహారంగా రూ.50లక్షలు, ఆ ఇంట్లో ఒకరికి ప్రభుత్వోద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ హామీలు లభించేంత వరకు మృతదేహాన్ని తరలించేందుకు ఒప్పుకోమంటూ నినాదాలు చేశారు. ఈ ఘటనకు నిరసనగా పట్టణంలో ర్యాలీ తీశారు. వాహనాలకు నిప్పు పెట్టారు. 


మోదీ మాట్లాడాలి: గెహ్లోత్‌ 

దర్జీ కన్హయ్య హత్య దారుణం అని ఈ ఘటనను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ పేర్కొన్నారు. హత్య ఘటన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది చాలా బాధాకరమైన, సిగ్గుమాలిన చర్య. హత్య జరిగిన తీరును బట్టి చూస్తే ఇది చిన్న విషయమేమీ కాదని పేర్కొన్నారు. ఈ ఘటన వెనుక ఉన్న ఎవ్వరినీ వదిలిపెట్టబోమని, నేరగాళ్లను కఠినంగా శిక్షిస్తామని ఆయన చెప్పారు. ప్రజలు శాంతిసామరస్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. హత్య ఘటన తాలూకు వీడియోను షేర్‌ చేయొద్దని కోరారు. వీడియో షేర్‌ చేస్తే గనక సమాజంలో విద్వేషాన్ని వ్యాపింపజేయాలనే నేరగాళ్ల పథకం నెరవేరుతుందని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా మతపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయని... హిందువులు, ముస్లింలు అందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. దీనిపై దేశప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ‘ప్రజలను ఉద్దేశించి మోదీ మాట్లాడితే మరింత ప్రభావంతంగా ఉంటుందని నాకు అనిపిస్తోంది. ఏ రకమైన హింసను తాము ఉపేక్షించబోమంటూ ఆయన ప్రకటించాలి’ అని గెహ్లోత్‌ వ్యాఖ్యానించారు. బాధిత కుటుంబానికి సహాయం చేస్తామని ఉదయ్‌పూర్‌ కలెక్టర్‌  పేర్కొన్నారు. ఘటన పట్ల కాంగ్రెస్‌ నేత  రాహుల్‌ గాంధీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మతం పేరుతో జరిగే ఎలాంటి హింసను ఉపేక్షించకూడదన్నారు. ప్రజలంతా శాంతి, సోదరభావంతో ఉండాలని పిలుపునిచ్చారు. 


దేశ సార్వభౌమత్వానికి సవాలు: వీహెచ్‌పీ  

ఉదయ్‌పూర్‌ హత్య ఘటన భారత సార్వభౌమత్వానికి, లౌకిక వాద సిద్ధాంతానికి, ఆలోచనాపరమైన స్వేచ్ఛకు సవాలు అని వీహెచ్‌పీ పేర్కొంది. ఈ సవాలకు వీహెచ్‌పీతో పాటు కేంద్ర ప్రభుత్వం, దేశ ప్రజలు ఎదుర్కొంటారని వీహెచ్‌పీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అలోక్‌ కుమార్‌ వీడియో సందేశంలో పేర్కొన్నారు.  


తామే చంపామంటూ.. 

హత్య ఘటనలో నిందితులను మహమ్మద్‌ రియాజ్‌ అక్తర్‌, మహమ్మద్‌ ఘోష్‌గా గుర్తించారు. ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే ఇద్దరినీ రాజస్థాన్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  దర్జీ కన్హయ్యను తామే హత్యచేసినట్లు ఇద్దరు వ్యక్తులు వీడియో విడుదల చేశారు. హత్య తాలూకు వీడియో, హత్యను చేసినట్లుగా అంగీకరిస్తున్న వీడియోతో పాటు మూడో వీడియోనూ విడుదల చేశారు. రెండో వీడియోలో ఆ ఇద్దరూ తమ చేతుల్లోని కత్తులు చూపుతూ ప్రఽధాని మోదీని ఉద్దేశిస్తూ బెదిరించారు. అందులో ఓ వ్యక్తి.. ‘నా పేరు మహమ్మద్‌ రియాజ్‌ అక్తర్‌. నా పక్కన ఉన్నది ఘోష్‌ మహమ్మద్‌ భాయ్‌ (మహ్మద్‌ ఘోష్‌). ఉదయ్‌పూర్‌లో ఒకరి తల నరికేశాం. ఏయ్‌.. నరేంద్ర మోదీ, విను! నిప్పు నువ్వు రాజేశావు. మేం ఆర్పుతాం. ఇన్షా ఆల్లా.. ఈ కత్తి నీ మెడ దాకా కూడా వస్తుంది. ఉదయ్‌పూర్‌ వాస్తవ్యులారా.. ఇప్పుడు ఒక్కటే నినాదం. తప్పు చేస్తే తల తెగిపడుతుంది’ అని వ్యాఖ్యానించాడు. కాగా నిందితులు విడుదల చేసిన మూడో వీడియో ఈ నెల 17న చిత్రీకరించారు. తొలి వీడియోలో హత్య ఘటన మాదిరిగే ఓ నిందితుడు అందులో కత్తి ఝళిపిస్తున్న దృశ్యాలున్నాయి. 


ఇస్లాంకు వ్యతిరేకం: జమాతే హింద్‌  

దర్జీ కన్హయ్యా లాల్‌ హత్యను ముస్లిం సంస్థ జమాతే హింద్‌ తీవ్రంగా ఖండించింది. ఏ రకంగా చూసినా ఇలాంటి ఘటనలు ఇస్లాంకు వ్యతిరేకమని పేర్కొంది. ‘మన దేశంలో ఓ న్యాయవ్యవస్థ ఉంది. ఎవ్వరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరాదు’ అని జమాతే హింద్‌ జనరల్‌ సెక్రటరీ మౌలానా హకీమోద్దీన్‌ ఖురేషీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలంతా శాంతియుతంగా ఉండాలని కోరారు. హత్య ఘటనను మజ్లిస్‌ చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. ‘ఒకరిని చంపే హక్కు ఎవ్వరికీ లేదు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరాదు. ఒకరిని చంపడాన్ని చట్టం ఎప్పటికీ ఒప్పుకోదు’ అని వ్యాఖ్యానించారు.  దర్జీ హత్య నేరం అంటూనే నూపుర్‌ శర్మనూ అదుపులోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-06-29T08:53:08+05:30 IST