మాఫియా చేతుల్లో ప్రభుత్వ భూములు

ABN , First Publish Date - 2022-06-30T06:07:16+05:30 IST

మాఫియా చేతుల్లో ప్రభుత్వ భూములు

మాఫియా చేతుల్లో ప్రభుత్వ భూములు
పెగడపెల్లి డబ్బాల నుంచి ర్యాలీ తీస్తున్న ఎంపీ బినోయ్‌ విశ్వం, సీపీఐ నాయకులు

గూడు కోసం పేదలు గుడిసెలు వేసుకుంటే దాడులు చేస్తున్నారు..

అక్రమ కేసులు బనాయిస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారు..

భూ కబ్జాదారులకు కొమ్ముకాస్తున్న పోలీసులు

సీపీఐ జాతీయ నేత, రాజ్యసభ సభ్యుడు బినోయ్‌ విశ్వం ధ్వజం

నగరంలో రెండుచోట్ల గుడిసెవాసులతో సమావేశం

గుండ్లసింగారం బాధితుల వద్దకు వెళ్లుతుండగా అడ్డుకున్న పోలీసులు

పెగడపెల్లి డబ్బాల వద్ద పోలీసులకు గుడిసెవాసులకు మధ్య తోపులాట


హనుమకొండ క్రైం /మామునూరు, జూన్‌ 29: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ భూమి భూమాఫియా చేతుల్లో ఉందని, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు భూములను ఆక్రమించి అడ్డదారిలో కోట్లు గడిస్తున్నారని సీపీఐ జాతీయ నేత, రాజ్యసభ సభ్యుడు బినోయ్‌ విశ్వం విమర్శించారు. భూపోరాటానికి మద్దతు తెలిపేందుకు బుధవారం ఆయన  నగరంలో పర్యటించారు.  బొల్లికుంట శివారులో, వరంగల్‌ మండల పరిధి మట్టెవాడ శివారులో గుడిసెలు వేసుకున్న నిరుపేదలను ఆయన కలుసుకొని మాట్లాడారు. అనంతరం గుండ్లసింగారంలోని సర్వే నెంబర్‌ 174, 175లో గుడిసెలు వేసుకొని దాడులకు గురైన ప్రజలను పరామర్శించేందుకు ఎంపీ తన వాహనంలో కార్యకర్తలతో హనుమకొండకు వచ్చారు. పెగడపెల్లి డబ్డాల వద్ద హనుమాన్‌గుడిలో సమావేశమైన గుడిసెవాసులతో మాట్లాడారు. 


ప్రభుత్వాలు పేదలకు ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్లు నిర్మించి ఇవ్వకపోవడం వల్లనే కమ్యూనిస్టులు భూపోరాటాలకు దిగుతున్నారని అన్నారు. గుండ్లసింగారంలో గుడిసెవాసులపై దాడికి దిగిన గూండాలను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇచ్చేవరకు తమ పోరాటం సాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని విస్మరించి కేవలం కాంట్రాక్టర్లకు కొమ్ముకాస్తున్నట్లు ఆరోపించారు. నిరుపేదలకు జీవో 58 ప్రకారం పట్టాలు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేశారన్నారు. అందుకే పేదలు ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు అనేక మంది పేదలు ఇళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేస్తే అక్రమ కేసులు బనాయిస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. భూ కబ్జాదారులకు, ప్రభుత్వ అధికారులకు పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 


గుడిసెవాసుల ఆందోళన

అంతకుముందు  గుండ్లసింగారంలోని సర్వే నెంబర్‌ 174, 175లో గుడిసెలు వేసుకున్న గుడిసెవాసులు ఆందోళనకు దిగారు. వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇవ్వాలని రాస్తారోకో చేశారు. అక్కడికి వచ్చిన సీపీఐ నాయకులను అరెస్టు చేయడతో కేయూ రోడ్డులోని డబ్బాల జంక్షన్‌ నుంచి కేయూ క్రాస్‌రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. గుడిసెవాసులకు పట్టాలు ఇవ్వాలని, ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నినాదాలు చేస్తూ ఎర్రజెండాలతో ఆందోళనకు దిగారు. హనుమాన్‌నగర్‌ జంక్షన్‌లో మానవహారం వేసి ప్రభుత్వ తీరును ఎండగడుతూ బైఠాయించారు. విషయం తెలుసుకున్న కేయూ, హనుమకొండ పోలీసులు అక్కడకు చేరుకుని గుడిసెవాసులను శాంతించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా గుడిసెవాసులు పోలీసులపైకి విరుచుకుపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. 


ఎంపీని అడ్డుకున్న పోలీసులు 

ఎంపీ బినోయ్‌ విశ్వం  నిమ్మాయ చెరువు శిఖంలో, బొల్లికుంటలో వేసుకున్న గుడిసెలు వేసుకున్న పేదలను  కలిసి మాట్లాడారు.  అనంతరం గుండ్లసింగారంలో  దాడులకు గురైన బాధితులను పరామర్శించేందుకు తన వాహనంలో కార్యకర్తలతో హనుమకొండకు వచ్చారు. పెగడపెల్లి డబ్డాల వద్ద హనుమాన్‌గుడిలో సమావేశమైన గుడిసెవాసులతో మాట్లాడారు. అక్కడి నుంచి గుండ్లసింగారంలో వేసుకున్న గుడిసెల వద్దకు కార్యకర్తలతో కలిసి వెళ్లే ప్రయత్నం చేశారు.  


అక్కడకు వెళితే మళ్లీ గొడవలు జరుగుతాయని, శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని ఎంపీకి కేయూ సీఐ వెల్లడించారు. అయినా వినకుండా కార్యకర్తలు, గుడిసెవాసులు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, గుడిసెవాసుల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఎంపీ బినోయ్‌ విశ్వంకు బీపీ పెరిగి జనంలో నుంచి పక్కకు తప్పుకున్నాడు. శ్వాససరిగా ఆడకపోవడంతో అక్కడే ఉన్న ప్రవేటు ఆస్పత్రికి తరలించి పరీక్షలు చేశారు.  అనంతరం ఎంపీతో పాటు సీపీఐ నాయకులను అదుపులోకి తీసుకుని సుబేదారి పీఎ్‌సకు తరలించారు. సాయంత్రం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. 


ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, నాయకులు తోట బిక్షపతి, జ్యోతి, షేక్‌ బాషుమియా, అనిల్‌, రమేష్‌, అక్బర్‌, షాషా, సువర్ణ, శరత్‌, యాకూబ్‌, బుస్సా రవీందర్‌, చంద్రకళ, గుంది బద్రీ, గోవర్దన్‌, జన్ను రవి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-30T06:07:16+05:30 IST