మైనారిటీలను మభ్యపెట్టే రిజర్వేషన్ ‘ఫార్ములా’!

ABN , First Publish Date - 2022-09-22T06:47:36+05:30 IST

కేసీఆర్ ప్రభుత్వం గత ఎనిమిదిన్నరేళ్ళుగా అధికారాన్ని ఎలా నిలబెట్టుకోవాలన్న తపనతో మాత్రమే పాలన సాగిస్తున్నది తప్ప, ప్రజల ఆకాంక్షలను పట్టించుకోవటం లేదు....

మైనారిటీలను మభ్యపెట్టే  రిజర్వేషన్ ‘ఫార్ములా’!

కేసీఆర్ ప్రభుత్వం గత ఎనిమిదిన్నరేళ్ళుగా అధికారాన్ని ఎలా నిలబెట్టుకోవాలన్న తపనతో మాత్రమే పాలన సాగిస్తున్నది తప్ప, ప్రజల ఆకాంక్షలను పట్టించుకోవటం లేదు. తెలంగాణ రాష్ట్రంలో 90శాతానికి పైగా బహుజనులు ఉన్నారని, బహుజనులు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం నిజంగా అభివృద్ధి జరుగుతుందని అనేక ఎన్నికల సభల్లో కేసీఆర్ చెప్పారు. బహుజనుల జనాభా దామాషాకు అనుగుణంగా రిజర్వేషన్లను కల్పిస్తానని హామీ ఇచ్చారు. కానీ అవన్నీ ఎన్నికల ప్రసంగాలు మాత్రమేనని వారి చర్యలు తెలియజేస్తున్నాయి. 


కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన మూడేళ్ళకు, 16 ఏప్రిల్ 2017 ఆదివారంనాడు, ఒక ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి ‘తెలంగాణ బీసీ ఎస్సీ అండ్ ఎస్టీలకు విద్యా సంస్థల్లో సీట్లూ, ప్రభుత్వ సర్వీసులోని ఉద్యోగ నియామకాలలో రిజర్వేషన్ల బిల్లు–2017’ను పాసు చేసి కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం పంపింది. ఈ బిల్లును పైపైన పరిశీలిస్తే బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు పెంచే ప్రత్యేక బిల్లుగా కనిపిస్తుంది. కానీ లోపలి ఉద్దేశాలు వేరే ఉన్నాయి. ఈ బిల్లులో పెంచిన రిజర్వేషన్ శాతాలను ఒకదానితో ఒకటి ముడివేసి కలిపి పంపిన తీరు చూస్తే, రిజర్వేషన్ల చరిత్రలో దీన్ని కొత్తగా ఫార్ములా అనవచ్చు. ఈ ‘కేసీఆర్ రిజర్వేషన్స్ ఫార్ములా’ ముఖ్య ఉద్దేశం– టీఆర్‌ఎస్ పార్టీ 2014 ఎన్నికల సమయంలో వాగ్దానం చేసిన ప్రకారంగా మైనార్టీలకు 12శాతం, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించడం. కానీ ఈ ఫార్ములా కేవలం ముస్లింలను మభ్యపెట్టి మిగిలిన బహుజనులకు రిజర్వేషన్స్ బొంద పెట్టే విధంగా ఉన్నది.


2014 ఎన్నికల మేనిఫెస్టోలోనూ, ప్రచార సభల్లోనూ టీఆర్‌ఎస్ తెలంగాణలోని ముస్లిం మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని పేర్కొంది. తెలంగాణలో ముస్లిం మైనార్టీల జనాభా రాష్ట్ర మొత్తం జనాభాలో 12.68శాతం. అంటే 44.4 లక్షలు. అనంతరామన్ కమిషన్ ముస్లిం వర్గాలలోని దూదేకుల, మెహతార్ వర్గాలను గుర్తించి బీసీ–బీ, ఏ గ్రూపులో చేర్చింది. కాబట్టి వీరి జనాభా తీసివేయగా మిగిలిన ముస్లింల జనాభా 11.18శాతం మాత్రమే. ఇందులో అగ్రవర్ణ ముస్లింల జనాభా 3.11శాతం పోగా మిగిలింది 8.07శాతం. ‘బీసీ–ఈ’ గ్రూపులోని ముస్లిం జనాభా అందరినీ కూడా పేదలుగా పరిగణించలేము. కానీ సుధీర్ కమిషన్, తెలంగాణ బీసీ కమిషన్ ముస్లిం మైనార్టీ వర్గాలకు 9శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని సిఫారసులు చేసినారు. కేసీఆర్ ప్రభుత్వం ఈ కమిషన్ల సిఫారసులను బేఖాతరు చేసి, తన విశేష అధికారాలను ఉపయోగించి బీసీ–ఈ గ్రూపుకు రిజర్వేషన్లను 4శాతం నుండి 12శాతానికి పెంచింది. తమిళనాడు తరహా ‘నైన్త్ షెడ్యూలు’ పెట్టిస్తామని ముస్లిం ప్రజలను మభ్యపెడుతూ, ముస్లిం పేదలను మోసం చేస్తూ, కేంద్ర ప్రభుత్వంపై ముస్లింలకు వ్యతిరేకమనే నింద వెయ్యవచ్చన్నది కేసీఆర్ రాజకీయ కుట్ర. ముస్లిం వర్గమైన ‘బీసీ–ఈ’ గ్రూపుకు కల్పించిన రిజర్వేషన్ శాతం రాష్ట్రంలోని ముస్లిం జనాభా దామాషాతో పోలిస్తే ఎక్కువ శాతం ఉన్నది కాబట్టి దీన్ని మతపరమైన రిజర్వేషనుగా పరిగణిస్తారనీ, అత్యున్నత న్యాయస్థానం వీటిని రాజ్యాంగ విరుద్ధమని తేల్చుతుందనీ టీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ పెద్దలకు తెలుసు. ముస్లిం ప్రజలను మభ్యపెట్టి వారి ఓట్లను గంపగుత్తగా పొందటమే ఇక్కడ ముఖ్యోద్దేశం.


టీఆర్‌ఎస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో గిరిజనుల రిజర్వేషన్లను 6శాతం నుంచి 12 శాతానికి పెంచుతామని పేర్కొంది. కానీ అసెంబ్లీలో పెట్టిన బిల్లులో గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ మాత్రమే ప్రతిపాదించారు. ఎస్టీ జాబితాలో గుర్తింపు లేని కేంద్ర పరిశీలనలో ఉన్న రెండు కులాలను (వాల్మీకి బోయ, కాగిత లంబాడాలను) చేర్చారు. ఈ ప్రతిపాదనను ముస్లిం వర్గాల రిజర్వేషన్ పెంపు అంశంతో కలిపి కేంద్రానికి అనుమతి కోసం పంపినారు. ఇలా కలిపి పంపడం వలన గత ఎనిమిదిన్నరేళ్ళుగా గిరిజనులు విద్యా ఉద్యోగ రంగాలలో అనేక అవకాశాలు కోల్పోయినారు. షెడ్యూల్ తెగల రిజర్వేషన్స్ సాంఘిక సంక్షేమ శాఖ పరిధికి సంబంధించినవి, ముస్లిం వర్గాల బీసీ–ఈ గ్రూపు రిజర్వేషన్స్ వెనుకబడిన తరగతుల శాఖకు సంబంధించినవి. వేరు వేరు శాఖలకు సంబంధించినవి కలపడం అంటే ఎస్టీలను మభ్యపెట్టడం, మోసం చెయ్యడమే. ఇదే కేసీఆర్ ప్రభుత్వం లక్ష్యం.


తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకా అన్ని రకాలుగా నష్టపోయిన ముఖ్య వర్గం బహుజనులు. తెలంగాణలో 54శాతం పైగా ఉన్న బీసీల జనాభాకు రిజర్వేషన్లు 25శాతం మాత్రమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన బీసీ కమిషన్లు బీసీ రిజర్వేషన్లను 44 శాతం వరకు పెంచవచ్చని సిఫారసు చేసినా ఫలితం లేకపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక అయినా కేసీఆర్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల శాతం పెంచుతారని ఆశపడ్డారు.


బీసీ జాబితాలో ఎ, బి, సి, డి, ఈ గ్రూపులు ఉన్నప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం ముస్లిం వర్గాలకు చెందిన ‘బీసీ–ఈ’ గ్రూపు పైన అధ్యయనం చేయడానికి మాత్రమే సుధీర్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ముస్లింలకు రిజర్వేషన్లను 4శాతం నుంచి 12శాతానికి పెంచాలనే ఉద్దేశంతోనే ఈ కమిషన్ ఏర్పాటయ్యింది. సుధీర్ కమిషన్, తెలంగాణ బీసీ కమిషన్ అధ్యయనంలో భాగంగా బీసీ ఎ, బి, సి, డి గ్రూపులను ఒక ముద్దగా హిందూ బీసీల పేరుతోనూ, బీసీ–ఈ గ్రూపులోని ముస్లిం వర్గాలను ముస్లిం బీసీలుగానూ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, హిందూ బీసీ, ముస్లిం బీసీల మధ్య తులనాత్మక అధ్యయనాలు చేయకుండానే ముస్లిం బీసీ గ్రూపు ఉన్న ‘బీసీ–ఈ’ రిజర్వేషన్లను 4శాతం నుండి 9శాతం పెంచాలని సిఫారసులు చేసినారు.


ఈ బిల్లుపై జరిగిన చర్చలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీల సమగ్ర అభివృద్ధికై బీసీలలోని అన్ని కులాలపై సంపూర్ణ అధ్యయనం చేయవలసిందిగా రాష్ట్ర బీసీ కమిషన్‌ను కోరుతానని వారి నివేదిక రాగానే బీసీ– ఎ, బి, సి, డి ల రిజర్వేషన్ శాతాన్ని కూడా పెంచుకోవచ్చని తెలిపినారు. ఈ బిల్లు పాస్ అయి దాదాపు ఐదున్నరేళ్లు గడిచినా కమిషన్ బీసీలపై అధ్యయనాలు జరుపలేదు. కేవలం ముస్లిం వర్గాలకు చెందిన బీసీ–ఈ గ్రూపు పైన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడానికి కారణం బుజ్జగింపు ఓటు రాజకీయాలు మాత్రమే.

సూర్యపల్లి శ్రీనివాస్

ఓబీసీ స్టేట్ పాలసీ రీసెర్చ్, బీజేపీ – తెలంగాణ

Updated Date - 2022-09-22T06:47:36+05:30 IST