హిజాబ్ వివాదంపై విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం

ABN , First Publish Date - 2022-04-26T23:06:00+05:30 IST

విద్యా సంస్థల్లో హిజాబ్ ధారణను నిషేధించడాన్ని సమర్థిస్తూ

హిజాబ్ వివాదంపై విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం

న్యూఢిల్లీ : విద్యా సంస్థల్లో హిజాబ్ ధారణను నిషేధించడాన్ని సమర్థిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అపీళ్ళను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. సీనియర్ అడ్వకేట్ మీనాక్షి అరోరా ఈ అపీళ్ళ గురించి ప్రస్తావించినపుడు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ స్పందిస్తూ, రెండు రోజులు వేచి ఉండాలని, తాను త్వరలోనే వీటిని కేసుల విచారణ జాబితాలో పెడతానని చెప్పారు. 


పాఠశాలలు, కళాశాలల యూనిఫాం నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను కర్ణాటక హైకోర్టు సమర్థించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ అనేక పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. ప్రభుత్వ అధికారులు సవతి తల్లి మాదిరిగా వ్యవహరిస్తుండటంతో విద్యార్థులు తమ మత విశ్వాసాలను పాటించేందుకు అవకాశం ఉండటం లేదని, దీనివల్ల అవాంఛనీయ శాంతిభద్రతల పరిస్థితులు తలెత్తుతున్నాయని  ఓ పిటిషనర్ ఆరోపించారు. 


కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రుతు రాజ్ అవస్థి, జస్టిస్ కృష్ణ దీక్షిత్, జస్టిస్ జేఎం ఖాజీ ఇచ్చిన తీర్పులో, యూనిఫాంలను నిర్ణయించడం సమంజసమేనని చెప్పారు. యూనిఫాంను నిర్దేశించడంపై విద్యార్థులు అభ్యంతరం తెలపకూడదని పేర్కొన్నారు. 


Updated Date - 2022-04-26T23:06:00+05:30 IST