Supreme Court: వివేకా హత్యకేసు నిందితుడు శివశంకర్‌రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

ABN , First Publish Date - 2022-09-26T18:53:39+05:30 IST

వివేకా హత్య కేసులో నిందితుడుగా ఉన్న శివశంకర్‌రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.

Supreme Court: వివేకా హత్యకేసు నిందితుడు శివశంకర్‌రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

ఢిల్లీ (Delhi): వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (Viveka murder case)లో నిందితుడిగా ఉన్న శివశంకర్‌రెడ్డి (Sivashankar Reddy)కి సుప్రీంకోర్టు (Supreme Court)లో చుక్కెదురైంది. బెయిల్ (Bail) ఇచ్చేందుకు నిరాకరించింది. బెయిల్ ఇవ్వడానికి సరైన కారణాలు తమకు కనిపించడంలేదని, హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఈ దశలో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. శివశంకర్‌రెడ్డి తరపున కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ కౌన్సిల్ అభిషేక్‌ మనుసింఘ్వీ (Abhishek Manusinghvi) వాదనలు వినిపించారు.  వివేకానందరెడ్డి హత్యకేసులో తొలుత దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌ (FIR)లో శివశంకర్ రెడ్డి పేరు లేదని ఆయన వాదించారు. అప్రూవర్‌గా మారిన వాచ్‌మెన్ స్టేట్ మెంట్‌లో కూడా శివశంకరరెడ్డి పేరు లేదన్నారు. ఏ1 గా ఉన్న నిందితుడికి మూడు నెలల్లో బెయిల్ ఇచ్చారని, 11 నెలలు అవుతున్నా, ఎలాంటి సాక్ష్యాలు లేకపోయినా శివశంకర్‌రెడ్డికి బెయిల్ ఇవ్వడం లేదని న్యాయవాది విన్నవించారు. ప్రస్తుత పరిస్థితుల్లో... ఈ కేసులో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ... పిటిషన్‌ను తిరస్కరించింది. 


శివశంకర్ రెడ్డిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

వివేకా హత్య కేసులో కింగ్ పిన్ (కీలకవ్యక్తి) శివశంకర్ రెడ్డేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. శివశంకర్ రెడ్డి నిందితుడు కాదని తాము భావించడం లేదంది. బెయిల్ ఇస్తే.. సాక్ష్యాలు తారు మారు చేస్తారనే అభియోగాలు ఉన్నాయని జస్టిస్ ఎం.ఆర్ షా, జస్టిస్ కృష్ణ మురారి బెంచ్ పేర్కొంది. అలా అనేందుకు ఎక్కడా ఆధారాలు లేవని శివశంకర్ రెడ్డి తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదించారు. ఇప్పుడు ఈ కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయించాలని చూస్తున్నారని అన్నారు. కాగా ఇప్పటికే శివశంకర్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పును శివశంకర్‌రెడ్డి సవాల్ చేస్తూ.. సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై సోమవారం విచారణ జరిగింది. వాదనలు విన్న ధర్మాసనం ఈ మేరకు పిటిషన్ కొట్టివేసింది. 

Updated Date - 2022-09-26T18:53:39+05:30 IST