వ్యవస్థపై నమ్మకం ఉంచండి : సుప్రీంకోర్టు

ABN , First Publish Date - 2021-08-10T19:25:23+05:30 IST

వ్యవస్థను ఉపయోగించుకునేవారు దానిని నమ్మాలని

వ్యవస్థపై నమ్మకం ఉంచండి : సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : వ్యవస్థను ఉపయోగించుకునేవారు దానిని నమ్మాలని సుప్రీంకోర్టు తెలిపింది. పెగాసస్ స్పైవేర్‌తో కొందరిపై నిఘా పెట్టినట్లు వచ్చిన ఆరోపణలపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. కోర్టుల్లో పిటిషన్లు వేసి, సామాజిక మాధ్యమాల్లో అవే అంశాలపై సమాంతరంగా చర్చలు జరపడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. 


పెగాసస్‌తో నిఘా ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై స్పందించేందుకు కేంద్ర ప్రభుత్వానికి సోమవారం వరకు గడువు ఇచ్చింది. ఈ అంశంపై విచారణ జరుగుతున్న సమయంలో బహిరంగ వేదికలపై చర్చించడం మానుకోవాలని పిటిషనర్లను కోరింది. ఈ అంశంపై ఆసక్తిగల పిటిషనర్ ఎవరైనా, వార్తా పత్రికల్లోని విషయాలను చెప్తూ ఉంటే, అటువంటి వారు కోర్టు గదిలో సరైన మార్గంలో మా ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారని, బయట నుంచి కాదని ఆశిస్తున్నామని తెలిపింది. కోర్టులో చర్చ జరగాలని పిటిషనర్లు అర్థం చేసుకుంటారని భావిస్తున్నామని పేర్కొంది. వారికి వ్యవస్థపై తప్పనిసరిగా నమ్మకం ఉండాలని తెలిపింది. ‘‘కానీ ఈ సమాంతర చర్చ, సమాంతర సంభాషణ....’’ అని తెలిపింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషనర్ల తరపు న్యాయవాదులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసింది.


క్రమశిక్షణతో వ్యవహరించాలని చెప్తూ తాము కొన్ని ప్రశ్నలను అడిగామని పేర్కొంది. విచారణ ప్రక్రియ అనేది ఒకటి ఉందని తెలిపింది. కొన్నిసార్లు అది కొందరికి అసౌకర్యంగా ఉండవచ్చునని, మరికొన్నిసార్లు సౌకర్యవంతంగా ఉండవచ్చునని తెలిపింది. అయితే ప్రక్రియ అనేది ఆ విధంగానే ఉంటుందని పేర్కొంది. ఇరు పక్షాలు దీనిని ఎదుర్కొనవలసి ఉంటుందని తెలిపింది. దేనినైనా కోర్టు దృష్టికి తేవాలనుకుంటే, సంబంధిత దస్తావేజులను కోర్టుకు సమర్పించాలని తెలిపింది. 


సీజేఐ జస్టిస్ రమణ మాట్లాడుతూ, ఇది పిటిషనర్లకు తమ ధర్మాసనంలోని అందరు న్యాయమూర్తుల సందేశమని తెలిపారు. ఈ ధర్మాసనంలో జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ సూర్యకాంత్ ఉన్నారు. పిటిషనర్లలో అడ్వకేట్ ఎంఎల్ శర్మ, మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా, రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిటాస్, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా (ఈజీఐ), పాత్రికేయులు ఎన్ రామ్, శశి కుమార్, పరంజయ్ గుహ ఠకుర్ట, రూపేష్ కుమార్ సింగ్, ఇప్షిత శతాక్షి, ఎస్ఎన్ఎం అబ్డి, ప్రేమ్ శంకర్ ఝా తదితరులు ఉన్నారు. 


Updated Date - 2021-08-10T19:25:23+05:30 IST