Uttar Pradesh: బుల్డోజర్ యాక్షన్‌పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ

ABN , First Publish Date - 2022-06-16T19:56:14+05:30 IST

ఉత్తర ప్రదేశ్‌లో రాళ్ళు విసిరిన సంఘటనల్లో నిందితుల అక్రమ

Uttar Pradesh: బుల్డోజర్ యాక్షన్‌పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ

న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్‌లో రాళ్ళు విసిరిన సంఘటనల్లో నిందితుల అక్రమ ఆస్తులపై బుల్డోజర్‌తో చర్యలు చేపట్టడాన్ని నిలిపేసేందుకు సుప్రీంకోర్టు గురువారం నిరాకరించింది. తాము కేవలం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని మాత్రమే చెప్పగలమని తెలిపింది. జామియా ఉలేమా ఈ హింద్ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. 


అక్రమ నిర్మాణాల కూల్చివేత చట్ట ప్రకారం జరగాలని, ప్రతీకార ధోరణి ఉండకూడదని సుప్రీంకోర్టు సలహా ఇచ్చింది. తదుపరి విచారణ మంగళవారం జరుగుతుందని, అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై స్పందించాలని ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రయాగ్‌రాజ్, కాన్పూరు పురపాలక సంఘాలకు నోటీసులు ఇచ్చింది. ప్రతి అంశం నిష్పాక్షికంగా, న్యాయంగా ఉండాలని తెలిపింది. అధికారులు చట్టం ప్రకారం మాత్రమే చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామని తెలిపింది. భద్రతకు భరోసా ఉండేవిధంగా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. 


ఇదిలావుండగా, కూల్చివేతలను నిలిపేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తాము కూల్చివేతలను నిలిపేయలేమని, కేవలం చట్టానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని మాత్రమే తాము చెప్పగలమని న్యాయమూర్తులు తెలిపారు. 


ఉత్తర ప్రదేశ్‌లో చట్టవిరుద్ధంగా ఇళ్ళను కూల్చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలువరించాలని కోరుతూ ఈ పిటిషన్‌ను జామియా ఉలేమా ఈ హింద్ దాఖలు చేసింది. అక్రమ కూల్చివేతలకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. చట్టపరమైన సముచిత ప్రక్రియను అనుసరించకుండా ఇకపై ఎటువంటి కూల్చివేతలు ఉండబోవని రాష్ట్ర ప్రభుత్వం నుంచి హామీ పొందాలని కోరింది. 


బీజేపీ మాజీ నేత నూపుర్ శర్మ ప్రవక్త మహమ్మద్‌పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్‌లో చాలా చోట్ల ముస్లింలు హింసాత్మక నిరసన ప్రదర్శనలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ప్రయాగ్‌రాజ్, కాన్పూరు పురపాలక సంఘాలు నిందితుల అక్రమ నిర్మాణాలను కూల్చేశాయి. 


ఇదిలావుండగా, అక్రమ నిర్మాణాల కూల్చివేతలో ఏ మతస్థులనూ లక్ష్యంగా చేసుకోలేదని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ప్రయాగ్‌రాజ్, కాన్పూరులలో జరిగిన కూల్చివేతల సంఘటనల్లో చట్టపరమైన సముచిత ప్రక్రియను అనుసరించినట్లు తెలిపింది. ముందుగా నోటీసులు ఇచ్చి, ఈ చర్యలు తీసుకున్నట్లు వివరించింది. 


Updated Date - 2022-06-16T19:56:14+05:30 IST