Central Vista ప్రాజెక్టు పనుల నిలిపివేతకు సుప్రీంకోర్టు నిరాకరణ

ABN , First Publish Date - 2021-05-07T21:13:47+05:30 IST

దేశ రాజధాని నగరంలో నూతన పార్లమెంటు భవనంతో కూడిన సెంట్రల్

Central Vista ప్రాజెక్టు పనుల నిలిపివేతకు సుప్రీంకోర్టు నిరాకరణ

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరంలో నూతన పార్లమెంటు భవనంతో కూడిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పనులను ఆపేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ అంశం ఢిల్లీ హైకోర్టు విచారణలో ఉన్నందువల్ల ఈ నిర్ణయం తీసుకుంది. పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించి, సోమవారం అత్యవసరంగా విచారణ జరపాలని కోరవచ్చునని తెలిపింది. జస్టిస్ వినీత్ సరణ్, జస్టిస్ దినేశ్ మహేశ్వరి ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. 


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం సెంట్రల్ విస్టా ప్రాజెక్టును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టులో భాగంగా నూతన పార్లమెంటు భవనాన్ని నిర్మించడంతోపాటు 3.2 కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రభుత్వ పరిపాలన భవనాల నిర్మాణం, పునరుద్ధరణ జరుగుతాయి. దీనికి సుమారు రూ.20 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా. 


కోవిడ్-19 మహమ్మారి రెండో ప్రభంజనం తీవ్రరూపం దాల్చడంతో ఢిల్లీలో నిర్మాణ పనులను నిలిపేయాలని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఆదేశించింది. అయితే సెంట్రల్ విస్టా ప్రాజెక్టును అత్యవసర విభాగంలోకి చేర్చి, ప్రత్యేక అనుమతులు ఇచ్చి, ఇక్కడి పనులను కొనసాగిస్తున్నారు. 


డీడీఎంఏ ఆదేశాలకు అనుగుణంగా దేశ రాజధాని నగరంలోని అన్ని రకాల నిర్మాణ పనులను నిలిపేయాలని, సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణ పనులను కూడా నిలిపేయాలని పిటిషనర్ సుప్రీంకోర్టును కోరారు. సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ లూథ్రా పిటిషనర్ తరపున సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తూ, నిర్మాణ పనులు అత్యవసర కార్యకలాపాలు ఎలా అవుతాయని ప్రశ్నించారు. ఆరోగ్య సంబంధ అత్యవసర పరిస్థితి ఉందని, ఈ సమయంలో కార్మికులు, వారి కుటుంబాలను ప్రమాదంలోకి నెట్టకూడదని, అదే సమయంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై ఒత్తిడి పెంచకూడదని అన్నారు. 


పిటిషనర్ వాదనలపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివాదం ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టు విచారణలో ఉందన్నారు. పిటిషనర్ ఇదే పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టులో కూడా దాఖలు చేశారని చెప్పారు. హైకోర్టులో తదుపరి విచారణ మే 17న జరుగుతుందన్నారు. దీనిపై సిద్ధార్థ లూథ్రా స్పందిస్తూ, మే నెల మధ్య కాలంలో కోవిడ్-19 మహమ్మారి మరింత వికృతరూపం దాల్చుతుందని నిపుణులు చెప్తున్నారని, అందువల్ల ఇది అత్యవసరమైన విషయమని చెప్పారు. 


జస్టిస్ వినీత్ సరణ్, జస్టిస్ దినేశ్ మహేశ్వరి ధర్మాసనం ఈ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఈ వివాదం ప్రస్తుతం హైకోర్టు విచారణలో ఉందని, సోమవారం అత్యవసరంగా విచారణ జరపాలని హైకోర్టును కోరవచ్చునని పిటిషనర్‌కు తెలిపింది. 


Updated Date - 2021-05-07T21:13:47+05:30 IST