లఖింపూర్ ఖేరీ కేసులో సాక్షులకు రక్షణ కల్పించాలి : సుప్రీంకోర్టు

ABN , First Publish Date - 2022-03-16T19:42:49+05:30 IST

లఖింపూర్ ఖేరీ కేసులో సాక్షులకు రక్షణ కల్పించాలని

లఖింపూర్ ఖేరీ కేసులో సాక్షులకు రక్షణ కల్పించాలి : సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : లఖింపూర్ ఖేరీ కేసులో సాక్షులకు రక్షణ కల్పించాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది. ఓ ప్రధాన సాక్షిపై దాడి జరిగినట్లు పిటిషనర్లు చెప్పడంతో ఈ ఆదేశాలను జారీ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రాకు బెయిలు మంజూరు చేయడాన్ని పిటిషనర్లు సవాల్ చేశారు. 


2021 అక్టోబరులో ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో నిరసన తెలుపుతున్న రైతులపై నుంచి ఓ కారు దూసుకెళ్ళింది. ఈ కారు కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు చెందినదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నలుగురు రైతులు ఉన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఆశిష్ మిశ్రాకు బెయిలు మంజూరు చేసి, విడుదల చేయడాన్ని ముగ్గురు రైతుల కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అలహాబాద్ హైకోర్టు ఫిబ్రవరి 10న ఆశిష్‌కు బెయిలు మంజూరు చేసింది. 


రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తగిన సహకారం అందించలేదని, ఆశిష్‌కు మంజూరైన బెయిలు చట్టం దృష్టిలో సమర్థనీయం కాదని పిటిషనర్లు వాదించారు. ఆశిష్‌పై చార్జిషీటును కోర్టుకు సమర్పించలేదని, దానిని కోర్టు పరిశీలించలేదని తెలిపారు. 


పిటిషనర్ల తరపున సీనియర్ అడ్వకేట్ దుష్యంత్ దవే, అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. ఆశిష్ మిశ్రాకు బెయిలు మంజూరైన తర్వాత ఓ ప్రధాన సాక్షిపై కిరాతకంగా దాడి జరిగిందని ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. బీజేపీ ప్రభుత్వం గెలిచిందని, నీ సంగతి చూస్తుందని బెదిరించారని చెప్పారు. 


దీనిపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ స్పందిస్తూ, ‘‘మేడమ్, ఏమిటిది? ఓ సాక్షిపై దాడి జరిగిందని వాళ్లు చెప్తున్నారు. మీరు సవివరమైన కౌంటర్ దాఖలు చేయాలి. సాక్షులకు రక్షణ కల్పించాలి. హోళీ తర్వాత వెంటనే దీనిని విచారిస్తాం’’ అని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ న్యాయవాది రుచిర గోయల్‌కు చెప్పారు. 


Updated Date - 2022-03-16T19:42:49+05:30 IST