Supreme Court : నూపుర్ శర్మకు సుప్రీంకోర్టులో ఊరట

ABN , First Publish Date - 2022-08-10T22:34:43+05:30 IST

భారతీయ జనతా పార్టీ మాజీ నాయకురాలు నూపుర్ శర్మపై

Supreme Court : నూపుర్ శర్మకు సుప్రీంకోర్టులో ఊరట

న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ మాజీ నాయకురాలు నూపుర్ శర్మపై దేశవ్యాప్తంగా నమోదైన 10 కేసులపై విచారణను ఢిల్లీ కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు బుధవారం ఆదేశాలిచ్చింది. దీంతో ఆమెకు గొప్ప ఉపశమనం లభించింది. ఓ టీవీ చర్చా కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలువురు ఆమెపై ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. 


తనపై నమోదైన అన్ని కేసులను ఒకే చోట విచారించే విధంగా ఆదేశాలివ్వాలని నూపుర్ శర్మ సుప్రీంకోర్టును కోరారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ అభ్యర్థనను వ్యతిరేకించింది. ఈ విజ్ఞప్తిపై సుప్రీంకోర్టు జూలై 1న స్పందిస్తూ ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టపరమైన ఇతర ఉపశమనాలను ఆశ్రయించాలని ఆదేశించింది. ప్రవక్త మహమ్మద్‌పై వ్యాఖ్యలు చేసినందుకు మండిపడింది. ఆమె వ్యాఖ్యలు దేశంలో దురదృష్టకర సంఘనలకు దారి తీశాయని పేర్కొంది. దేశంలో జరుగుతున్న సంఘటనలకు ఆమె మాత్రమే బాధ్యురాలని పేర్కొంది. ఉదయ్‌పూర్‌లో దర్జీ కన్నయ్య లాల్ హత్యకు ఆమె వ్యాఖ్యలే కారణమని పేర్కొంది. నూపుర్ శర్మ జాతీయ టెలివిజన్ చానల్‌లో యావత్తు దేశానికి క్షమాపణ చెప్పాలని తెలిపింది. ఆమె తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని, క్షమాపణ చెప్పడానికి చాలా ఆలస్యం చేశారని పేర్కొంది. 


నూపుర్ శర్మ మే నెలలో ఓ టీవీ చర్చా కార్యక్రమంలో మాట్లాడారు. అప్పట్లో ఆమె బీజేపీ అధికార ప్రతినిధిగా ఉండేవారు. మహమ్మద్ ప్రవక్తపై ఆమె చేసిన వ్యాఖ్యలతో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమైంది. పాకిస్థాన్, కతార్, వంటి 14 ముస్లిం దేశాలు తమ అభ్యంతరాన్ని తెలిపాయి. దీంతో ఆమెను బీజేపీ సస్పెండ్ చేసింది.


Updated Date - 2022-08-10T22:34:43+05:30 IST