తమిళనాడు విద్యార్థిని ఆత్మహత్య కేసు సీబీఐకి : సుప్రీంకోర్టు

ABN , First Publish Date - 2022-02-14T19:32:25+05:30 IST

తమిళనాడులోని తంజావూర్‌కు చెందిన పదిహేడేళ్ళ విద్యార్థిని

తమిళనాడు విద్యార్థిని ఆత్మహత్య కేసు సీబీఐకి : సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : తమిళనాడులోని తంజావూర్‌కు చెందిన పదిహేడేళ్ళ విద్యార్థిని ఆత్మహత్య కేసుపై సీబీఐ దర్యాప్తునకు సుప్రీంకోర్టు సోమవారం అనుమతి ఇచ్చింది. మద్రాస్ హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించాలని జారీ చేసిన ఆదేశాలపై రాష్ట్ర డీజీపీ దాఖలు చేసిన అపీలుపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేల ఎం త్రివేది సుప్రీంకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. 


సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) దర్యాప్తు కోసం హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకించడం ద్వారా ఈ కేసును పరువు, ప్రతిష్ఠలకు సంబంధించిన అంశంగా పరిగణించవద్దని తమిళనాడు ప్రభుత్వానికి సలహా ఇచ్చింది. ఇప్పటి వరకు సేకరించిన సాక్ష్యాధారాలను సీబీఐకి అప్పగించాలని తమిళనాడు పోలీసులను ఆదేశించింది. బలవంతపు మత మార్పిడి ఆరోపణలపై కూడా సీబీఐ దర్యాప్తు చేయాలని ఆదేశించింది. ఈ నోటీసుకు రెండు వారాల్లోగా సమాధానాన్ని దాఖలు చేయాలని తెలిపింది. 


క్రైస్తవంలోకి మారలేదని...

స్థానిక మీడియా కథనాల ప్రకారం, తమిళనాడులోని తంజావూరుకు చెందిన ఓ బాలిక సెయింట్ మైఖేల్స్ గర్ల్స్ హోమ్‌లో ఉంటూ 12వ తరగతి చదువుతున్నారు. ఆమె వయసు 17 సంవత్సరాలు. ఆమెను క్రైస్తవ మతంలోకి మారాలని ఆ హాస్టల్ అధికారులు ఆమెపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చేవారని ఆరోపణలు వచ్చాయి. తాను క్రైస్తవ మతంలోకి మారబోనని ఆమె చెప్పడంతో ఆమె చేత హాస్టల్ గదులను తుడిపించడం వంటి పనులు చేయిస్తూ ఆమెను వేధించేవారు. ఈ వేధింపులను భరించలేక ఆమె జనవరి 9న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె స్పృహలోకి వచ్చిన తర్వాత తాను హాస్టల్‌లో అనుభవించిన బాధలను వైద్యులకు చెప్పారు. వైద్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన వచ్చి ఆమెను ప్రశ్నించారు. ఆమె వాగ్మూలాన్ని నమోదు చేసుకుని, హాస్టల్ వార్డెన్‌ను అరెస్టు చేశారు. అయితే బాధితురాలు జనవరి 19న ప్రాణాలు కోల్పోయారు. 


బాధితురాలి వీడియో

మరోవైపు బాధితురాలు విడుదల చేసిన ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. హాస్టల్ వార్డెన్ తనను నిరంతరం దూషిస్తూ ఉండేవారని, అన్ని గదులను తన చేత తుడిపించేవారని, క్రైస్తవంలోకి మారాలని నిరంతరం ఒత్తిడి తీసుకొస్తూ, నిర్బంధించేవారని ఈ వీడియోలో ఆమె చెప్పారు. 


రాజకీయ రంగు 

దీంతో అధికారంలోని డీఎంకే రంగంలోకి దిగింది. బాలిక ఆత్మహత్యకు మతపరమైన రంగు పులమాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. బీజేపీ విద్వేష ప్రచారం చేస్తోందని మండిపడింది. తమిళనాడులో అశాంతిని సృష్టించాలని బీజేపీ ప్రయత్నిస్తోందని డీఎంకే నేత కనిమొళి ఆరోపించారు. 


ఎన్‌సీపీసీఆర్‌కు అందని సహకారం

ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ మద్రాస్ హైకోర్టు మధురై ధర్మాసనం జనవరి 31న తీర్పు చెప్పింది. ఇదిలావుండగా బాలికపై హాస్టల్‌లో జరిగిన దురాగతాలపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ (ఎన్‌సీపీసీఆర్)కు ఫిర్యాదు అందింది. బాధితురాలు క్రైస్తవంలో చేరేందుకు అంగీకరించకపోవడంతో హాస్టల్ వార్డెన్ ఆమె చేత వాష్ డిషెస్, టాయిలెట్స్ శుభ్రం చేయించేవారని ఈ ఫిర్యాదులో ఆరోపించారు. 


ఈ ఫిర్యాదు మేరకు దర్యాప్తు కోసం తమిళనాడు వెళ్ళిన ఎన్‌సీపీసీఆర్ బృందం సమస్యలను ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై దర్యాప్తు చేసేందుకు తమకు అవసరమైన సదుపాయాలను, సహకారాన్ని అందించడంలో తమిళనాడు ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించిందని ఈ బృందం ఓ ప్రకటనలో ఆరోపించింది. ఎన్‌సీపీసీఆర్ చైర్మన్ ప్రియాంక్ కనూంగో నేతృత్వంలోని బృందం జనవరి 31న తంజావూరులో విచారణ జరిపింది.


Updated Date - 2022-02-14T19:32:25+05:30 IST