
కుటుంబ సభ్యుల ఆకలికేకలు చూడలేక ఆత్మహత్యాయత్నం
న్యూఢిల్లీ, జనవరి 21: తన భార్యా పిల్లలు బుక్కెడు బువ్వ లేక పస్తులతో బాధపడుతుండటం ఆ ఇంటి పెద్దను కలిచివేసింది. రోజూ వారి ఆకలి మంటలను చూడలేక తాను మంటల్లో దహనమవడమే మేలనుకున్నాడు. భారత సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఎదుటకొచ్చి ఒంటికి నిప్పుపెట్టుకున్నాడు. శుక్రవారం ఈ ఘటనతో అక్కడ కలకలం రేగింది. మంటలతో ఆర్తనాదాలు చేస్తూ కిందపడి దొర్లుతున్న బాధితుడిని పోలీసులు రక్షించారు. మంటలార్పేసి ఆస్పత్రికి తరలించారు. బాధితుడికి 50 ఏళ్లు అని, నోయిడాకు చెందిన వ్యక్తి అని గుర్తించారు. ఎందుకీ పని చేశావు అని పోలీసులు ఆయన్ను అడిగితే.. ‘‘నాది నిరుపేద కుటుంబం, మా ఇంట్లో అంతా ఆకలితో అలమటిస్తున్నారు’’ అని చెప్పాడు. కాగా సుప్రీం ఎదుట ఒకరు ఇలా ఆత్మహత్నాయత్నం చేయడం గత ఆర్నెల్లలో ఇది రెండోసారి. గత ఏడాది ఆగస్టులో ఓ 24 ఏళ్ల యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. తాను అత్యాచార బాధితురాలిని అని ఆమె వాపోయింది.