నంబి నారాయణన్ ఇస్రో గూఢచర్యం కేసులో సుప్రీం తాజా ఆదేశాలు

ABN , First Publish Date - 2021-04-15T21:02:20+05:30 IST

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మాజీ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ నంబి నారాయణన్

నంబి నారాయణన్ ఇస్రో గూఢచర్యం కేసులో సుప్రీం తాజా ఆదేశాలు

న్యూఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మాజీ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ నంబి నారాయణన్ కేసులో దర్యాప్తు కొనసాగించాలని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. ఈ కేసులో జైన్ కమిటీ సమర్పించిన నివేదికను సీలువేసి భద్రపరిచింది. ఈ నివేదిక వివరాలను బయటికి వెల్లడించబోమని తెలిపింది. 


1994నాటి గూఢచర్యం కేసుపై ఏర్పాటైన జైన్ కమిటీ తన నివేదికను గురువారం సుప్రీంకోర్టుకు సమర్పించింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ డీకే జైన్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ఈ నివేదికను రూపొందించింది. ఇస్రో మాజీ శాస్త్రవేత్త డాక్టర్ నంబి నారాయణన్‌పై గూఢచర్యం ఆరోపణల కేసులో తప్పులు చేసిన పోలీసుల పాత్రపై ఈ కమిటీ విచారణ జరిపింది. అయితే నంబి నారాయణన్ ఈ కేసులో నిర్దోషి అని వెల్లడవడంతో ఆయనకు రూ.50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు గతంలో తీర్పు చెప్పింది. 


జైన్ కమిటీ నివేదికను పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ, కేరళ పోలీసు శాఖలోని బాధ్యతాయుతమైన అధికారులు చేసిన పనులు, మానేసిన పనులను ఈ కమిటీ గుర్తించిందని తెలిపింది. ఈ నివేదికను ప్రాథమిక దర్యాప్తు నివేదికగా పరిగణించాలని, తదుపరి దర్యాప్తును కొనసాగించాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి దర్యాప్తు నివేదికను మూడు నెలల్లోగా సమర్పించాలని ఆదేశించింది. ఈ నివేదిక కాస్త తీవ్రమైన విషయాన్ని సూచిస్తోందని, తగిన చర్యను తీసుకోవలసిన అవసరం ఉందని తెలిపింది. ఈ నివేదిక అనేక పరిస్థితులు, సంఘటనలను తెలియజేస్తోందని పేర్కొంది. వీటిపై క్షుణ్ణంగా దర్యాప్తు జరగాలని తెలిపింది. నంబి నారాయణన్ అరెస్టుకు బాధ్యులైన పోలీసు అధికారులను ఈ నివేదిక గుర్తించినట్లు తెలిపింది. 


నంబి నారాయణన్ స్పందన

నంబి నారాయణన్ మీడియాతో మాట్లాడుతూ, సీబీఐ దర్యాప్తును స్వాగతించారు. సీబీఐ దర్యాప్తులో పురోగతి ఉందన్నారు. దీని గురించి ఏదైనా ఫిర్యాదు చేయవలసిన అవసరం లేదన్నారు. కమిటీ నివేదికలోని అంశాలు తనకు తెలియవని, అందువల్ల తాను ఏమీ వ్యాఖ్యానించబోనని చెప్పారు. నివేదికను సీలు చేయడాన్ని, తదుపరి దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించడాన్ని పరిశీలిస్తే, ఈ నివేదికలో ఏదో ముఖ్యమైనది ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. ఇది కల్పిత కేసు అని ఎవరో ఈ పని చేశారని అన్నారు. (గూఢచర్యం కేసులో తనను ఇరికించారని పేర్కొన్నారు). ఈ పని చేసినవారు వాస్తవాన్ని అంగీకరించాలని, అప్పటి వరకు న్యాయం జరిగినట్లు తాను చెప్పలేనని తెలిపారు. 


ఏమిటీ కేసు?

1994లో ఇస్రో గూఢచర్యం కేసు పతాక శీర్షికల్లో వచ్చింది. భారత దేశ అంతరిక్ష కార్యక్రమానికి సంబంధించిన కొన్ని రహస్య పత్రాలను విదేశాలకు బదిలీ చేశారనేది ఈ కేసు సారాంశం. ఈ కేసులో ఇద్దరు శాస్త్రవేత్తలు, ఇద్దరు మాల్దీవుల మహిళలు, మరో ఇద్దరు నిందితులని కేరళ పోలీసులు ఆరోపించారు. ఈ ఇద్దరు శాస్త్రవేత్తలో ఒకరైన డాక్టర్ నంబి నారాయణన్‌ను 1994 నవంబరులో అరెస్టు చేశారు. ఆయనను అక్రమంగా అరెస్టు చేశారని సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది. ఆయన అక్రమ అరెస్టుకు కేరళ పోలీసు శాఖలోని అత్యున్నత స్థాయి అధికారులు బాధ్యులని సీబీఐ వెల్లడించింది. 


2018 సెప్టెంబరు 14న సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ, డాక్టర్ నంబి నారాయణన్‌కు నష్టపరిహారంగా రూ.50 లక్షలు చెల్లించాలని కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ డీకే జైన్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. 


Updated Date - 2021-04-15T21:02:20+05:30 IST