సీనియర్ న్యాయవాదులను ఆక్షేపించిన సుప్రీంకోర్టు

ABN , First Publish Date - 2021-04-23T19:42:34+05:30 IST

కొందరు సీనియర్ న్యాయవాదుల తీరును సుప్రీంకోర్టు శుక్రవారం

సీనియర్ న్యాయవాదులను ఆక్షేపించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : కొందరు సీనియర్ న్యాయవాదుల తీరును సుప్రీంకోర్టు శుక్రవారం ఆక్షేపించింది. తాను ఇచ్చిన ఆదేశాలను చదవకుండానే తనకు ఏవేవో ఉద్దేశాలను ఆపాదిస్తున్నారని మండిపడింది. సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వేను ఓ కేసులో అమికస్ క్యూరీగా నియమించడంపైనా, గురువారం ఇచ్చిన ఆదేశాలపైనా సీనియర్ న్యాయవాదులు యథేచ్ఛగా మాట్లాడుతున్నారని పేర్కొంది.


కోవిడ్-19 మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఆక్సిజన్, ఔషధాలు సహా అత్యవసర సరఫరాలు, సేవల పంపిణీకి సంబంధించిన వార్తలపై సుప్రీంకోర్టు స్వీయ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో తనకు సహకరించేందుకు అమికస్ క్యూరీగా సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వేను గురువారం నియమించింది. ఆక్సిజన్, ఇతర అత్యవసర మందులు సక్రమంగా పంపిణీ జరిగే విధంగా ఓ జాతీయ ప్రణాళికను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 


ఈ నేపథ్యంలో కొందరు సీనియర్ న్యాయవాదులు చేసిన వ్యాఖ్యలను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే శుక్రవారం తప్పుబట్టారు. గురువారంనాడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను చదవకుండానే ఉద్దేశాలను ఆపాదిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో కోవిడ్-19 మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన కేసులను విచారించడం నుంచి హైకోర్టులను తాము నిలువరించలేదని చెప్పారు. 


ఈ కేసులో సుప్రీంకోర్టుకు హాజరైన సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవేను ఉద్దేశించి సీజేఐ జస్టిస్ బాబ్డే మాట్లాడుతూ,  ‘‘మేం ఇచ్చిన ఆదేశాలను మీరు చదవకుండానే మాకు ఉద్దేశాలను ఆపాదించారు’’ అని అన్నారు. ఈ కేసులో అమికస్ క్యూరీగా హరీశ్ సాల్వేను నియమించడంపై కొందరు సీనియర్ న్యాయవాదులు చేసిన వ్యాఖ్యలు కూడా తమను బాధించాయన్నారు. ఇది సమష్టి నిర్ణయమని, అందరు జడ్జిలు కలిసి తీసుకున్న నిర్ణయమని చెప్పారు. 


ఇదిలావుండగా, హరీశ్ సాల్వే ఈ కేసులో అమికస్ క్యూరీగా బాధ్యతలను చేపట్టకుండా తప్పుకున్నారు. ఇది చాలా సున్నితమైన విషయమని, తనకు సీజేఐ జస్టిస్ బాబ్డే పాఠశాల, కళాశాల రోజుల నుంచి తెలుసుననే భావాల నీడలో తాను ఈ కేసు పరిష్కారం కావాలనుకోవడం లేదని చెప్పారు. దీనిపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ, ఇటువంటి ఒత్తిళ్ళకు తలొగ్గవద్దని హరీశ్ సాల్వేను కోరారు. అమికస్ క్యూరీగా పని చేయాలని, కేసు నుంచి తప్పుకోవద్దని కోరారు. అమికస్ క్యూరీ బాధ్యతల నుంచి తప్పుకోవడానికి అనుమతి ఇవ్వాలని హరీశ్ సాల్వే చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు అంగీకరించింది.


ఈ కేసులో కేంద్ర ప్రభుత్వ స్పందనకు గడువిస్తూ, తదుపరి విచారణ ఈ నెల 27న జరుగుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ ధర్మాసనంలో సీజేఐతోపాటు జస్టిస్ ఎల్ఎన్ రావు, జస్టిస్ ఎస్ఆర్ భట్ కూడా ఉన్నారు. 


Updated Date - 2021-04-23T19:42:34+05:30 IST