విజయ్ మాల్యాకు ఇదే చివరి అవకాశం : సుప్రీంకోర్టు

ABN , First Publish Date - 2022-02-10T23:58:08+05:30 IST

బ్యాంకు రుణాల ఎగవేతదారు విజయ్ మాల్యాకు

విజయ్ మాల్యాకు ఇదే చివరి అవకాశం : సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : బ్యాంకు రుణాల ఎగవేతదారు విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు చిట్ట చివరి అవకాశాన్ని ఇచ్చింది. వ్యక్తిగతంగా కానీ, న్యాయవాది ద్వారా కానీ తన వాదనలను రెండు వారాల్లోగా వినిపించాలని చెప్పింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 24న జరుగుతుందని పేర్కొంది. తన వాదనలను వినిపించడంలో విఫలమైతే కోర్టు ధిక్కార నేరం క్రింద కేసును ఎదుర్కొనాలని తెలిపింది. 


విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ, బ్రిటన్‌లో ఏదో రహస్యంగా జరుగుతోందనేది భారత ప్రభుత్వ వాదన కాదని, ఏదో జరుగుతోందని, ఆ సమాచారాన్ని పంచుకోవడం సాధ్యం కాదని బ్రిటన్ ప్రభుత్వమే భారత ప్రభుత్వానికి చెప్పిందని తెలిపారు. 


మాల్యా దాదాపు రూ.9 వేల కోట్ల మేరకు బ్యాంకు రుణాలను ఎగవేసి, బ్రిటన్ వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. ఆయన 40 మిలియన్ డాలర్లను తన పిల్లలకు బదిలీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించి ఈ లావాదేవీని జరిపారు. దీంతో ఆయన కోర్టు ధిక్కార నేరానికి పాల్పడినట్లు అత్యున్నత న్యాయస్థానం నిర్థరించింది. ఆయన హాజరుకావాలని అనేకసార్లు ఆదేశించింది. 


బ్రిటన్‌లోని అత్యున్నత న్యాయస్థానం విజయ్ మాల్యాను భారత దేశానికి అప్పగించాలని తీర్పు చెప్పిందని, అయితే ఆ దేశ ప్రభుత్వం ఆ తీర్పును అమలు చేయడం లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.  బ్రిటన్‌లో రహస్యంగా ఏం జరుగుతోందో తెలియదని చెప్పింది. 


 

Updated Date - 2022-02-10T23:58:08+05:30 IST