సెంట్రల్ విస్టా పనులు కొనసాగడంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం!

ABN , First Publish Date - 2021-11-29T18:47:49+05:30 IST

దేశ రాజధాని నగరం ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోతున్న

సెంట్రల్ విస్టా పనులు కొనసాగడంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం!

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో భవన నిర్మాణ కార్యకలాపాలపై నిషేధం విధించినప్పటికీ సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పనులు కొనసాగుతుండటంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరుతామని తెలిపింది. తాజాగా గాలి కాలుష్యం స్థాయి 419 అని, ఇది రోజు రోజుకూ పెరుగుతోందని తెలిపింది. 


ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్‌వీ రమణ దృష్టికి సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పనుల గురించి వచ్చింది. సీనియర్ అడ్వకేట్ వికాస్ సింగ్ మాట్లాడుతూ, ఢిల్లీలో భవన నిర్మాణ కార్యకలాపాలపై నిషేధం ఉన్నప్పటికీ, ప్రభుత్వం సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పనులను వేగంగా నిర్వహిస్తోందని చెప్పారు. దీనిపై సీజేఐ స్పందిస్తూ, కాలుష్య నియంత్రణకు అనేక అవస్థలు పడుతున్నామన్నారు. సెంట్రల్ విస్టా అయినా, పరిశ్రమ అయినా, మరొకటి అయినా, తాము ప్రభుత్వాన్ని వివరణ కోరుతామని చెప్పారు. కొన్ని అంశాలను ప్రస్తావించి, వాటి మీదే దృష్టి కేంద్రీకరించవద్దని, అలా అయితే అసలు సమస్య పక్కదారి పడుతుందని చెప్పారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణం గురించి సొలిజిటర్ జనరల్‌ను అడుగుతామన్నారు. కేంద్ర ప్రభుత్వ పాత్రను వివరించాలని కోరుతామన్నారు. 


సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ, తాము ఈరోజు (సోమవారం) ఓ అఫిడవిట్ దాఖలు చేశామన్నారు. దీనిపై సీజేఐ స్పందిస్తూ, మీరు ఓ కాగితాల కట్టను ఇస్తే మేం చదువుతామని ఎలా అనుకున్నారు? పిటిషనర్లు కూడా కొన్ని కాగితాలను దాఖలు చేశారు, వాటిని మేం చదవబోమని వారు అనుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా అలాగే చేస్తోందన్నారు. 


కాలుష్య నియంత్రణపై ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలు పాటించేందుకు తీసుకుంటున్న చర్యలేమిటని ప్రశ్నించారు. రాష్ట్రాలు ఈ ఆదేశాలను పాటిస్తున్నట్లు కేంద్రం చెప్తున్నప్పటికీ, ఫలితం శూన్యంగా కనిపిస్తోందని చెప్పారు. 


 ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్రత పెరుగుతుండటంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. గాలి నాణ్యత నిర్వహణ కమిషన్ జారీ చేసిన ఆదేశాలన్నిటినీ తక్షణమే పాటించాలని ఢిల్లీ, హర్యానా, ఉత్తర ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ రాష్ట్రాలు ఈ ఆదేశాలను పాటించడానికి సంబంధించిన నివేదికలను సమర్పించాలని, తదుపరి విచారణ గురువారం జరుగుతుందని తెలిపింది. 


మెట్రో రైలు ప్రాజెక్టు నాలుగో దశ విస్తరణ కోసం చెట్లను తొలగించడానికి ముందు అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్‌ నుంచి అనుమతి పొందాలని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ)ని ఆదేశించింది. 


ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశాల్లో, మొక్కలు నాటడానికి సమగ్ర ప్రణాళికను రూపొందించి, 12 వారాల్లోగా నివేదికను సమర్పించాలని తెలిపింది. ఓవైపు కాలుష్యం పెరుగుతుండగా, కొత్తగా కోవిడ్ వేరియంట్ ఒమిక్రాన్ బయటపడటం మరో సమస్య అని తెలిపింది. 


సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా పార్లమెంటు, ప్రధాన మంత్రి, ఉప రాష్ట్రపతి, వివిధ పరిపాలనా శాఖల భవనాలను నిర్మిస్తున్నారు. లుటియెన్స్ ఢిల్లీలో ఈ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. 


Updated Date - 2021-11-29T18:47:49+05:30 IST