స్వచ్ఛందంగా వ్యభిచారం చేసే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవద్దు: సుప్రీం కోర్టు

ABN , First Publish Date - 2022-05-27T02:34:03+05:30 IST

‘‘పోలీసులు అందరితో మాదిరిగానే సెక్స్‌వర్కర్లతో కూడా గౌరవంగా నడుచుకోవాలి. వారిని తిట్టడం గానీ, కొట్టడం గానీ చేయకూడదు. వ్యభిచారం అనేది ఒక వృత్తి. స్వచ్ఛందంగా ఆ వృత్తిని ఎంచుకుని..

స్వచ్ఛందంగా వ్యభిచారం చేసే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవద్దు: సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ: ‘‘పోలీసులు అందరితో మాదిరిగానే సెక్స్‌వర్కర్లతో కూడా గౌరవంగా నడుచుకోవాలి. వారిని తిట్టడం గానీ, కొట్టడం గానీ చేయకూడదు. వ్యభిచారం అనేది ఒక వృత్తి. స్వచ్ఛందంగా ఆ వృత్తిని ఎంచుకుని అందులో కొనసాగుతున్న వారిపై పోలీసులు ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోరాదు. ఆర్టికల్ 21 ప్రకారం ఈ దేశంలో ప్రతీ ఒక్కరికీ గౌరవప్రదమైన జీవనం కొనసాగించే హక్కు ఉంది. స్వచ్ఛందంగా వ్యభిచార వృత్తిని ఎంచుకుని అందులో కొనసాగుతున్న వారిని అరెస్ట్ చేయడం, జరిమానా విధించడం, హింసించడం, రైడ్స్ పేరుతో స్వచ్ఛందంగా ఆ వృత్తిలో కొనసాగుతున్న వారిని ఇబ్బంది పెట్టడం చేయరాదు. వ్యభిచార వృత్తిని స్వచ్ఛందంగా ఎంచుకోవడం నేరం కాదు. వ్యభిచార గృహాలను నడుపుతూ దాన్ని ఒక వ్యాపారంగా చేయడం చట్టరీత్యా నేరం’’ సెక్స్ వర్కర్ల విషయంలో సుప్రీం కోర్టు తాజాగా చేసిన వ్యాఖ్యలివి.



జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు నేతృత్వంలోని బీ.ఆర్.గవాయి, ఏ.ఎస్.బొప్పన్నతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. సెక్స్ వర్కర్లను వేధించకూడదని దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసులను సుప్రీం ఆదేశించింది. పట్టుబడిన సెక్స్ వర్కర్ల ఫొటోలను ప్రచురించవద్దని మీడియాకు స్పష్టం చేసింది. సెక్స్ వర్కర్లకు సంబంధించి అత్యున్నత న్యాయస్థానం నియమించిన కమిటీ కొన్ని కీలక సిఫార్సులు చేసింది. ఈ సిఫార్సులు ఆమోదించిన సుప్రీం రాష్ట్రాలు ఈ సిఫార్సులను అమలు చేయాలని స్పష్టం చేసింది. అయితే.. ఈ సిఫార్సుల్లోని కొన్ని అంశాలను కేంద్ర ప్రభుత్వం అంగీకరించినప్పటికీ, కొన్నింటిపై అభ్యంతరం వ్యక్తం చేసింది.

Updated Date - 2022-05-27T02:34:03+05:30 IST