తెలంగాణ సాంస్కృతిక భానుడు

ABN , First Publish Date - 2022-05-28T06:15:06+05:30 IST

పండితుడు, కళాభిమాని, పత్రికా సంపాదకుడు, సత్యవంతుడు, త్యాగధనుడు, రచయిత, నిర్మల హృదయుడు సురవరం ప్రతాపరెడ్డి.

తెలంగాణ సాంస్కృతిక భానుడు

పండితుడు, కళాభిమాని, పత్రికా సంపాదకుడు, సత్యవంతుడు, త్యాగధనుడు, రచయిత, నిర్మల హృదయుడు సురవరం ప్రతాపరెడ్డి. ఈ పుణ్య పురుషుడు 1896 మే 28న మహబూబ్‌నగర్ జిల్లా ఇటిక్యాలపాడు గ్రామంలో జన్మించాడు. కోస్తాంధ్రలో ముట్నూరి కృష్ణారావు గారి కృష్ణా పత్రిక ఎటువంటిదో, తెలంగాణలో సురవరం ప్రతాపరెడ్డి ‘గోల్కొండ పత్రిక’ అటువంటిది. ఈ పత్రికా రాజాన్ని ఆయన 1925లో స్థాపించాడు. ఆనాడు హైదరాబాదులో తెలుగు మాట్లాడే వారే అరుదు. అలాంటి రోజుల్లో ధైర్యంగా తెలుగు పత్రిక స్థాపించి దాని సంపాదకుడిగా, ప్రూఫ్ రీడర్‌గా, గుమస్తాగా అన్ని బాధ్యతలు నిర్వహించి పత్రికను క్రమం తప్పకుండా వెలువరిస్తూ తన శక్తినంతా ధారవోసిన మహనీయుడు సురవరం ప్రతాపరెడ్డి.


బహు పాండిత్యంతో అకుంఠిత దీక్షతో గోల్కొండ పత్రికను నడిపి, తెలంగాణ వాసుల్ని జాగృతం చేసిన జాతిరత్నం ప్రతాపరెడ్డి. తెలంగాణలో కవులులేరు అనే అపప్రథ పోగొట్టడానికి 354 మంది తెలంగాణ కవుల కవితలు, పద్యాలతో ‘గోల్కొండ కవుల సంచిక’ను ఆయన వెలువరించారు. ఇది తెలుగు కవితా సంకలనాలలో మణిదీపంగా వెలుగొందుతోంది. తెలంగాణ కవులకు అది ఒక శంఖారావం అయింది. గ్రంథాలయోద్యమ రథసారథుల్లో ప్రతాపరెడ్డి ముఖ్యులు. ఎన్నో సారస్వత విద్యా సంస్థలను నిర్వహించారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు స్థాపకుల్లో ఒకరైన ప్రతాపరెడ్డి తెలుగు లిపిలో ఆవశ్యక సంస్కరణల గురించి విశేష పరిశోధన చేశారు. సాహిత్యం, చరిత్ర, సంస్కృతి మూర్తీభవించిన మహోన్నతుడు ప్రతాపరెడ్డి. సంగ్రామ సింహ, భావకవి, రామమూర్తి, విశ్వామిత్ర చిత్రగుప్త, అమృతకలశం, జంగం బసవయ్య మొదలైన కలం పేర్లతో రచనలు చేశారు. శుద్ధంత కాంత (నవల) భక్తతుకారం (నాటకం) గ్రంథాలయోద్యమం (వ్యాసాలు) హైందవ ధర్మ వీరులు, ప్రతాపరెడ్డి కథలు, మొగలాయి కథలు ఆయన సాహిత్య రాజనాలు. వాల్మీకి రామాయణాన్ని విపులంగా పరిశీలించి ప్రాచ్య, పాశ్చాత్య దృక్పథంతో ఎన్నో చారిత్రక సాంస్కృతిక అంశాలను వివరిస్తూ ‘రామాయణ విశేషాలు’ అన్న ఉద్గ్రంథాన్ని ఆయన రచించారు. ఇది నేటికీ ఆదరణ పొందుతూనే ఉంది. అలాగే హిందువుల పండుగలు, వాటి పుట్టుపూర్వోత్తరాలు, చారిత్రక సాంఘిక ప్రాముఖ్యం, ఆచార వ్యవహారాలు, పండుగలలోని పరమార్ధం తెలుపుతూ రాసిన పుస్తకం ‘హిందువుల పండుగలు’.


సురవరం ప్రతాపరెడ్డి పేరు చెప్పగానే ప్రతి తెలుగువాడికీ గుర్తుకొచ్చే పుస్తకం ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’. ఇది ఆయన అంతిమ రచన. అత్యంత ప్రశస్తమైన రచన. వేయి సంవత్సరాల సాహిత్య సంపద ఆధారంగా తెలుగు ప్రజల చరిత్రను స్ఫూర్తిదాయకంగా ఆయన వివరించారు. ఆ వివరించిన తీరు, కొత్తది, ఆదర్శవంతమైనది. కేంద్ర సాహిత్య అకాడమీ నుంచి తొలి పురస్కారాలు అందుకున్న పుస్తకాలలో ఇది విలక్షణమైనది.


గోల్కొండ, ప్రజావాణి పత్రిక సంపాదకుడిగా వెర్రి వెంగళప్ప, కవిలె కట్టెలు అనే శీర్షికలను కూడా ప్రతాపరెడ్డి నిర్వహించారు. సద్గుణ రాసిగా సమకాలీనుల గౌరవాదరాలను నిండుగా పొందిన సచ్ఛరితుడు ప్రతాపరెడ్డి. రాజకీయ కీచులాటలు, అంతః కలహాలు రుచించక వాటికి దూరంగా ఉంటూ, యథాశక్తి సాహిత్య సేవ చేసిన సహృదయుడు. జాతి వంద్యుడు అయిన ప్రతాపరెడ్డి 1953 ఆగస్టు 25న కీర్తిశేషుడు అయ్యారు.


యాడవరం చంద్రకాంత్ గౌడ్

(నేడు సురవరం ప్రతాపరెడ్డి జయంతి)

Updated Date - 2022-05-28T06:15:06+05:30 IST