తాళ్లూరు ట్రాన్స్‌కో ఏఈ జిల్లా కార్యాలయానికి సరెండర్‌

ABN , First Publish Date - 2022-06-25T06:08:09+05:30 IST

రైతులతో సమయస్ఫూర్తిగా వ్యవహరించకుండా ప్రభుత్వ విధానాన్ని తప్పుబడుతూ మాట్లాడటం, సర్వీస్‌ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో తాళ్లూరు విద్యుత్‌ ఏఈ వీరబ్రహ్మంను జిల్లా కార్యాలయానికి సరెండర్‌ చేస్తున్నట్లు దర్శి డీఈఈ అబ్దుల్‌ కరీం తెలిపారు.

తాళ్లూరు ట్రాన్స్‌కో ఏఈ జిల్లా కార్యాలయానికి సరెండర్‌
సబ్‌ స్టేషన్‌ను పరిశీలిస్తున్న దర్శి డీఈఈ అబ్దుల్‌కరీం

రైతులతో నిర్లక్ష్యంగా మాట్లాడటంపై విచారణకు ఆదేశం

దర్శి డీఈఈ అబ్దుల్‌ కరీం వెల్లడి

తాళ్లూరు, జూన్‌ 24: రైతులతో సమయస్ఫూర్తిగా వ్యవహరించకుండా ప్రభుత్వ విధానాన్ని తప్పుబడుతూ మాట్లాడటం, సర్వీస్‌ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో తాళ్లూరు విద్యుత్‌ ఏఈ వీరబ్రహ్మంను జిల్లా కార్యాలయానికి సరెండర్‌ చేస్తున్నట్లు దర్శి  డీఈఈ అబ్దుల్‌ కరీం తెలిపారు.  కరెంట్‌కోతలపై గురువారం  రైతులు స్థానిక సబ్‌స్టేషన్‌ వద్ద ఆందోళన చేపట్టి ఏఈ పనితీరుపై పలువిమర్శలు చేశారు. దీంతో దర్శి డీఈఈ అబ్దుల్‌ కరీం శుక్రవారం స్థానిక సబ్‌స్టేషన్‌ను పరిశీలించారు. అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వ విధానం తప్పు అన్నట్లుగా ఏఈ మాట్లాడటం సరైంది కాదన్నారు. పంటలు ఎండిపోతూ రైతులు బాధల్లో ఉండి సమస్యలను చెప్పినపుడు స్పందించాల్సిన అధికారి అలా మాట్లాడటం సర్వీస్‌ నిబంధనలకు విరుద్ధమన్నారు. రైతులతో ఏఈ మాట్లాడిన తీరుపై, విద్యుత్‌ పరికరాలను అమ్ముకుంటున్నారని వచ్చిన ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించామన్నారు. ప్రస్తుతం ఏఈ వీరబ్రహ్మంను జిల్లా కార్యాలయానికి సరెండర్‌ చేశామని, తాళ్లూరుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రైతులు కూడా విద్యుత్‌ సరఫరాలో సమస్యలు ఉంటే సంబంధిత అధికారులతో సంప్రదించాలని, లేకుంటే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. దర్శి నియోజకవర్గంలో 500 మంది డీడీలు తీయగా 324 ట్రాన్స్‌ఫార్మర్లు అందించామన్నారు. మెటీరియల్‌, పోల్సు రాగానే ట్రాన్స్‌ఫార్మర్లు బిగించి విద్యుత్‌ సమస్యలు లేకుండా చూస్తామన్నారు. ఆయన వెంట దర్శి ఏడీఈ కె.పిచ్చయ్య తదితరులు ఉన్నారు. 





Updated Date - 2022-06-25T06:08:09+05:30 IST