కబ్జాదారుల కోరల్లో సర్‌సిల్క్‌ భూములు

ABN , First Publish Date - 2022-05-04T03:47:20+05:30 IST

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో కోట్లాది రూపా యిల విలువైన సర్‌సిల్క్‌ భూములు కబ్జాదారుల కోరల్లో చిక్కుకున్నాయి.

కబ్జాదారుల కోరల్లో సర్‌సిల్క్‌ భూములు
పాఠశాలకు సంబంధించి ఆక్రమిత స్థలంలో నిర్మించిన కాంపౌండ్‌ వాల్‌

- కాగజ్‌నగర్‌లో గాడి తప్పిన ‘రెవెన్యూ’
- రికార్డుల్లో ఒకటి కబ్జాల్లో మరొకటి
- కోర్టును ఆశ్రయించిన బాధితులు

(ఆసిఫాబాద్‌, ఆంధ్రజ్యోతి)
కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో కోట్లాది రూపా యిల విలువైన సర్‌సిల్క్‌ భూములు కబ్జాదారుల కోరల్లో చిక్కుకున్నాయి. నిబంధనల ప్రకారం వ్యవహరించి భూములను కాపాడాల్సిన రెవెన్యూ యంత్రాంగం కంచె చేను మేసిందన్నట్లుగా అక్రమార్కులకు సహకరిస్తుండడంతో విలువైన స్థలాలను మింగేస్తున్నారు. కొద్ది నెల లుగా ఇక్కడ భూములు ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో భూ మాఫీయా ఖాళీ స్థలాలపై కన్నేసి కబ్జాల పర్వానికి పాల్పడుతోంది. మరో వైపు ఏకంగా రిజిస్ట్రర్డ్‌ భూములను తప్పుడు ధ్రువీకరణ పత్రా లతో కబ్జాలకు పాల్పడడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

- కోసిని పరిధిలో..
కాగజ్‌నగర్‌ పట్టణంంతో పాటు కోసిని పంచాయతీ పరిధిలో విస్త రించి ఉన్న సుమారు 500 ఎకరాల సర్‌సిల్క్‌ భూములు ఇప్పటికే సింహ భాగం కబ్జా కోరల్లో చిక్కి అన్యక్రాంతం అయిపోయాయి. మి గిలిన భూములను హైకోర్టు సమక్షంలో లిక్విడేటర్‌ను నియమించి విక్రయించారు. అయితే లిక్విడేటర్‌ ద్వారా కొనుగోలు చేసిన భూము లకు సంబంధించి వివాదం ఒక వైపు కొనసాగుతుండగానే మరో వైపు ఇదే లిక్విడేటర్‌ 2013లోవిక్రయించిన క్వార్టర్లకు సంబంధించిన ఖాళీ స్థలాన్ని కబ్జా చేసేందుకు కొంత మంది వ్యక్తులు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో బాధితులు నేరుగా సిర్పూరు(టి) కోర్టును ఆశ్రయించడంతో బాధితుల పక్షాన ఇంటిరియం ఆర్డర్‌ను జారీ చేసింది. కాగా నిబంధనల ప్రకారమే క్వార్టర్లను కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నప్పటికీ ఓపెన్‌ బిడ్డింగ్‌లో కొనుగోలు చేసిన ఓ కొనుగోలు దారునుంచి 13.96 ఎకరాల స్థలాన్ని మరో వ్యాపారి కొనుగోలు చేశారు. అయితే అంతకుముందే రిజిస్ట్రర్డ్‌ అయిన క్వార్టర్లకు సంబంధించి తన సర్వే నంబర్లలో ఉన్నాయంటూ మున్సిపాలిటీ ద్వారా నోటీసులు జారీ చేయించారు. అయినప్పటికీ సదరు వ్యాపారి వివిధ మార్గాల ద్వారా క్వార్టర్ల వెనుక భాగాల స్థలాలను కబ్జా చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. కాగా సదరు స్తిరాస్తి వ్యాపారి చెబుతున్నట్టుగా తమ క్వార్టర్ల స్థలాలు ఆ సర్వే నంబర్లకు సంబంధించిన కావంటూ ఏడుగురు బాధితులు సివిల్‌ కోర్టును ఆశ్రయించారు. తమ భూముల్లో ఎలాంటి చర్యలు చేపట్టరాదంటూ 19 శాఖలకు నోటీసులు ఇప్పించారు. అయినప్పటికీ కొంత మంది అధికారులు కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ క్వార్టర్ల వెనుక భాగంలో ఉన్న  ఖాళీ స్థలాలను నోటీసులిచ్చి స్తిరాస్తి వ్యాపారు లకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. సదరు వ్యాపారి కొనుగోలు చేసిన భూముల సర్వే నంబర్లు నోటీసుల్లో పేర్కొన్న 85, 86, 87 నంబర్లకు అసలు పొంతన లేదని బాధితుల వాదన. సదరు వ్యాపారి తప్పుడు సరిహద్దులను చూపి అధికారులను తప్పుతోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని బాధితులు చెబుతు న్నారు.

- పాఠశాల స్థలానికి ఎసరు..
పట్టణంలోని సర్‌సిల్క్‌ రాంమందిర్‌ సమీపంలో ఉన్న శిశుమందిర్‌ పాఠశాలకు చెందిన సుమారు ఎకరా స్థలాన్ని కబ్జా చేశారు. వెంచర్లు వేస్తున్న ఓ వ్యాపారి తాను కొనుగోలు చేసిన సర్వే నంబర్లలో స్థలం తక్కువగా ఉందన్న నెపంతో కొలతలు వేయించి దాదాపు రెండు కోట్ల విలువైన భూమి కబ్జా చేసి చుట్టు కంపౌండ్‌ నిర్మించాడు. సర్‌సిల్క్‌ యాజమాన్యం చిన్నారుల విద్యాభ్యాసం కోసం ఐదు దశాబ్దాల క్రితం 8 ఎకరాల స్థలాన్ని పాఠశాలకు కేటాయించింది. అయితే గడిచిన కొన్నేళ్లలో ఈ పాఠశాలకు సంబంధించి రికార్డుల నిర్వాహణ సరిగ్గా లేని విషయాన్ని గుర్తించిన అక్రమార్కులు ఇప్పటికే కొంత భాగాన్ని అక్రమించినట్టు ఆరోపణలున్నాయి. మిగిలిన స్థలంలో ఎకరా స్థలాన్ని కబ్జా చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, పట్టణవాసులు ఈ కబ్జాల పర్వంపై ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యవహారంలో రెవెన్యూ అధికారుల సహకారం ఉండడం వల్లే అక్రమార్కులు యథేచ్ఛ గా కబ్జాలకు పాల్పడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. ఉన్నతాధి కారులు కాగజ్‌నగర్‌ సర్‌సిల్క్‌ భూముల అక్రమణ విషయంలో సమగ్ర స్థాయిలో విచారణ జరిపితే మరిన్ని అక్రమాలు వెలుగు చూసే అవకాశాలున్నాయని స్థానికులు చెబుతున్నారు.

Read more