మందుల దందా!

ABN , First Publish Date - 2021-05-15T04:42:20+05:30 IST

కరోనా మహమ్మారి పుణ్యమా అని ఏడాది కాలంగా మందుల దుకాణదారులకు కాసుల పంట పండుతోంది. జిల్లాలో వందలాది మెడికల్‌ షాపులు ఉన్నాయి. కొన్ని అనుమతి లేకుండా కొనసాగుతున్నాయి. కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ల సమయంలోనూ మందుల దుకాణాలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో చాలామంది ముందుగా సంచి వైద్యులను, ఆపై మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు.

మందుల దందా!






అధిక ధరలకు విక్రయం

 మెడికల్‌ షాపులపై నిఘా కరువు

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

కరోనా మహమ్మారి పుణ్యమా అని ఏడాది కాలంగా మందుల దుకాణదారులకు కాసుల పంట పండుతోంది. జిల్లాలో వందలాది మెడికల్‌ షాపులు ఉన్నాయి.  కొన్ని అనుమతి లేకుండా కొనసాగుతున్నాయి. కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ల సమయంలోనూ మందుల దుకాణాలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో చాలామంది ముందుగా సంచి వైద్యులను, ఆపై మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా మందుల దుకాణాల నిర్వాహకులు అందినంత దోచేస్తున్నారు. గత ఏడాది కంటే అన్నిరకాల విటమిన్స్‌ ట్యాబ్‌లెట్స్‌ స్ర్టిప్‌పై సగటున రూ.50 ధర అదనంగా పెంచి విక్రయిస్తున్నారు. గత ఏడాది పల్స్‌ఆక్సీమీటరు కేవలం రూ.1200 లోపే ఉండగా.. ప్రస్తుతం రూ.2వేల నుంచి రూ.3వేల వరకు ధర పెంచేశారు.  యాంటీబయాటిక్‌ మాత్రలపైనా ధరలు పెంచి విక్రయిస్తున్నారు. విచ్చలవిడిగా ధరలు పెంచేస్తున్నా.. ఔషధ నియంత్రణ శాఖ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఒక వేళ తనిఖీలు చేసినా.. అవి మొక్కుబడిగానే సాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరోనా ఉధృతి వేళ ఔషధ నియంత్రణ శాఖ అధికారులు స్పందించి.. మెడికల్‌ దుకాణాల్లో ధరలు నియంత్రించాలని పలువురు కోరుతున్నారు. జిల్లాలో మందుల దుకాణాల యాజమాన్య సంఘాల సభ్యులతో సమావేశమై.. మందులపై డిస్కౌంట్‌ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.  


నియంత్రణ ఏదీ?

మందుల షాపులపై నిఘా కొరవడింది. డ్రగ్‌ కంట్రోల్‌ విభాగం అధికారులు, సిబ్బంది కార్యాలయాల నుంచి కాలు కదపడం లేదు. ప్రస్తుతం కరోనా రోగులకు అందించే అత్యవసర మందులు, ఇంజక్షన్ల నిల్వ బాధ్యతలు అప్పగించడమే ఇందుకు కారణం. అసిస్టెంట్‌ డ్రగ్‌ కంట్రోలర్‌, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్ల మొదలు దిగువ స్థాయి సిబ్బంది వరకూ ఆ బాధ్యతల్లోనే ఉన్నారు.  ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల నుంచి వచ్చే ఇండెంట్‌ ఆధారంగా డ్రగ్‌ కంట్రోలర్‌ వద్ద ఉన్న ఇంజెక్షన్ల నిల్వలను అందిస్తున్నారు. దీంతో మందుల షాపులపై నిఘా కొరవడింది. ఫలితంగా కరోనా మందుల దందా నడుస్తోంది. రోజుకు సగటున కోట్లాది రూపాయల మందుల క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారు వైద్యులు సూచించిన మందులను దుకాణాల్లో కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం బాధితుల్లో ఎక్కువ మంది హోం ఐసోలేషన్‌లోనే ఉంటున్నారు. ఇటువంటి వారికి కిట్లు అందిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నా..ఎక్కువ మంది బయటే మందులు కొనుగోలు చేస్తున్నారు. ప్రజల అవసరాన్ని మందుల దుకాణదారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఎమ్మార్పీ కంటే అధికంగా విక్రయించి నిలువునా దోచుకుంటున్నారు. మందు దుకాణాల దందాపై అసిస్టెంట్‌ డ్రగ్‌కంట్రోలర్‌ రమాదేవి వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా మందులు అధిక ధరకు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా అధిక ధరలకు అమ్మితే ఫిర్యాదు చేయాలన్నారు. 



Updated Date - 2021-05-15T04:42:20+05:30 IST