నకిలీ విత్తనాలపై నిఘా

ABN , First Publish Date - 2022-06-25T05:58:32+05:30 IST

నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీస్‌ కమిషనర్‌ విష్ణు ఎస్‌ వారియర్‌ అన్నారు. శుక్రవారం ఆయన పోలీస్‌అధికారులతో సమావేశం నిర్వహించి నకి

నకిలీ విత్తనాలపై నిఘా

ఎరువులతో మోసం చేస్తే ఉపేక్షించొద్దు

అక్రమ రవాణా మార్గాలపై దృష్టి

పోలీసులకు సీపీ విష్ణు వారియర్‌ దిశానిర్ధేశం

ఖమ్మం, జూన24(ఆంధ్రజ్యోతి): నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీస్‌ కమిషనర్‌ విష్ణు ఎస్‌ వారియర్‌ అన్నారు. శుక్రవారం ఆయన పోలీస్‌అధికారులతో సమావేశం నిర్వహించి నకిలీలపై దిశానిర్ధేశం చేశారు. పోలీస్‌స్టేషన్ల వారీగా వ్యవసాయశాఖ అధికారులతో సమన్వయంతో విస్తృతంగా పర్యటించి విత్తనాలు, ఎరువుల దుకాణాలను తనిఖీ చేయాలని ఆయన సూచించారు. పంటల సీజన పరిస్థితులను అవకాశంగా తీసుకుని అక్రమార్కులు, సామాన్యులు, రైతులను దోపిడీ చేయకుండా పోలీస్‌, వ్యవసాయ శాఖ సంయుక్త ఎనఫోర్స్‌మెంట్‌ విభాగం ప్రత్యేక కార్యాచరణకు ఉపక్రమించిందన్నారు. వ్యవసాయ సీజన ప్రారంభంకావడంతో అన్నదాతలకు అండగా నిలుస్తూ.. విత్తనాలు అక్రమంగా నిల్వచేస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నవారిపై నిఘాపెట్టాలని ఆదేశించారు. విత్తనాలు, ఎరువులు, పురుగులమందుల విక్రయాల్లో అక్రమాలు, నకిలీ దందాలను కట్టడి చేయాలన్నారు. ప్రధానంగా నకిలీ విత్తనాల తయారీకేంద్రాలు, అక్రమ రవాణా మార్గాలపై పోలీసులు దృష్టిసారించిందని, ఇతర రాష్ట్రాల్లో నకిలీ విత్తనాలు తయారుచేసే ముఠాలు అక్కడి నుంచి జిల్లాలోకి తరలించకుండా జిల్లాల్లోని సరిహద్దు ప్రాంతాలపై అధికారులు పటిష్ట నిఘా పెట్టారని తెలిపారు. షాపుల యజమానులు తప్పనిసరిగా రికార్డులు నిర్వహించాలన్నారు. రైతులకు నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువులు ఎవరైనా విక్రయిస్తే వారిపై చట్టప్రకారం కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈమేరకు ఫర్టిలైజర్‌ షాప్స్‌, విత్తనాలు అమ్మే దుకాణదారులకు కౌన్సెలింగ్‌ ఇవ్వాలని సూచించారు. ఎక్కడైనా నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువులు అమ్మినా, సరఫరా చేసినా, కొనుగోలు చేసినా స్థానిక పోలీస్‌ అధికారులకు, డయల్‌ 100 సమాచారం ఇవ్వాలని  సూచించారు. కాగా కమిషనర్‌ ఆదేశాలతో పోలీసు అధికారులు జిల్లా వ్యాప్తంగా ఫెర్టిలైజర్‌ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. సమావేశంలో అడిషనల్‌ డీసీపీ లా అండ్‌ ఆర్డర్‌ సుభాష్‌ చంద్రబోస్‌, ఏసీపీలు బస్వారెడ్డి, ప్రసన్నకుమార్‌, రామోజీరమేష్‌, పలువురు సీఐలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-25T05:58:32+05:30 IST