విదేశాల నుంచి వచ్చే వారిపై నిఘా

ABN , First Publish Date - 2021-12-01T07:09:52+05:30 IST

రోనా సెకండ్‌ వేవ్‌ నుంచి జనం కోలుకోక ముందే మూడో వేవ్‌గా దూసుకొస్తున్న ఒమైక్రాన్‌ జిల్లావాసులను కలవరపెడుతోంది

విదేశాల నుంచి వచ్చే వారిపై నిఘా

థర్డ్‌ వేవ్‌పై అధికారుల అప్రమత్తం..!

హాంకాంగ్‌ నుంచి ఒంగోలు వచ్చిన వ్యక్తి కుటుంబం ఐసోలేషన్‌కు 

జిల్లా ప్రజల్లో ఒమైక్రాన్‌ కలవరం 
8 కొవిడ్‌ పాజిటివ్‌లు నమోదు 

ఒంగోలు (కార్పొరేషన్‌), నవంబరు 30 : కరోనా సెకండ్‌ వేవ్‌ నుంచి జనం కోలుకోక ముందే మూడో వేవ్‌గా దూసుకొస్తున్న ఒమైక్రాన్‌ జిల్లావాసులను కలవరపెడుతోంది. దీని వలన ముప్పు తీవ్రమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక జారీ చేసింది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చే వారిపై నిఘా ఉంచింది. ఇటీవల వివిధ దేశాల నుంచి రాష్ట్రానికి 64మంది రాగా, వారిలో జిల్లాకు ఇద్దరు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. చైనా నుంచి గుంటూరు జిల్లా పల్నాడుకు చెందిన ఒక వ్యక్తి జిల్లాలోని మర్రిపూడి మండలం కాకర్ల గ్రామానికి వచ్చారు. అలాగే హాంకాంగ్‌ నుంచి మరో యువకుడు ఒంగోలులోని సుజాతనగర్‌కు వచ్చాడు. సమాచారం తెలుసుకున్న జిల్లా యంత్రాంగం ఆ యువకుడి కుటుంబ సభ్యులను హోం ఐసోలేషన్‌లో ఉంచారు. మంగళవారం వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇంకా ఫలితాలు రావాల్సి ఉంది. అయితే సదరు వ్యక్తి మాత్రం తాను హాంకాంగ్‌ నుంచి వచ్చినపుడు శంషాబాద్‌ విమానాశ్రయంలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారని చెప్పారు. అందులో తనకు నెగెటివ్‌ వచ్చిందని అధికారులకు తెలిపారు. అయినప్పటికీ స్థానికంగా నిర్వహించే నిర్ధారణ పరీక్షల ఫలితాలు వెలువడాల్సి ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. కాగా కరోనా మూడోదశపై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇందుకోసం కలెక్టర్‌ కార్యాలయంలో కొవిడ్‌ కంట్రోల్‌రూంను ఏర్పాటు చేయడమే కాకుండా విదేశాల నుంచి వచ్చే వారిపై నిరంతర నిఘా ఉంచారు. కొవిడ్‌ నిబంధనలు కఠినతరం చేస్తున్నారు. కొత్త వేరియంట్‌ను అరికట్టేందుకు యూరప్‌, దక్షిణాఫ్రికా, జింబాబ్వే, బంగ్లాదేశ్‌, చైనా, మారిషస్‌, సింగపూర్‌, హాంకాంగ్‌, ఇజ్రాయిల్‌ వంటి విదేశీ రాకపోకలపై తాత్కాలిక నిషేధం విధించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని   సూచించారు. విదేశాల నుంచి వచ్చిన వారు తప్పనిసరిగా హోంక్వారంటైన్‌లో ఉండాలని కోరుతున్నారు. 


8 కొవిడ్‌ పాజిటివ్‌లు  

జిల్లాలో మంగళవారం 8 కొవిడ్‌ పాజిటివ్‌లు నమోదయ్యాయి. గత వారం రోజులుగా ఐదు లోపుమాత్రమే  వెలుగు చూస్తుండగా మంగళ వారం కొద్దిగా పెరిగాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకూ 1,38,702 మంది వైరస్‌ బారిన పడ్డారు. వారిలో 1,37,518 మంది కోలుకున్నారు. 1,129 మంది మృతి చెందారు. ప్రస్తుతం 55 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మరోవైపు వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది. మంగళవారం 160 కేంద్రాల్లో 13,482 మందికి టీకాలు వేశారు. 


Updated Date - 2021-12-01T07:09:52+05:30 IST