బడిబయటి పిల్లల గుర్తింపునకు సీఆర్పీల సర్వే

ABN , First Publish Date - 2022-01-19T04:39:59+05:30 IST

నారాయణపేట జిల్లా వ్యాప్తంగా బడి బయట పిల్లలను గుర్తించేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో సీఆర్పీలు సర్వే చేస్తున్నారు.

బడిబయటి పిల్లల గుర్తింపునకు సీఆర్పీల సర్వే
బడి బయటి పిల్లల గురించి ఆరా తీస్తున్న సీఆర్పీలు

- 18 ఏళ్లలోపు బడిమానేసిన వారిని గుర్తించేందుకు విద్యాశాఖ కసరత్తు

- ఈ నెల 25 వరకు సర్వే కొనసాగింపు

నారాయణపేట, జనవరి 18 : నారాయణపేట జిల్లా వ్యాప్తంగా బడి బయట పిల్లలను గుర్తించేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో సీఆర్పీలు సర్వే చేస్తున్నారు. జిల్లాలో 11 మండలాలు ఉండగా అందులో మూడు మునిసిపాలిటీలు కోస్గి, మక్తల్‌, నారాయణపేటతో పాటు 280 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జిల్లాలో 334 ప్రాథమిక పాఠశాల లు, 85 యూపీఎస్‌, 76 ఉన్నత పాఠశాలలు, 128 ప్రైవేటు పాఠశాలలు, 11 కస్తూర్బా, మండల కేంద్రాల్లో గురుకుల పాఠ శాలలు ఉండగా 97,212 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల కూలీ పనులకు వెళ్లడం తదితర కారణాలతో చదువుకు దూరంగా కొంతమంది బడీడు పిల్లలు ఉన్నారు. కాగా ఈనెల 25వరకు బడి బయటి పిల్లలతో పాటు మధ్యలో బడి మానేసిన పిల్లల వివరాలను సేకరించేం దుకు సీఆర్పీలు సర్వే చేపట్టారు. గతంలో 6-14 ఏళ్లలోపు ఉన్న పిల్లలను మాత్రమే బడి బయట పిల్లలుగా గుర్తించేవారు. ప్రస్తుతం 14 ఏళ్లలోపు ఉన్నవారితో పాటు 15- 18 ఏళ్లలోపు ఉండి మధ్యలో చదువు మానేసిన వారిని సైతం గుర్తించి వారికి విద్యను అందించేలా చర్యలు తీసుకోనున్నారు. గత ఏడాది 14 ఏళ్లలోపు ఉన్న పిల్లలను 391 మందిని గుర్తించగా అందులో 78 మందిని పాఠశాలలో చేర్పించారు. 18 ఏళ్లలోపు వారు 414 మందిని గుర్తించగా అందులో 17 మందితో సార్వత్రిక విద్యను అందించేలా చర్యలు తీసుకున్నారు. తాజాగా సీఆర్పీలు సర్వేలో గుర్తించిన బడిబయట పిల్లలను ఏ మేరకు విద్యాబుద్దులు అందించేందుకు చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాలి.   

కొనసాగుతున్న ఇంటింటి సర్వే

బడి బయట పిల్లల గుర్తింపు కోసం చేపట్టిన సర్వే మంగళవారం జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీలో సీఆర్పీల ఆధ్వర్యంలో కొనసాగింది. సర్వేలో సీఆర్పీలు ఆరీఫ్‌, పవిత్ర పాల్గొన్నారు.



Updated Date - 2022-01-19T04:39:59+05:30 IST