తుదిదశకు ఎస్సారెస్పీ ఫ్లడ్‌ఫ్లో కెనాల్‌ ఎత్తిపోతల సర్వే పనులు

ABN , First Publish Date - 2020-08-04T10:30:15+05:30 IST

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు వరద కాలువ నుంచి ఎత్తిపోతల ద్వారా సాగునీరందించేందుకు ఉద్దేశించిన బృహత్తర పథకం సర్వే పనులు

తుదిదశకు ఎస్సారెస్పీ ఫ్లడ్‌ఫ్లో కెనాల్‌ ఎత్తిపోతల సర్వే పనులు

సర్వే నివేదికలను పరిశీలించిన బోయినపల్లి వినోద్‌కుమార్‌

సవరణల అనంతరం సీఎం కేసీఆర్‌కు నివేదికలు


కరీంనగర్‌, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు వరద కాలువ నుంచి ఎత్తిపోతల ద్వారా సాగునీరందించేందుకు ఉద్దేశించిన బృహత్తర పథకం సర్వే పనులు దాదాపుగా కొలిక్కి వచ్చాయి. ఈ సర్వే నివేదికలను రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌, ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులతో హైదరాబాద్‌లోని మంత్రుల అధికారిక నివాసంలో సోమవారం సమీక్షించారు. తుదిరూపం దాల్చిన సర్వే నివేదికను క్షుణ్ణంగా పరిశీలించిన వినోద్‌కుమార్‌ పలు సూచనలు చేశారు. ఈ సూచనల సవరణ అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు అందజేయనున్నారు. నీటిపారుదలశాఖ ఇంజనీర్లు, ప్రజాప్రతినిధులు కలిసి నిరంతరం కష్టపడి సర్వే పనులు నిర్వహించడంలో చేసిన కృషిని వినోద్‌కుమార్‌ అభినందించారు. ఫ్లడ్‌ఫ్లో కెనాల్‌ ఎత్తిపోతల ద్వారా ఉమ్మడి జిల్లాలో సాగునీటి సమస్యలు ఇక ఉండవని వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు.


ఇప్పటికే శ్రీపాద ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, శ్రీరాజరాజేశ్వర ప్రాజెక్టుల ద్వారా సాగు, తాగునీరు రైతులు, ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని, కొత్తగా ఫ్లడ్‌ఫ్లో కెనాల్‌ ఎత్తిపోతలతో నూతన శకానికి నాంది పలికినట్లు అవుతుందని, చరిత్రలో సీఎం కేసీఆర్‌ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు వరద కాలువ పరివాహక ప్రాంతంలోని ప్రజాప్రతినిధులు, రైతు ప్రతినిధులు, నీటిపారుదల ఇంజనీర్లతో సీఎం కేసీఆర్‌ ఇటీవల హైదరాబాద్‌ ప్రగతిభవన్‌లో సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బోయినపల్లి వినోద్‌కుమార్‌ నిరంతరంగా ఫ్లడ్‌ఫ్లో కెనాల్‌ ఎత్తిపోతల సర్వే పనుల పురోగతిని సమీక్షిస్తున్నారు. ఈ సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌, జగిత్యాల జిల్లా పరిషత్‌ వైస్‌చైర్మన్‌ హరిచరణ్‌రావు, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిషత్‌ మాజీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, మార్కెఫెడ్‌ మాజీ చైర్మన్‌ బాపురెడ్డి, మల్యాల జడ్పీటీసీ రామ్మోహన్‌రావు, కథలాపూర్‌ జడ్పీటీసీ నాగం భూమయ్య, రైతు సమన్వయ సమితి కో-ఆర్డినేటర్‌ శ్రీపాల్‌రెడ్డి, రిటైర్డ్‌ ఎస్‌ఈ గోవిందరావు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-04T10:30:15+05:30 IST