చీకటి బతుకులు

ABN , First Publish Date - 2021-03-01T05:26:50+05:30 IST

నిజాం దక్కన్‌ షుగర్స్‌ ఫ్యాక్టరీలో ఏళ్లుగా పనిచేసిన కార్మికుల జీవితాలను చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి. ఐదేళ్ల క్రితం అకస్మాత్తుగా అర్ధరాత్రి లాక్‌అవుట్‌ ప్రకటనతో ఉపాధి కోల్పోయిన కార్మికులు బతుకులు అంధకారంలో కూరుకుపోయాయి. పనిలేక.. ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇంకా ఇరవై మంది వరకు కార్మిక కుటుంబాలు ఫ్యాక్టరీ క్వార్టర్స్‌లోనే దయనీయ పరిస్థితుల్లో కాలం వెల్లదీస్తున్నారు.

చీకటి బతుకులు
కరెంటు లేక చీకట్లో కార్మికు కుటుంబం

అంధకారమైన ఎన్‌డీఎస్‌ఎల్‌ కార్మికుల జీవితాలు

క్వార్టర్స్‌కు కరెంటు కట్‌.. నీటి సరఫరా బంద్‌

ఐదేళ్లుగా ఉపాధి లేక ఆగమైన బతుకులు

దయనీయ పరిస్థితుల్లో కాలం వెల్లదీత

ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌, ఫిబ్రవరి 28 : నిజాం దక్కన్‌ షుగర్స్‌ ఫ్యాక్టరీలో ఏళ్లుగా పనిచేసిన కార్మికుల జీవితాలను చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి. ఐదేళ్ల క్రితం అకస్మాత్తుగా అర్ధరాత్రి లాక్‌అవుట్‌ ప్రకటనతో ఉపాధి కోల్పోయిన కార్మికులు   బతుకులు అంధకారంలో కూరుకుపోయాయి. పనిలేక.. ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇంకా ఇరవై మంది వరకు కార్మిక కుటుంబాలు ఫ్యాక్టరీ క్వార్టర్స్‌లోనే దయనీయ పరిస్థితుల్లో కాలం వెల్లదీస్తున్నారు. 

ఒకప్పుడు వెలుగు వెలిగిన మెదక్‌ మండలం మంబోజిపల్లిలోని నిజాం దక్కన్‌ షుగర్స్‌ లిమిటెడ్‌ కంపెనీని నష్టాల పేరిట 2015 డిసెంబరు 23న అర్ధరాత్రి యాజమాన్యం లాక్‌అవుట్‌ ప్రకటించింది. మొదట్లో ఫ్యాక్టరీలో మొత ్తం రెండు వందల మంది కార్మికులు పనిచేసేవారు. అయితే యాజమాన్యం ఇందులో 130 మందిని స్వచ్ఛంద పదవీ విరమణ చేయించింది. మిగిలిన కార్మికులతో ఫ్యాక్టరీని నడిపించారు. అకస్మాత్తుగా లాక్‌ అవుట్‌ ప్రకటించడంతో కార్మికులందరూ ఉపాధి కోల్పోగా బయట అద్దె ఇళ్లల్లో ఉండలేక ఫ్యాక్టరీ ఆవరణలోని క్వార్టర్లలోనే 120 కుటుంబాల వరకు నివాసం ఉండేవారు. తదననంతరం ఉపాధిని వెతుక్కుంటూ వంద కుటుంబాలు వరకు వివిధ ప్రాంతాలకు వలస వెళ్లాయి. మిగిలిన 20 కుటుంబాలు ఎటు వెళ్లే దిక్కులేక ప్రస్తుతం ఫ్యాక్టరీ క్వార్టర్లలోనే నివసిస్తున్నాయి.


చీకటైతే చాలు పాములు, దొంగల భయం

మంబోజిపల్లిలోని నిజాం దక్కన్‌ షుగర్స్‌ ఫ్యాక్టరీ 175 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఫ్యాక్టరీ ఆవరణ అంతా చెట్లు, గుట్టలతో నిండిపోయి ఉంటుంది. పూర్తిగా అటవీప్రాంతం కావడంతో రాత్రి వేళల్లో ఇళ్లల్లోకి పాములు వస్తున్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దొంగల భయం కూడా నెలకొన్నదని వాపోతున్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం రూ.20 లక్షల వరకు కరెంటు బిల్లు బకాయుపడింది. దీంతో విద్యుత్‌ శాఖ అధికారులు ఫ్యాక్టరీకి కరెంటు సరఫరాను నిలిపివేశారు. గతేడాది నవంబరు 27 నుంచి క్వార్టర్స్‌లోని కుటుంబాలు చీకట్లోనే మగ్గుతున్నాయి. మరోవైపు బోర్లున్నా కరెంట్‌ సరఫరా లేకపోవడంతో నీళ్లు రావడం లేదు. 


అనారోగ్యం పాలైన కార్మిక కుటుంబాలు

ఫ్యాక్టరీ క్వార్టర్లలో ఉంటున్న కార్మికులందరూ స్కిల్డ్‌ కార్మికులే. షుగర్‌ ఫ్యాక్టరీ తెరవకపోవడంతో సరైన పని దొరక్క కూలీ పనులకు వెళుతున్నారు. కొందరు చెప్పులు కుట్టి బతుకుతుంటే, మరికొందరు సెక్యూరిటీగార్డులుగా పనిచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కార్మికులు వారి కుటుంబ సభ్యులు అనారోగ్యంతో మంచం పడుతున్నారు. వైద్యం కోసం లక్షల రూపాయలు అప్పులు చేశామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు కార్మికులు మనస్తాపానికి గురై గుండెపోటుతో మరణించారు. 


చెల్లాచెదురైన చిరు వ్యాపారులు  

ఫ్యాక్టరీని నమ్ముకుని పరోక్షంగా ఉపాధి వెతుకున్న చిరు వ్యాపారులు అనేక మంది చెల్లాచెదురయ్యారు. పాలు, కూరగాయలు అమ్ముకునే వారు ఉపాధి కోల్పోయారు. హోటళ్లు, కిరాణ దుకాణాలు, పాన్‌షాపులు, పంక్చర్‌షాపులన్నీ మూతపడ్డాయి.


కేసీఆర్‌ వల్లనే ఫ్యాక్టరీ మూతపడింది 

సీఎం కేసీఆర్‌ తీరుతోనే ఫ్యాక్టరీ మూతపడింది. తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ప్రభుత్వ ఆదీనంలోకి తీసుకుని నడుపుతామని హామీ ఇచ్చారు. దీంతో అర్ధరాత్రి ఫ్యాక్టరీ యాజమాన్యం లాక్‌అవుట్‌ ప్రకటించింది. కేసీఆర్‌ అధికారంలోకి వచ్చినా ఏమీ చేయలేదు

- తిరుపతిరెడ్డి, కార్మికుడు 


ప్రభుత్వమే ఆదుకోవాలి

ఐదేళ్లుగా ఉపాధి కోల్పోయాం. కోర్టు తీర్పు ప్రకారం రావలసిన బెనిఫిట్లు రాలేదు. ప్రస్తుతం తినడానికే కష్టంగా ఉంది. బెంగతో నా భార్య అనారోగ్యం పాలై మంచం పట్టింది. సపర్యలు చేయలేక నేనూ అనారోగ్యం పాలయ్యాను. వైద్యం కోసం రూ.10 లక్షల అప్పు చేశాను. ఇప్పటికైనా ప్రభుత్వం ఆదుకోవాలి.

- అంజాగౌడ్‌, కార్మికుడు


కనీసం కరెంటు, నీళ్లన్నా ఇవ్వండి 

ఫ్యాక్టరీ క్వార్టర్లలో కరెంట్‌ లేదు. యాజమాన్యం బకాయిలు చెల్లించలేదని కరెంట్‌ కట్‌ చేశారు. రాత్రిపూట ఇళ్లలోకి పాములు వస్తున్నాయి. పిల్లల చదువులు సాగడం లేదు. తాగడానికి, ఇతర అవసరాలకు నీటిని బయటి నుంచే తెచ్చుకుంటున్నాం.

- షమీసింగ్‌, రిటైర్డ్‌ కార్మికుడు





Updated Date - 2021-03-01T05:26:50+05:30 IST