India vs West Indies T20: సూర్యకుమార్ మెరుపులు.. టీమిండియా సునాయాస విజయం

ABN , First Publish Date - 2022-08-03T14:08:46+05:30 IST

వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో రోహిత్ సేన ఘన విజయం సాధించింది. భారత ఓపెనర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (44 బంతుల్లో 76; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో మెరుపులు మెరిపించాడు.

India vs West Indies T20: సూర్యకుమార్ మెరుపులు.. టీమిండియా సునాయాస విజయం

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో రోహిత్ సేన ఘన విజయం సాధించింది. భారత ఓపెనర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (44 బంతుల్లో 76; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో మెరుపులు మెరిపించాడు. సూర్యకు వికెట్ కీపర్ రిషబ్‌ పంత్‌(26 బంతుల్లో 33 నాటౌట్‌, 3 ఫోర్లు, 1 సిక్సర్‌) తనవంతు సహకారం అందించడంతో భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో కరేబియన్ టీంను మట్టికరిపించింది. 165 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 19 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి సునాయాసంగా టార్గెట్‌ను చేధించింది. ఈ విజయంతో టీమిండియా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా ఆతిథ్య జట్టు బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్‌ కైల్‌ మేయర్స్‌ (50 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 73) అర్ధసెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్‌కు 2 వికెట్లు, హార్దిక్‌, అర్ష్‌దీప్‌ తలో వికెట్ పడగొట్టారు.


అనంతరం 165 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్ సూర్యకుమార్ ఆకాశమే హద్దుగా చెలరేగి సునాయాస విజయాన్ని అందించాడు. మొదటి రెండు మ్యాచుల్లో నిరాశపరిచిన సూర్య.. ఈ మ్యాచ్‌లో మాత్రం విండీస్ బౌలర్లపై మొదటి నుంచే ధాటిగా ఆడాడు. వరుస బౌండరీలతో హోరెత్తించాడు. 44 బంతుల్లో 76 పరుగులు చేసిన సూర్యకుమార్ జట్టు స్కోర్ 135 పరుగుల వద్ద రెండో వికెట్‌ రూపంలో వెనుదిరిగిన అప్పటికే భారత్‌ విజయం ఖాయమైపోయింది. దీపక్‌ హుడా (10 నాటౌట్‌)తో కలిసి పంత్‌ మిగతా పని పూర్తి చేశాడు. భారత విజయంలో కీలకపాత్ర పోషించిన సూర్యకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. ఈ విజయంతో రోహిత్ సేన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.



Updated Date - 2022-08-03T14:08:46+05:30 IST