సందడిగా కైలాసనాథుడి బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2021-03-09T06:56:01+05:30 IST

ముక్కంటి బ్రహ్మోత్సవాలలో సోమవారం గంగాభవానీ సమేత శ్రీకాళహస్తీశ్వరుడు సూర్యప్రభ వాహనంపై ఊరేగారు.

సందడిగా కైలాసనాథుడి బ్రహ్మోత్సవాలు
సూర్యప్రభపై ముక్కంటి, రథంపై జ్ఞానప్రసూనాంబ ఊరేగింపు

శ్రీకాళహస్తి, మార్చి 8: శ్రీకాళహస్తీశ్వరాలయ మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం ఉదయం గంగాభవానీ సమేత శ్రీకాళహస్తీశ్వరుడు సూర్యప్రభ వాహనంపై వైభవంగా ఊరేగారు. రథంపై కొలువుదీరిన జ్ఞానప్రసూనాంబ, మూషిక వాహనంపై వినాయకస్వామి, శ్రీవళ్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి, చండీకేశ్వరుడు, భక్తకన్నప్ప చప్పరాలపై ఊరేగుతూ భవుడిని అనుసరించారు. ఊరేగింపులో పదాతిదళాలు, మంగళవాయిద్యాలు, మేళతాళాలు, కోలాటం, భజనబృందాల సందడి అలరించింది. సోమవారం రాత్రి జగద్రక్షకుడైన శివుడు భూతవాహనంపై పార్వతీదేవి శుకవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. జ్ఞానప్రసూనాంబ చిలుక వాహనంపై, పంచమూర్తులు తమ వాహనాలపై కొలువుదీరి స్వామి వెంట నడిచారు. రాజగోపురం, నగరివీధి, బజారువీధి మీదుగా పార్వతీపరమేశ్వరుల ఊరేగింపు జరిగింది. పలుప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు ముక్కంటీశుడికి కర్పూర హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ముక్కంటీశుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్థానిక ధూర్జటి కళాప్రాంగణంలో జరిగిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. కార్యక్రమంలో ఆలయ ఈవో పెద్దిరాజు, అసిస్టెంట్‌ కమిషనర్‌ కృష్ణారెడ్డి, ఏఈవో ధనపాల్‌, ఏపీఆర్వో హరిబాబు యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-03-09T06:56:01+05:30 IST