మహిళా ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2021-05-09T05:43:01+05:30 IST

చుండూరు మహిళా ఎస్‌ఐ పిల్లి శ్రావణి(35), అదే స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ రవీంద్రలు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

మహిళా ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నం

కొంతకాలంగా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం!

కానిస్టేబుల్‌ను వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు?

మనస్థాపంతోనే పురుగుమందు తాగిన ఎస్‌ఐ, కానిస్టేబుల్‌

మహిళా ఎస్‌ఐ పరిస్థితి విషమం


గుంటూరు, మే 8: చుండూరు మహిళా ఎస్‌ఐ పిల్లి శ్రావణి(35), అదే స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ రవీంద్రలు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన శనివారం ఉదయం తెనాలిలో చోటుచేసుకుంది. ఈ విషయాన్ని పోలీసు అధికారులు గోప్యంగా ఉంచుతూ వారిద్దరిని గుంటూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు.   విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి... ప్రకాశం జిల్లా కందుకూరు ప్రాంతానికి చెందిన శ్రావణి బదిలీపై ఏడు నెలలక్రితం ఆమె చుండూరు ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ రవీంద్రతో ఆమె చాలాకాలంగా సన్నిహితంగా ఉంటున్నట్లు పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. అంతేగాక కానిస్టేబుల్‌ రవీంద్ర మహిళా ఎస్‌ఐను అడ్డుపెట్టుకుని వసూళ్లకు పాల్పడుతున్నట్టు కూడా ఫిర్యాదులు వచ్చాయి. దీంతో రెండురోజుల క్రితం కానిస్టేబుల్‌ రవీంద్రను వీఆర్‌కు పంపినట్టు తెలిసింది. శ్రావణి చేబ్రోలులోని ఓ అపార్టుమెంటులో ప్లాట్‌ అద్దెకు తీసుకుని తన తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటోంది. శనివారం ఉదయం కూడా కానిస్టేబుల్‌ రవీంద్ర చేబ్రోలులోని మహిళా ఎస్‌ఐ ఇంటికి వచ్చి వెళ్లాడు. ఆ తర్వాత మహిళా ఎస్‌ఐ కారులో ఇంటి నుంచి బయటకు వెళ్లారు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందోగానీ తెనాలిలో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు పోలీసు అధికారులకు సమాచారం అందింది. వెంటనే వారిని తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించగా మహిళా ఎస్‌ఐ పరిస్థితి విషమంగా వుంటంతో వెంటనే గుంటూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. రవీంద్రను కూడా గుంటూరులోని మరో ఆస్పత్రికి తరలించారు. తొలుత రవీంద్ర పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సెల్ఫీ వీడియో తీసి ఎస్‌ఐ శ్రావణికి పెట్టగా అది చూసిన మహిళా ఎస్‌ఐ కూడా పురుగుమందు తాగినట్టు పోలీసు ఉన్నతాధికారుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగుచూసినట్టు తెలిసింది. శ్రావణికి గతంలోనే పోలీసు శాఖకు చెందిన యువకుడితో వివాహం జరగ్గా వారిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. కాగా ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణకు రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ ఆదేశించారు. కానిస్టేబుల్‌ రవీంద్రకు ఎటువంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. తెనాలిలో నివాసం ఉండే రవీంద్రకు గతంలోనే వివాహం జరగ్గా ఆయనకు భార్య, పిల్లలు ఉన్నట్లు తెలిసింది. 

Updated Date - 2021-05-09T05:43:01+05:30 IST