అధికారం.. ఆయువు తీసింది

ABN , First Publish Date - 2022-08-08T05:58:04+05:30 IST

వరద ముంపు నుంచి తన పొలాన్ని రక్షించేందుకు రూ.లక్షలతో వేసుకున్న మట్టికట్ట అధికారులు తొలగించడం.. ఈ క్రమంలో వారి దౌర్జన్యంపై మనస్తాపంతో ఓ రైతు ఆయువు తీసుకున్న ఘటన అమరావతి మండల పరిధిలోని ఉంగుటూరులో చోటుచేసుకుంది.

అధికారం.. ఆయువు తీసింది
నందకిషోర్‌ భూమిలో అధికారులు తీసిన కాలువ

అధికారుల దౌర్జన్యంతో రైతు మనస్తాపం 

పురుగుముందు తాగిన భూ యజమాని మృతి

భర్త ఆత్మహత్యకు అధికారులే కారణమంటున్న భార్య 


అమరావతి, ఆగస్టు 7: వరద ముంపు నుంచి తన పొలాన్ని రక్షించేందుకు రూ.లక్షలతో వేసుకున్న మట్టికట్ట అధికారులు తొలగించడం.. ఈ క్రమంలో వారి దౌర్జన్యంపై మనస్తాపంతో ఓ రైతు ఆయువు తీసుకున్న ఘటన అమరావతి మండల పరిధిలోని ఉంగుటూరులో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు.. మండల పరిధిలోని ఉంగుటూరు గ్రామానికి చెందిన రైతు ముత్తవరపు నందకిషోర్‌(30), ఆయన సోదరుడు పవన్‌కు గ్రామంలోని చెరువు సమీపంలో పొలం ఉంది. వర్షాలు పడినప్పుడల్లా చెరువు నీరు పొంగి పొలంపైగా ప్రవహిస్తుండటంతో పంట నష్టపోతున్నారు. ఈ క్రమంలో  ముంపు నీరు రాకుండా మట్టి కట్ట వేసుకున్నారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలతో 14వ మైలు నుంచి ఉంగుటూరు వెళ్లే మార్గంలో రహదారిపై నీరు నిలిచింది. ఈ క్రమంలో శనివారం రెవెన్యూ అధికారులు పొలం వద్ద వేసుకున్న మట్టి కట్ట కారణంగా నీరు నిలిచిదంటూ ఎక్స్‌వేటర్‌ సహాయంతో ఆ కట్టను తొలగించారు. దీనిని నందకిషోర్‌ అడ్డుకునేందుకు యత్నించగా అధికారులు పక్కకు నెట్టేశారు. ఎక్స్‌కవేటర్‌కు అడ్డుగా పోయిన పవన్‌ తలకు గాయమైంది. దీంతో మనస్తాపం చెందిన నందకిషోర్‌ పురుగుల మందు తాగాడు. వెంటనే అతడ్ని గుంటూరులోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. నందకిషోర్‌కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంఘటనకు సంబంధించి సీఐ కేసు నమోదు చేసి మృతదేహాన్ని జీజీహెచ్‌కి తరలించారు.


వైసీపీ నాయకులే వల్లే..

స్థానిక వైసీపీ నాయకుల ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీసు అధికారులు బలవంతంగా ఎక్స్‌వేటర్‌తో మట్టి కట్టను తొలగించారని అడ్డుగా పోయిన తన భర్త, మరిది పవన్లపై దౌర్జన్యం చేశారని నందకిషోర్‌ భార్య జయలక్ష్మి ఆరోపించింది. అధికారుల దౌర్జన్యం కారణంగా తన భర్త పోలీసుల ఎదుటే పురుగుమందు తాగాడని చెప్పింది. భర్త మృతికి కారణమైన అధికారులు, వైసీపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకుని తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె కన్నీటిపర్యంతమైంది. ముంపు నుంచి రక్షణకు చెరువులోని మట్టి తోలుకోమని సలహా ఇచ్చి ఆ తర్వాత వైసీపీ నాయకులు అధికారులకు ఫిర్యాదు చేశారని పవన్‌ తెలిపారు. తన అన్న మృతికి వైసీపీ నాయకులే కారణని ఆరోపించారు. 


నందకిషోర్‌ది ప్రభుత్వ హత్య

ముత్తవరపు నందకిషోర్‌ మరణం ప్రభుత్వ హత్యగానే భావించాల్సి వస్తుందని పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ తెలిపారు. ఆదివారం నందకిషోర్‌ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ ముంపు నుంచి పొలాన్ని కాపాడుకునేందుకు మట్టికట్ట పోసుకున్న రైతును బెదిరించి అధికారులు కట్టను తొలగించడం అన్యాయమన్నారు. ఏదైనా ఉంటే సమస్య పరిష్కారం జరిగేలా సామరస్యంగా పరిష్కరించాల్సిన అధికారులే అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా వ్యవహరించారన్నారు. నందకిషోర్‌ భూమికి ముందుగా వేరే రైతు గోడకట్టి దానిపై మట్టిపోసినా దాని  జోలికి వెళ్లకుండా నందకిషోర్‌ మట్టికట్టనే తొలగించారన్నారు. నందకిషోర్‌ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని, రైతు మృతికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని శ్రీధర్‌ డిమాండ్‌ చేశారు. 

  




 

Updated Date - 2022-08-08T05:58:04+05:30 IST