జమ్మూలో Pak droneపై బీఎస్ఎఫ్ కాల్పులు

ABN , First Publish Date - 2022-06-09T16:21:00+05:30 IST

పాక్ డ్రోన్‌పై గురువారం బీఎస్ఎఫ్ జవాన్లు కాల్పులు జరిపారు....

జమ్మూలో Pak droneపై బీఎస్ఎఫ్ కాల్పులు

పేలుడు పదార్థాలున్నాయనే అనుమానంతో శోధన

జమ్మూ(జమ్మూకశ్మీర్):పాక్ డ్రోన్‌పై గురువారం బీఎస్ఎఫ్ జవాన్లు కాల్పులు జరిపారు. జమ్మూకశ్మీరులోని అర్నియా సరిహద్దుల్లో గురువారం తెల్లవారుజామున 4.15గంటలకు అనుమానాస్పద పాకిస్థాన్ డ్రోన్ కదలికలను సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) గుర్తించింది. సరిహద్దుల్లో పాకిస్థాన్ డ్రోన్ 300 మీటర్ల ఎత్తులో ఉండగా బీఎస్ఎఫ్ జవాన్లు పలు రౌండ్ల కాల్పులు జరిపారు.ఎగురుతున్న డ్రోన్ నుంచి మెరిసే కాంతి బీఎస్ఎఫ్ జవాన్లు గమనించారు. పాక్ అనుమానిత డ్రోన్ నుంచి ఏవైనా ఆయుధాలు, పేలుడు పదార్థాలు కిందకు జారవిడిచారనే అనుమానంతో బీఎస్ఎఫ్ జవాన్లు శోధన ప్రారంభించారు.జమ్మూ, కథువా, సాంబా సెక్టార్లలో ఈ మధ్య కాలంలో భద్రతా బలగాలు పలు డ్రోన్‌లను కూల్చివేశాయి. 


ఈ డ్రోన్ల నుంచి రైఫిల్స్, ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరాలు, అంటుకునే బాంబులను స్వాధీనం చేసుకున్నాయి. సరిహద్దు ప్రాంతంలో ఇటీవలి డ్రోన్ కార్యకలాపాలు పెరిగాయి. ఉగ్రవాదులకు ఆయుధాలు, మందుగుండు సామాగ్రి,పేలుడు పదార్థాలను అక్రమంగా తరలించడానికి పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు చేసిన ప్రయత్నాలని ఓ భద్రతాధికారి చెప్పారు.ఇటీవల జమ్మూలోని అఖ్నూర్ సరిహద్దు ప్రాంతంలో బలగాలు కూల్చివేసిన డ్రోన్ లో మూడు మాగ్నెటిక్ ఐఈడీలు, ఇతర పేలుడు పదార్థాలను జమ్మూకశ్మీర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘‘ఇండో-పాకిస్తాన్ సరిహద్దు వెంబడి ప్రతిచోటా డ్రోన్‌ల ముప్పు ఉంది, అయితే ఈ ప్రాంతంలోని సరిహద్దు ఆవల నుంచి వచ్చే డ్రోన్లను కూల్చడానికి భద్రతా దళాలు అప్రమత్తంగా ఉన్నాయి’’ అని సీనియర్ బిఎస్‌ఎఫ్ అధికారి తెలిపారు.


మే 15,  ఫిబ్రవరి 24 న జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఇలాంటి డ్రోన్ కదలికలను నివేదించారు. ఆ తర్వాత పోలీసులు స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ కార్డన్-అండ్-సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.


Updated Date - 2022-06-09T16:21:00+05:30 IST