ఇంటర్‌ జవాబు పత్రాల గల్లంతు వ్యవహారంలో ముగ్గురిపై సస్పెన్షన్‌ వేటు

ABN , First Publish Date - 2022-06-25T07:07:45+05:30 IST

ఇంటర్‌ జవాబు పత్రాల గల్లంతు వ్యవహారంలో ముగ్గురిపై సస్పెన్షన్‌ వేటు పడింది.

ఇంటర్‌ జవాబు పత్రాల గల్లంతు వ్యవహారంలో ముగ్గురిపై సస్పెన్షన్‌ వేటు

తిరుపతి(విద్య), జూన్‌24: ఇంటర్‌ జవాబు పత్రాల గల్లంతు వ్యవహారంలో ముగ్గురిపై సస్పెన్షన్‌ వేటు పడింది. గత నెలలో జరిగిన ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల్లో తుపాను కారణంగా ప్రథమ సంవత్సరం పరీక్షను అదే నెల 25న నిర్వహించారు. దీనికి సంబంధించి తిరుపతి ఏఐఆర్‌ బైపాస్‌ రోడ్డులోని ఓ పరీక్ష కేంద్రంలో పరీక్ష రాసిన 15 మంది విద్యార్థుల జవాబుపత్రాల బండిల్‌ గల్లంతయినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై ఇంటర్మీడియట్‌ బోర్డు ఉన్నతాధికారులకు ప్రాంతీయ బోర్డు అధికారులు సమాచారం ఇచ్చారు. దీనిపై తర్జనభర్జన పడిన అధికార వర్గాలు ఎట్టకేలకు ఫలితాల విడుదలకు ముందు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను పిలిచి మాట్లాడారు. ఆ పరీక్షను మళ్లీ రాస్తారా లేదా పరీక్ష రాసిన గ్రూపు సబ్జెక్టుల్లో (బైపీసీ వారికి బోటనీ, జువాలజీ, ఫిజిక్స్‌లను, ఎంపీసీ విద్యార్థులకు మ్యాథ్స్‌, ఫిజిక్స్‌) వచ్చిన మార్కులను యావరేజ్‌గా తీసుకుంటారా అని అడిగినట్లు తెలిసింది. గ్రూపు సబ్జెక్టుల్లో వచ్చిన మార్కులను యావరేజ్‌గా తీసుకుని పాస్‌ చేయడంతో పాటు అడ్వాన్డ్స్‌ పరీక్షలకు అనుమతించాలని కోరారని సమాచారం. దీనిపై తల్లిదండ్రుల సమ్మతిని తెలియజేస్తూ ఇంటర్‌ బోర్డు అధికారులకు ఆర్‌ఐవో నివేదిక ఇచ్చారని తెలిసింది. ఇంప్రూవ్‌మెంట్‌ కోసం అడ్వాన్డ్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు రాసుకునే వెసులుబాటును కూడా కల్పించాలని ఆర్‌ఐవో నివేదించారని తెలిసింది.జవాబుపత్రాల మిస్సింగ్‌కు బాధ్యులైన చీఫ్‌ సూపరింటెండెంట్‌(సీఎస్‌), డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్‌(డీవో), కస్టోడియన్‌పై సస్పెన్షన్‌ వేటు వేస్తూ గురువారం రాత్రి ఆలస్యంగా బోర్డు కమిషనర్‌ ఉత్తర్వులు ఇచ్చారని తెలిసింది. ఇదిలావుండగా సీసీ ఫుటేజీలను పరిశీలించగా జవాబు పత్రాల ప్యాకెట్‌ కేంద్రంలోనే పడిపోగా అక్కడ పనిచేసే సిబ్బంది డస్ట్‌బిన్‌(స్ర్కాబ్‌)లో వేస్తున్నట్లు తేలిందని సమాచారం. ఈ విషయమై ఇంతకుముందు ఉన్న ఆర్‌ఐవో వెంకటరెడ్డిని వివరణ కోరగా ఈ వ్యవహారంలో ముగ్గురిని సస్పెండ్‌ చేశారని చెప్పారు. విద్యార్థులందరికీ న్యాయం జరుగుతుందన్నారు.

Updated Date - 2022-06-25T07:07:45+05:30 IST