నేపాల్‌లో సుస్థిరత?

ABN , First Publish Date - 2021-07-14T06:00:02+05:30 IST

నేపాల్‌ రాజకీయ సంక్షోభం ఒక కొలిక్కివచ్చినట్టే కనిపిస్తున్నది. నేపాలీ కాంగ్రెస్‌ అధినేత షేర్‌ బహదూర్‌ దేవ్‌బా మంగళవారం ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు....

నేపాల్‌లో సుస్థిరత?

నేపాల్‌ రాజకీయ సంక్షోభం ఒక కొలిక్కివచ్చినట్టే కనిపిస్తున్నది. నేపాలీ కాంగ్రెస్‌ అధినేత షేర్‌ బహదూర్‌ దేవ్‌బా మంగళవారం ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు. ఇరవైనాలుగు గంటల్లోగా ఆయనకు బాధ్యతలు అప్పగించాల్సిందేనని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించిన విషయం తెలిసిందే. దేశాధ్యక్షురాలు విద్యాదేవి భండారీ, మాజీ ప్రధాని కె.పి.సింగ్‌ ఓలి ఇద్దరూ అవమానపడాల్సిన తీర్పు ఇది. పార్లమెంటు దిగువసభను కూడబలుక్కొని రద్దుచేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. దేవ్‌బాను ప్రధానిగా ప్రకటించి, సభను పునరుద్ధరించడమే కాక, ఈనెల 18న సభను నిర్వహించాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది. తనకు తగినంత సంఖ్యాబలం లేకున్నా, విపక్షాలకు అధికారం ఇవ్వకుండా ఎన్నికలకు పోవాలన్న ఓలి కుట్ర ఈ తీర్పుతో నెరవేరకుండా పోయింది.


ముప్పైరోజుల్లోగా దేవ్‌బా తన బలాన్ని నిరూపించుకోగలరా? అన్న అనుమానాలు అటుంచితే, దిగువసభ రద్దు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేయడం ఆర్నెల్లలో ఇది రెండోసారి. గత ఏడాది డిసెంబరు 20న ఓలి ఇలాగే దిగువసభను రద్దుచేస్తే ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు పునరుద్ధరించింది. మళ్ళీ ఈ ఏడాది మే 21న ఓలీ సూచన మేరకు దేశాధ్యక్షురాలు అదేపని చేయడంతో ఐదుగురు సభ్యుల ధర్మాసనం తప్పుబట్టింది. ప్రభుత్వ ఏర్పాటుకు దేవ్‌బాను కాదనడం, ఓలీకి మాత్రం బలనిరూపణ అవకాశం ఇవ్వడం రాజ్యాంగ వ్యతిరేకమని న్యాయస్థానం ప్రకటించడం దేశాధ్యక్షురాలికి అవమానకరమే. దిగువసభ రద్దు సహా ఈ మొత్తం ప్రక్రియను సుప్రీంకోర్టు తప్పుబడుతుందన్నది ఊహించినదే. తన సంఖ్యాబలం ఇదీ అంటూ 149మంది సంతకాలు చేసిన జాబితాను దేవ్‌బా సమర్పిస్తే, ఇలా వ్యక్తిగత సంతకాలు కాక, ఆయా పార్టీ అధినేతలు సంతకాలు చేసిన పత్రాల ఆధారంగా తనకు 153మంది మద్దతు ఉన్నదని ఓలీ చెప్పుకున్నారు. కానీ, అప్పటికే అధికారపక్షంలోనూ, ఒక విపక్షపార్టీలోనూ సభ్యులు చీలిపోయి ఉన్నందున ఓలీ బలంలో నిజాయితీ లేదన్నది వాస్తవం. కానీ, అధ్యక్షురాలు ఆయన బలాన్ని మాత్రమే పరీక్షించి, దేవ్‌బాను కాదని సభను రద్దుచేసేశారు. ఓలీని తాత్కాలిక ప్రధానిగా కొనసాగించడం ద్వారా ఆయనకు ఎన్నికల్లో లబ్ధి చేకూర్చాలన్నది అధ్యక్షురాలి ఆలోచన. దానికి సుప్రీంకోర్టు ఇప్పుడు అడ్డుకొట్టింది. అధికార కమ్యూనిస్టుపార్టీలో ఓలీ, పుష్పకుమార్‌ దహల్‌ మధ్య రేగిన నిప్పు ఈ సంక్షోభానికి మూలం. అధికారాన్ని సమం గా పంచుకుందామన్న ఆశయం తో ఇద్దరూ తమ పార్టీలను ఒక్కటి చేసినప్పటికీ, ఓలీ అధికార దాహం ముందు ప్రచండ నిలవలేకపోయారు. క్రమంగా పార్టీపైనా, ప్రభుత్వంపైనా ఓలీ పెత్తనం పెరిగి ప్రచండకు అవమానాలు మిగిలాయి. తనను గద్దెదింపడానికి ప్రచండ వర్గం యత్నించినప్పుడల్లా ఓలీ ఏవో ఎత్తులువేస్తూనే ఉన్నారు. చివరకు ఇద్దరూ చీలిపోయి యుద్ధాలు చేసుకోవడం ఆరంభించారు. 


నేపాల్‌లో సుదీర్ఘకాలంగా సాగుతున్న రాజకీయ సంక్షోభం పరిష్కారానికి సుప్రీంకోర్టు తీర్పు ఉపకరించవచ్చు. నేపాలీ కాంగ్రెస్‌ అధినేత దేవ్‌బాకు ప్రచండ వర్గంతో పాటు, అధికార సీపీఎన్‌–యుఎంఎల్‌లోని ఓలీ వ్యతిరేకవర్గం కూడా మద్దతు పలుకుతోంది. ప్రధాని ఎన్నికలో పార్టీ విప్‌ను పాటించాల్సిన అవసరం లేదంటూ సుప్రీంకోర్టు తన తీర్పులో చెప్పింది. వ్యక్తిగతస్థాయిలో, ఆత్మప్రబోధం మేరకు ఓటువేయండని అది ఇచ్చిన ఈ వెసులుబాటును ఎంతమంది సభ్యులు వాడుకుంటారో చూడాలి. పార్టీ విప్‌ ధిక్కరించవచ్చునని సర్వోన్నతన్యాయస్థానం చెప్పినంత మాత్రాన సభ్యులు పెద్దసంఖ్యలో దేవ్‌బాను నిలబెడతారని అనుకోలేం. అలాగే, అధికారపక్షంలోని మాధవ్‌ నేపాల్‌ వర్గం వంటివి 149మంది మద్దతుదారుల జాబితాలో ఉన్నప్పటికీ, ఓటింగ్‌ సమయానికి ఓలీతో రాజీపడే అవకాశాలూ ఉన్నాయి. అదే జరిగితే దేవ్‌బా ఓడిపోవడమూ, ఏడాది చివరికల్లా ఎన్నికలు జరుపుకోవడం తప్పదు. దాదాపు ఏడాదిగా సాగుతున్న రాజకీయసంక్షోభాన్ని సత్వరమే అంతం చేయాలన్న సంకల్పం అన్ని పక్షాల్లోనూ ఉంటే తప్ప సమస్య పరిష్కారం కాదు. దశాబ్దాల హింస తరువాత ప్రజాస్వామ్యంవైపు నడిచిన నేపాల్‌ సుదీర్ఘకాలంగా రాజకీయ అస్థిరతలో కూరుకుపోవడం బాధాకరం.

Updated Date - 2021-07-14T06:00:02+05:30 IST