తూప్రాన్‌ ఆసుపత్రికి సుస్తీ!

ABN , First Publish Date - 2022-08-11T06:12:19+05:30 IST

‘‘వైద్యో నారాయణ హరి అన్నారు పెద్దలు’’. అంటే వైద్యం చేసే డాక్టరు దేవుడితో సమానమని అర్థం.

తూప్రాన్‌ ఆసుపత్రికి సుస్తీ!
తూప్రాన్‌ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌

ఖాళీగా వైద్య, సిబ్బంది పోస్టులు 

అందుబాటులో లేని వైద్య పరికరాలు

పరికరాల ఏర్పాటుకు ఆరు నెలలుగా మూలుగుతున్న నిధులు

టెండర్లను పిలవని ‘టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ’ అధికారులు

అత్యవసర వైద్యసేవలకు  హైదరాబాద్‌ వెళ్తున్న రోగులు


 ఆంధ్రజ్యోతిప్రతినిధి,మెదక్‌,ఆగస్టు10: ‘‘వైద్యో నారాయణ హరి అన్నారు పెద్దలు’’. అంటే వైద్యం చేసే డాక్టరు దేవుడితో సమానమని అర్థం. అలాంటి వారు ఉండే ఆసుపత్రులు ఆలయాల్లా ఉండాలి. కానీ వైద్య    విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న తూప్రాన్‌ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ మాత్రం సమస్యలకు కేరాఫ్‌ అడ్ర్‌సగా నిలుస్తుంది. సీఎం కేసీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గ పరిధిలోని ప్రధాన ఆసుపత్రి పరిస్థితే ఈ విధంగా ఉంటే ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఎలా ఉంటాయే అర్థం చేసుకోవచ్చు!! కొత్త జిల్లాలు ఏర్పడిన తరువాత తూప్రాన్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిని పెంచి కమ్యూనిటీ ఆసుపత్రిగా మార్చారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఆధునిక హంగులతో కొత్త భవనం కట్టారు. అంత వరకు బాగానే ఉంది. కానీ ఆసుపత్రికి వచ్చే రోగులకు మాత్రం సరైన వైద్య సేవలు అందడం లేదు. జబ్బు ఎలాంటిదైనా అందుబాటులో ఉన్న వైద్యులతోనే మమ అనిపిస్తున్నారు. ఇక్కడ నిపుణులు లేరు..పని చేస్తున్న వారిలో మెజార్టీ డాక్టర్లు డిప్యూటేషన్‌, కాంట్రాక్టు పద్ధతిలో వచ్చిన వారే. 


నాలుగున్నరేళ్లుగా మారని పరిస్థితి

మామ సీఎం, అల్లుడు ఆరోగ్యశాఖ మంత్రి అయినా తూప్రాన్‌ ఆసుపత్రి పరిస్థితి ఏ మాత్రం మారడం లేదు. గజ్వేల్‌ నియోజకవర్గంలో ఉన్న తూప్రాన్‌ పట్టణం మెదక్‌ జిల్లా పరిధిలోకి వస్తుంది. కేసీఆర్‌ సీఎం అయిన తర్వాత తూప్రాన్‌ పీహెచ్‌సీని 50 పడకల కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌గా మార్చారు. ఇందుకోసం రూ.11 కోట్లు మంజూరు చేశారు. 2016 ఏప్రిల్‌ 7న మంత్రి హరీశ్‌రావు ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.9.40 కోట్లతో నిర్మాణం పూర్తి చేశారు. మిగతా నిధులతో ఆసుపత్రిలో అవసరమైన వివిధ పరికరాలను ఏర్పాటు చేశారు. 2018 జనవరి 17 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. తూప్రాన్‌ ఆసుపత్రిలో పూర్తిస్థాయి వైద్యుల కన్నా, కాంట్రాక్టు, డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న వైద్యులే ఎక్కువగా ఉన్నారు. 


 రెగ్యులర్‌ డాక్టర్లు నలుగురే

తూప్రాన్‌ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు 2019 డిసెంబర్‌లో ప్రత్యేక జీవో ద్వారా సీఎం కేసీఆర్‌ 52 పోస్టులను మంజూరు చేశారు. ఇందులో 23 మంది డాక్టర్లు, మిగిలిన వారు సిబ్బంది. అయితే నలుగురు డాక్టర్లు, ఏడుగురు సిబ్బందిని రెగ్యులర్‌ పద్ధతిలో నియమించారు. మిగిలిన వారిలో 12 మంది కాంట్రాక్టు డాక్టర్లు, మరో నలుగురు డిప్యూటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ కూడా డిప్యూటేషన్‌పైనే పని చేస్తున్నారు. రెగ్యులర్‌ వైద్యుల్లో ఒక గైనకాలజిస్టు, ఒకరు డెంటిస్టు, ఇద్దరు అనస్తీషియన్లు. ఇద్దరు గైనిక్‌,  పీడీయాట్రిషియన్లు, ఒకరు అనస్త్తీషియా, మరొకరు జనరల్‌ సర్జన్‌ కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్నారు. ఒక ఈఎన్‌టీ వైద్యుడు డిప్యూటేషన్‌పై పని చేస్తున్నారు. 


సౌకర్యాల జాడే లేదు

తూప్రాన్‌ ఆసుపత్రి స్థాయి పెంచినా తర్వాత రోగుల తాకిడి బాగా పెరిగింది. ప్రతి రోజు 300 మంది ఔట్‌ పేషెంట్లు, 50 మంది ఇన్‌ పేషెంట్లు వస్తారు. ఇలాంటి ఆసుపత్రిలో సౌకర్యాల జాడే లేదు. దంతాలకు చికిత్స చేయడానికి డెంటల్‌ చైర్‌ లేకపోవడంతో డెంటిస్ట్‌ కేవలం సాధారణ పరీక్షలకే పరిమితమయ్యారు. రూ.లక్ష వేతనంతో ఆర్థోపెడిక్‌ వైద్యున్ని నియమించారు. కానీ ఆర్థో ఆపరేషన్లు చేయడానికి అవసరమైన సీఆర్మ్‌ యంత్రం అందుబాటులో లేకపోవడంతో ఆర్థో డాక్టర్‌ను వద్దని చెప్పారు.  ఆసుపత్రిలో రేడియాలజిస్టు లేరు. ఆల్ర్టాసౌండ్‌ యంత్రం, ఈఎన్‌టీ పరీక్షలు నిర్వహించేందుకు పరికరాలు లేవు. కానీ కంటి, ముక్కు, చెవి, గొంతుకు సంబంధించిన వైద్యులు మాత్రం ఉన్నారు. తూప్రాన్‌ ఆసుపత్రి 50 పడకల ఆసుపత్రిగా మారి నాలుగున్నరేళ్లు దాటింది. కానీ అంబులెన్స్‌, ఫ్రీజర్‌ బాక్స్‌, నవజాత శిశువుల కోసం మరొక బేబీ వార్మర్‌ తదితర సౌకర్యాలను ఇప్పటి వరకు కల్పించలేదు. 


నిధులుండి ఏ లాభం

తూప్రాన్‌ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో 6 నెలల క్రితం ఫ్రీజర్‌ బాక్స్‌, డెంటల్‌ ఛైర్‌, డిజిటల్‌ ఎక్స్‌రే యంత్రాలతో బ్లడ్‌ స్టోరేజీ సెంటర్‌ కోసం ప్రభుత్వం రూ.96 లక్షలు మంజూరు చేసింది. టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ ద్వారా ఈ సౌకర్యాలు కల్పించాలి. కానీ 6 నెలలుగా నిధులు మూలుగుతున్నా టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ అధికారులు టెండర్లు పిలవడం లేదు. బ్లడ్‌ స్టోరేజీ సెంటర్‌ మంజూరు చేసినా దీంతో సమస్యలు పరిష్కారం కావడం లేదు. డయాలసిస్‌ కేంద్రం మంజూరు కోసం ప్రభుత్వానికి ఆసుపత్రి వైద్యాధికారులు పంపించారు. కానీ అవసరమైన భవనం లేకపోవడంతో దానిని మంజూరు చేయలేదు. తూప్రాన్‌ ఆసుపత్రి జాతీయ రహదారిపై ఉండటంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని కేంద్రం నిధులతో ట్రామాకేర్‌ సెంటర్‌ మంజూరైంది. సెంటర్‌ ఏర్పాటు కోసం టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ వారికి ఆసుపత్రిలో ఒక వార్డును చూపించారు. కానీ ఇంతరవకు ట్రామాకేర్‌ సెంటర్‌ ప్రారంభం కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం బ్లడ్‌ స్టోరేజీని మంజూరు చేసినా, టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ అధికారులు టెండర్లు పిలవకపోవడం వల్ల అది కూడా ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో అత్యవసర పరిస్థితులలో రక్తం దొరక్క హైదరాబాద్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. 


ప్రతిపాదనలు పంపాం 

- అమర్‌ సింగ్‌, సూపరింటెండెంట్‌, కమ్యూనిటీ హాస్పిటల్‌, తూప్రాన్‌. 

తూప్రాన్‌ కమ్యూనిటీ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలకు వైద్యులు, సిబ్బందిని రెగ్యులర్‌ పద్ధతిలో నియమంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. పూర్తిస్థాయిలో వైద్యులు, సిబ్బంది వస్తే మరిన్ని సేవలు అందించవచ్చు. వివిధ పరికరాలు, యంత్రాలు, బ్లడ్‌ స్టోరేజీ, ట్రామాకేర్‌ సెంటర్‌ ఏర్పాటుపై కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. 

Updated Date - 2022-08-11T06:12:19+05:30 IST