‘పరీక్షకు పోకున్నా పాస్!’ అనే శీర్షికతో ఏయూ దూర విద్య పరీక్షల్లో అక్రమాలపై ఈ నెల 16న ‘ఆంధ్రజ్యోతి’లో ఒక విపుల వార్త వెలువడింది. ఈ వార్తలో ప్రస్తావించిన ఆరు అనుబంధ కళాశాలల్లో గత ఐదు సంవత్సరాలలో దూర విద్యా పరీక్షల్లో ఉత్తీర్ణులయిన విద్యార్థుల శాతమెంతో అధికారులు తెలుసుకోవాలి. కృష్ణా జిల్లా కలిదిండిలోని సుగుణా డిగ్రీ కళాశాలలో దూర విద్య పరీక్షలు రాసిన వారి ఫలితాలను ఏయూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విభాగం డైరెక్టర్ నిలిపివేశారు. సమాధాన పత్రాలన్నీ ఒకే చేతి రాతలో ఉన్నందున ఫలితాలను ప్రకటించలేదు. అయితే రాజకీయవర్గాల, విశ్వవిద్యాలయ ఉన్నత స్థాయి అధికారుల నుంచి ఒత్తిడి మూలంగా ఫలితాలను విడుదల చేశారు. వాస్తవానికి ఆ పరీక్షా కేంద్రాన్ని రద్దు చేసి, ప్రముఖ కళాశాలల్లో ఆ పరీక్షలు నిర్వహించడం అనేది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ బాధ్యత. అయితే ఆయన తన విధి నిర్వహణను సక్రమంగా నిర్వర్తించలేదు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం దూర విద్యా పరీక్షలను నిర్వహిస్తున్న పద్ధతిని ఆదర్శంగా తీసుకుంటే బాగుంటుంది. ఆ విశ్వవిద్యాలయం కేవలం చిత్తూరు జిల్లాలో మాత్రమే ఆ పరీక్షలను నిర్వహిస్తుంది. ఆ జిల్లాకు వెలుపల ఎక్కడా ఆ పరీక్షలను నిర్వహించదు. అదే విధంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా కేవలం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో మాత్రమే దూర విద్య పరీక్షలు నిర్వహించడం సబబుగా ఉండగలదు.
ప్రొఫెసర్ రామ్ నాయుడు (రిటైర్డ్ డైరెక్టర్)
డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఆంధ్ర విశ్వవిద్యాలయం