స్వచ్ఛ సర్వేక్షణ్‌పై మహా ఉత్కంఠ

ABN , First Publish Date - 2022-09-28T06:44:45+05:30 IST

స్వచ్ఛ సర్వేక్షణ్‌-2022 ఫలితాలపై మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) అధికారుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పారిశుధ్య నిర్వహణ గాడి తప్పడంతో ఈ ఏడాది ర్యాంకింగ్‌లో నగరం వెనుకబడుతుందేమోననే ఆందోళన కొంతమంది అధికారుల్లో వ్యక్తమవుతోంది.

స్వచ్ఛ సర్వేక్షణ్‌పై మహా ఉత్కంఠ

గత ఏడాది 9వ స్థానం

ఈసారి అంతకంటే మెరుగైన ర్యాంకు లభించేనా?

అధికారుల్లో అనుమానం

ఒకటో తేదీన ప్రకటించనున్న రాష్ట్రపతి

రేపు ఢిల్లీ బయలుదేరుతున్న అధికారులు


విశాఖపట్నం, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి):

స్వచ్ఛ సర్వేక్షణ్‌-2022 ఫలితాలపై మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) అధికారుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పారిశుధ్య నిర్వహణ గాడి తప్పడంతో ఈ ఏడాది ర్యాంకింగ్‌లో నగరం వెనుకబడుతుందేమోననే ఆందోళన కొంతమంది అధికారుల్లో వ్యక్తమవుతోంది. అక్టోబరు ఒకటిన ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వచ్ఛ సర్వేక్షణ్‌-2022 ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని జీవీఎంసీ మేయర్‌, కమిషనర్‌తోపాటు అదనపు కమిషనర్‌, ప్రధాన వైద్యాధికారికి ఆహ్వానం అందింది. అదనపు కమిషనర్‌, ప్రధాన వైద్యాధికారి గురువారం ఢిల్లీ వెళుతుండగా, మేయర్‌, కమిషనర్‌ ఒకటో తేదీ ఉదయం వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీని కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఐదు లక్షలలోపు, ఐదు లక్షల నుంచి పది లక్షలు, పది లక్షలకు పైబడి జనాభా కలిగిన నగరాలు (మూడు కేటగిరీలు)గా విభజించి ఏటా పోటీ నిర్వహిస్తోంది. ఆయా నగరాల్లో చెత్త సేకరణ, పారిశుధ్య నిర్వహణ శాస్ర్తీయ పద్ధతి చేపట్టడం, పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించడం, పౌర సేవల్లో ప్రజలను భాగస్వామ్యులను చేయడం వంటి అంశాలను కేంద్ర బృందం ఏటా జనవరి లేదా ఫిబ్రవరి మాసాల్లో ప్రత్యక్షంగా పరిశీలిస్తుంది. తమ సర్వేలో గుర్తించిన అంశాలను కేంద్ర ప్రభుత్వానికి నివేదించిన తర్వాత అక్కడి అధికారులు అన్ని నగరాలకు సంబంధించిన పరిస్థితులు, పనితీరును విశ్లేషించి ర్యాంకులు కేటాయిస్తారు. 

జీవీఎంసీకి పది లక్షలు పైబడి జనాభా కలిగిన నగరాల కేటగిరీలో 2015లో 237 ర్యాంకు దక్కగా, 2016లో ఐదు, 2017లో మూడు, 2018లో ఏడు, 2019లో 23, 2020, 2021ల్లో తొమ్మిదో ర్యాంకు లభించింది. అయితే గత ఏడాదికాలంగా నగరంలో పారిశుధ్య నిర్వహణ గాడి తప్పిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. క్లాప్‌ వాహనాలను ప్రవేశపెట్టినా చెత్త సేకరణ సరిగా జరగకపోవడంతో ప్రజలు తమ ఇళ్లలోని చెత్తను రోడ్లపైకి తెచ్చి పడేస్తున్నారు. దీంతో డంపర్‌బిన్‌ల వద్ద చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయి. ఒకానొక దశలో పారిశుధ్య నిర్వహణ తీరుపై జీవీఎంసీ ప్రజల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలను ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రత్యేక దృష్టిసారించడంతో పరిస్థితి కొంత మెరుగుపడింది. ఇలాంటి పరిస్థితిలోనే కేంద్ర బృందం నగరాన్ని సందర్శించడం, ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించడంతో స్వచ్ఛ సర్వేక్షణ్‌-2022లో ఈసారి జీవీఎంసీకి ఏ ర్యాంకు వస్తుందోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. 


‘స్వచ్ఛత లీగ్‌’లో జీవీఎంసీకి అవార్డు

విశాఖపట్నం, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): జీవీఎంసీకి జాతీయస్థాయి అవార్డు లభించింది. స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ ఈ నెల 17న ‘ఇండియన్‌ స్వచ్ఛత లీగ్‌’ పేరుతో పరిశుభ్రతకు సంబంధించి కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ పోటీలో భాగంగా జీవీఎంసీ నగరంలోని యువత, పోలీస్‌, నేవీ, ఎన్‌జీవోలు, రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్లకు చెందిన ఏడు వేల మంది వలంటీర్లతో  యారాడ, వైఎస్‌ఆర్‌ సెంట్రల్‌ పార్క్‌, కైలాసగిరి, భీమిలి ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ కార్యక్రమాలు చేపట్టింది. దీన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పది లక్షలకు పైబడిన జనాభా కలిగిన నగరాల కేటగిరీలో ‘టాప్‌ ఇంపాక్ట్‌ క్రియేటర్‌’ కింద జీవీఎంసీకి అవార్డు ప్రకటించింది. రాష్ట్రంలో విశాఖకు మాత్రమే ఈ ఘనత దక్కడం పట్ల కమిషనర్‌ రాజాబాబు ఒక ప్రకటనలో సంతోషం వ్యక్తంచేశారు. ఈనెల 30న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో అవార్డును అందుకునేందుకు తాను, మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి, అదనపు కమిషనర్‌ డాక్టర్‌ వి.సన్యాసిరావు, ప్రధాన వైద్యాధికారి డాక్టర్‌ కేఎస్‌ఎల్‌జీ శాస్త్రి వెళుతున్నట్టు కమిషనర్‌ తెలిపారు.

Updated Date - 2022-09-28T06:44:45+05:30 IST