స్వచ్ఛతలో వెనుకబాటు!

ABN , First Publish Date - 2021-11-22T05:51:48+05:30 IST

పొరుగున ఉన్న విజయవాడ నగరం స్వచ్ఛ సర్వేక్షణ్‌-2021లో దేశంలోనే మూడో ర్యాంకు సాధించగా మన జిల్లాలోని పట్టణ ప్రాంతాలు కనీసం 100 లోపు ర్యాంకుని కూడా సాధించలేకపోయాయి.

స్వచ్ఛతలో వెనుకబాటు!

తెనాలికి 116, గుంటూరు నగరానికి 130వ ర్యాంకు

ప్రేరక్‌ దౌర్‌ సమ్మాన్‌(కాంస్యం)లో సత్తెనపల్లికి నాల్గో ర్యాంకు

గుంటూరు, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): పొరుగున ఉన్న విజయవాడ నగరం స్వచ్ఛ సర్వేక్షణ్‌-2021లో దేశంలోనే మూడో ర్యాంకు సాధించగా మన జిల్లాలోని పట్టణ ప్రాంతాలు కనీసం 100 లోపు ర్యాంకుని కూడా సాధించలేకపోయాయి. తెనాలి మునిసిపాలిటీ 116, గుంటూరు నగరం 130, నరసరావుపేట 148, చిలకలూరిపేట 218 స్థానాల్లో నిలిచాయి. ఒక్క సత్తెనపల్లి మాత్రమే ప్రేక్‌ దౌర్‌ సమ్మాన్‌(కాంస్యం) కేటిగిరీలో నాల్గో ర్యాంకు సాధించి ఫర్వాలేదనిపించింది. ఇక మిగిలిన పట్టణ ప్రాంతాలు కనీస పురోగతిని కూడా చూపించలేకపోయాయి. స్వచ్ఛ సర్వేక్షణ్‌ ప్రారంభమైన 2016, 17లలో 50 లోపు ర్యాంకుల్లో నిలిచి మిగతా పట్టణాలతో పోటీపడినప్పటికీ ఆ తర్వాత పూర్తిగా వెనకబడిపోయాయి. మళ్లీ ఆ స్థాయిలో ర్యాంకులను సాధించలేకపోతున్నాయి.  

కేంద్ర ప్రభుత్వం ఏటా స్వచ్ఛ సర్వేక్షణ్‌ని వివిధ అంశాలపై పట్టణ ప్రాంతాల్లో ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరిస్తోంది. అలానే క్షేత్రస్థాయిలో పరిశుభ్రతని పరిశీలించి ర్యాంకింగ్‌లు ఇస్తోంది. పరిసరాలు, రోడ్లు, కాలువలు, మరుగుదొడ్లు, మూత్రశాలల వినియోగం, ఇంటింటి నుంచి చెత్త సేకరణ, వేర్వేరుగా తడి, పొడి, శానిటరీ వేస్టు సేకరణ వంటి అన్ని అంశాలపై ఏటా సర్వే నిర్వహిస్తుంది. ఈ సర్వే ప్రారంభమైన మొదటి, రెండు సంవత్సరాలు జిల్లాలోని అన్ని పట్టణాలు ఎంతో ప్రాధాన్యాన్ని ఇచ్చాయి. కలెక్టర్‌, మునిసిపల్‌ కమిషనర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవారు. దాంతో పరిశుభ్రత విషయంలో గణనీయమైన పురోగతిని సాధించాయి. అయితే క్రమేపి అధికారులు పట్టించుకోక పోతుండటంతో పరిస్థితి తిరిగి పూర్వస్థితికి చేరుకొంటోంది.  

గతంలో కార్పొరేటర్లు/కౌన్సిలర్లు తమ వార్డుల్లో ఉదయం పర్యటించి ఎక్కడైనా పారిశుద్ధ్యం సక్రమంగా లేకపోయినా, కాలువలు శుభ్రం చేయకపోయినా అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించేవారు. ఆ పరిస్థితి ఏ కొద్ది వార్డుల్లో తప్పితే ఎక్కువ చోట్ల కనిపించడం లేదు. ఈ ఏడాది మార్చి నెల వరకు పట్టణ ప్రాంతాల్లో పాలకవర్గాలు లేవు. ఎన్నికలు జరిగి కొత్త పాలకవర్గాలు ఏర్పడిన దృష్ట్యా నగరంలో మేయర్‌, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, మునిసిపాలిటీల్లో ఛైర్మన్‌, వైస్‌ఛైర్మన్‌, కౌన్సిలర్లు అందుబాటులోకి వచ్చారు. దీని దృష్ట్యా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయం చేసుకొని కష్టపడితే కనీసం వచ్చే ఏడాదికైనా ర్యాంకింగ్‌ పెరిగే అవకాశం ఉంటుంది. లేకుంటే ర్యాంకులు మరింత దిగజారిపోతాయి. 

Updated Date - 2021-11-22T05:51:48+05:30 IST