Advertisement

మట్టి.. స్వాహా

Feb 27 2021 @ 00:00AM
శేకూరు క్వారీ వద్ద గ్రావెల్‌ కోసం వేచివున్న లారీలు

చేబ్రోలు మండలంలో ఎర్రమట్టి స్వాహా

కొద్దిపాటి అనుమతులతో మొత్తం తవ్వేస్తున్నారు...

ప్రభుత్వ పెద్దల కన్నుసన్నల్లోనే తవ్వకాలు

రైల్వే పనుల కోసం అంటూ నిరంతరం మైనింగ్‌

అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్న ఎర్ర బంగారం

గ్రావెల్‌ లారీల  అక్రమ రవాణాపై విద్యార్థుల ఆగ్రహం

పోలీసుల రంగ ప్రవేశంతో రాస్తారోకో విరమణ

  

చేబ్రోలు ప్రాంతంలో ఎర్రమట్టి అక్రమార్కులకు సిరులు కురిపిస్తోంది... సహజ వనరు యథేచ్ఛగా రవాణా అవుతోంది. నిన్నమొన్నటి వరకు నిరుపేదల నివేశన స్థలాల అభివృద్ధి పేరుతో మైనింగ్‌ సాగితే నేడు రైల్వే లైన్‌ పేరుతో భూమిని తొలిచి వేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో ఈ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఎర్రమట్టి క్వారీలు మృత్యులోయలుగా మారుతున్నాయి. ఈ గుంతల్లో పడి పలువురు మృత్యువు పాలైన ఘటనలు ఉన్నాయి. ఇదిలా ఉంటే మట్టి తరలించే లారీలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. తాజాగా శుక్రవారం చేబ్రోలు మండలంలోని శేకూరులో లారీల అతివేగం కారణంగా విద్యార్థులు గాయాలపాలయ్యారు. దీంతో శనివారం విద్యార్థులు రోడ్డెక్కారు. తమ గ్రామంలోంచి లారీలు తిరగనివ్వబోం.. అంటూ ఆందోళన చేపట్టారు. 

  

చేబ్రోలు, ఫిబ్రవరి27: సహజ వనరైన ఎర్ర మట్టి క్వారీలకు చేబ్రోలు మండలం నిలయం. ఇక్కడ లభించే ఎర్రమట్టి (గ్రావెల్‌కు) అత్యధిక డిమాండ్‌ ఉంది. ఈ డిమాండ్‌ను గుర్తించిన అక్రమార్కులు మైనింగ్‌తో కాసులు దండుకుంటున్నారు.  ప్రభుత్వ పెద్దల కన్నుసన్ననలోనే మైనింగ్‌ జరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. అధికార యంత్రాంగం కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అక్రమాలకు  వంత పాడుతోందనే విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో రైల్వే పనుల కోసం లక్షలాది క్యూబిక్‌ మీటర్ల ఎర్ర మట్టి అవసరమైంది. రైల్వే లైన్‌ పనులకు ఎర్రమట్టిని సరఫరా చేసేందుకు ప్రభుత్వ పెద్దలు, ప్రజా ప్రతినిధులు నేరుగా రంగంలోకి దిగారు. బినామీల పేరుతో చేబ్రోలు మండలంలోని పలు గ్రామాల్లో  మైనింగ్‌కు అనుమతులు సాధించారు. అనుమతులు పొందింది కొద్దిపాటి భూమికే అయినా పదుల సంఖ్యల ఎకరాల్లో మైనింగ్‌ సాగుతుందని ఆరోపణలు ఉన్నాయి. నిన్నమొన్నటి వరకు నిరుపేదల నివేశన స్థలాల అభివృద్ధి పేరుతో మైనింగ్‌ సాగితే నేడు రైల్వే లైన్‌ పేరుతో భూమిని తొలిచి వేస్తున్నారు.


వందలాది మీటర్ల లోతుకు..

 పది మీటర్ల మేర భూమిలో మైనింగ్‌ చేయాల్సివుండగా వందలాది మీటర్ల లోతులో మట్టి కోసం మైనింగ్‌ సాగుతుండటంతో శేకూరు, వీరనాయకునిపాలెం, సుద్దపల్లి, వడ్లమూడి తదితర గ్రామాలు లోయలను తలపిస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘించి రాత్రి, పగలు మైనింగ్‌ సాగుతోంది. వడ్లమూడి జెడ్పీ భూములో రాత్రి వేళ్ల గ్రావెల్‌ కోసం బ్లాస్టింగ్‌ చేస్తున్నారు. ప్రధాన రహదారి సమీపంలోని భూముల్లో, రైల్వే లైన్‌ సమీపంలో ఉన్న భూములో క్వారీయింగ్‌ చేయకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ అవేమీ అమలుకావడం లేదు. 


నిషేధిత గ్రామాల్లోనూ..

చేబ్రోలు మండలంలో ఎర్ర మట్టి క్వారీలు స్థానిక ప్రజలకు ప్రాణసంకటంగా మారాయి. ఎర్ర మట్టి కోసం వందలాది అడుగులు మైనింగ్‌ చేయటంతో ఆ ప్రాంతం అంతా ఇప్పుడు లోయలను తలపిస్తోంది. పలువురులు కార్వీల నిర్వాహకులు అత్యాసతో కార్వీ భూముల్లో చేపల చెరువులు సాగుచేస్తున్నారు. 2011 సంవత్సరంలో సుద్దపల్లి, వేజండ్ల తదితర గ్రామాలో క్వారీ గుంతలో ఉన్న నీటిలోకి చిన్నారులు ఈతకు దిగి ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో గ్రామస్తుల నిరసనలతో కదిలిన జిల్లా యంత్రాంగం స్పందించి ఈ గ్రామాల్లో మైనింగ్‌ను నిషేదించాయి.  ప్రస్తుతం ఈ గ్రామాల్లో కూడా మైనింగ్‌ కోసం అధికార నేతలు దరఖాస్తు చేసి అనుమతి పొందారు. నిషేధిక గ్రామాల్లో సైతం మైనింగ్‌ సాగటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.  

 


 
శేకూరు గ్రావెల్‌ క్వారీ

మా ఊరిలోకి రావొద్దు..

 చేబ్రోలు మండలం శేకూరు గ్రామంలో ఎర్రమట్టి రవాణాను శనివారం విద్యార్థులు అడ్డుకున్నారు. మండలంలోని శేకూరు, వీరనాయకునిపాలెం, సుద్దపల్లి తదితర గ్రామాల్లో ఎర్ర మట్టిని నిత్యం 200లకు పైగా లారీలు జిల్లా నలుమూలలకు రవాణా చేస్తుంటాయి. ఈ మట్టిని తీసుకువెళ్లే లారీలు మితిమీరిన వేగం, అధిక లోడుతో శేకూరు గ్రామ వీధుల గుండా ప్రయాణిస్తుంటాయి. ఇది గ్రామస్తులకు,  విద్యార్థులకులకు ప్రాణసంకటంగా మారింది. శేకూరు సమీప గ్రామాలో నాలుగు పైగా క్వారీలు నిర్వహిస్తున్నారు. ఇటీవల అధికార పార్టీకి చెందిన నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటైన క్వారీ నుంచి నిత్యం 50 టన్నుల రవాణా సామర్ధ్యం కలిగిన వందలాది లారీలు శేకూరు మీదుగా ఎర్ర మట్టి రవాణాను చేస్తున్నాయి. ఈ లారీల వేగానికి లేచిన దుమ్ముతో గ్రామ వీధులతోపాటు, గ్రామంలోని నివాస గృహాలు, చెట్లు ప్రభుత్వ కార్యాలయాలు సైతం ఎర్రబారిపోయాయి. మితిమీరిన వేగంతో వచ్చే లారీల కారణంగా శుక్రవారం పలువురు గ్రామస్తులతోపాటు, ముగ్గురు విద్యార్థులు ప్రమాదానికి గురై గాయాలపాలైనట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో శేకూరు జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ విద్యార్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వందలాది మంది శనివారం ఉదయం ఒక్కసారిగా పాఠశాల  ప్రాంగణాన్ని వదిలి రోడ్డుపైకి చేరారు.  తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న గ్రావెల్‌ లారీల రవాణాను నిషేదించాలని రాస్తారోకోకు దిగారు. రాస్తారోకో చేయటంతో గ్రామంలో వందలాది గ్రావెల్‌ లారీలు నిలిచిపోయాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. విద్యార్థులతో మాట్లాడి ఆందోళళ విరమింపజేశారు. కాగా పోలీసులు వారిని భయభ్రాంతులకు గురిచేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. 


 

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.