Gyanvapi : శివలింగానికి పూజ చేస్తానన్న స్వామి అవిముక్తేశ్వరానంద... అడ్డుకున్న పోలీసులు...

ABN , First Publish Date - 2022-06-04T17:40:41+05:30 IST

ఉత్తర ప్రదేశ్‌లోని జ్ఞానవాపి కాంప్లెక్స్‌లో శివలింగం ఉన్నట్లు

Gyanvapi : శివలింగానికి పూజ చేస్తానన్న స్వామి అవిముక్తేశ్వరానంద... అడ్డుకున్న పోలీసులు...

వారణాసి : ఉత్తర ప్రదేశ్‌లోని జ్ఞానవాపి కాంప్లెక్స్‌లో శివలింగం ఉన్నట్లు ఇటీవల సర్వేలో బయటపడటంతో, ఆ శివలింగానికి పూజలు చేసేందుకు బయల్దేరిన స్వామి అవిముక్తేశ్వరానందను పోలీసులు అడ్డుకున్నారు. ఆయనను శ్రీవిద్య మఠం నుంచి బయటకు రానివ్వలేదు. దీంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జ్ఞానవాపి శివలింగాన్ని అర్చించే వరకు తాను ఏమీ తినబోనని ప్రకటించారు. 


జ్ఞానవాపిలో శివలింగానికి తన శిష్యులతో కలిసి తాను పూజలు చేస్తానని స్వామి అంతకుముందు ప్రకటించారు. దీంతో ఆయనను తన మఠం నుంచి బయటకు వెళ్ళకుండా పోలీసులు అడ్డుకున్నారు.


 ‘‘జ్ఞానవాపిలో శివలింగాన్ని అర్చించేందుకు నాకు అనుమతి ఇచ్చే వరకు నేను ఏమీ తినను’’ అని స్వామి అవిముక్తేశ్వరానంద తెలిపారు. ఆయన స్వామి స్వరూపానంద సరస్వతి శిష్యులు. స్వామి స్వరూపానంద గుజరాత్‌లోని ద్వారక శారదా పీఠం, బదరీనాథ్‌లోని జ్యోతిర్మఠం శంకరాచార్య. 


జ్ఞానవాపి మసీదులో సర్వే పూర్తయిన నేపథ్యంలో ఈ కేసుపై విచారణ వారణాసి కోర్టులో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సర్వేలో మసీదులో శివలింగం ఉన్నట్లు వెల్లడైందని హిందువులు వాదిస్తున్నారు. అది ఫౌంటెన్ అని ముస్లింలు చెప్తున్నారు. తదుపరి విచారణ వారణాసి జిల్లా కోర్టులో జూలై 4న జరుగుతుంది. 


Updated Date - 2022-06-04T17:40:41+05:30 IST