నాకు భక్తులు లేరు.. అందరూ శ్రోతలే ఉన్నారు

ABN , First Publish Date - 2020-05-19T22:49:16+05:30 IST

ఇటీవలి కాలంలో యువతను ఎక్కువగా ఆకర్షించిన ఆధ్యాత్మికవేత్త.. కాకినాడలోని శ్రీపీఠానికి చెందిన పరిపూర్ణానంద సరస్వతి. ఆధ్యాత్మికతకు సామాజిక కోణాన్ని జోడించి ప్రవచనాలు చెప్పే పరిపూర్ణానంద..

నాకు భక్తులు లేరు.. అందరూ శ్రోతలే ఉన్నారు

నాకు క్రికెట్ అంటే ఇష్టం.. ఇప్పటికీ చూస్తుంటాను

సచిన్‌ మొదట్లో ఎలా ఉన్నాడో ఇప్పుడూ అలాగే ఉన్నాడు

శ్రీపీఠం భూములపై ఆరోపణలను సమర్ధవంతంగా ఎదుర్కొన్నా

నాకు.. నా ఆశ్రమానికి రూపాయి కూడా ఇవ్వద్దు..

జీన్స్ వేసినా కాషాయమే వాడతా.. పంచెలతో ట్రెక్ చేయలేము కదా..

పీఠాధిపతులకు గౌరవం ఇవ్వాల్సిందే

అది ఆ స్థానానికి ఇచ్చే మర్యాద.. వ్యక్తికి కాదు

ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కేలో పరిపూర్ణానంద సరస్వతి


ఇటీవలి కాలంలో యువతను ఎక్కువగా ఆకర్షించిన ఆధ్యాత్మికవేత్త.. కాకినాడలోని శ్రీపీఠానికి చెందిన పరిపూర్ణానంద సరస్వతి. ఆధ్యాత్మికతకు సామాజిక కోణాన్ని జోడించి ప్రవచనాలు చెప్పే పరిపూర్ణానంద.. ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’ కార్యక్రమంలో తన అంతరంగాన్ని ఆవిష్కరించారిలా...02-07-2012న ఏబీఎన్‌లో ప్రసారమయిన ఈ కార్యక్రమ వివరాలు..


ఆర్కే: వెల్‌కం టు ఓపెన్‌హార్ట్‌.. నమస్కారం స్వామీ. స్వాములందు పరిపూర్ణానంద స్వామి వేరంటారు నిజమేనా?

పరిపూర్ణానంద సరస్వతి: అలా ఏమీ లేదు. నేను యువతను, గృహిణుల్ని, పెద్దల్ని, పిల్లల్ని అందరినీ ఉద్దేశించి మాట్లాడుతుంటాను.


ఆర్కే: అంటే ఆధ్యాత్మిక విషయాల్ని, లౌకిక విషయాలు కూడా మాట్లాడతారా?

పరిపూర్ణానంద సరస్వతి: ఆ రెంటికీ పొంతన కుదరదు. కాకపోతే, ఆధ్యాత్మిక విషయాలను ప్రస్తుత సమాజంతో సమన్వయం చేసి చెబుతాను.


ఆర్కే: యువతలో మీకు మాత్రమే ఎందుకు ఆదరణ ఎక్కువ?

పరిపూర్ణానంద సరస్వతి: నేను కావాలని యువత మీద ఎక్కువ దృష్టిసారిస్తున్నాను. ఎందుకంటే.. ఈ రోజు 50, 60 ఏళ్లు వచ్చిన వారిలో చాలామందికి వాళ్లవాళ్ల గురువులున్నారు. ఇంకోవైపు యువత టెక్నాలజీ వైపు అభిముఖులై ఉన్నారు. వాళ్లకి సంస్కృత శ్లోకాలను చెప్పేకన్నా వాటి అర్థాల్ని, దాన్ని ఎలా సమన్వయం చేసుకోవాలో చెప్తే సరిపోతుందని నా ఉద్దేశం.


ఆర్కే: స్వాములందరూ ఒకటే అయినప్పుడు సమాజానికి ఇంతమంది స్వాములు అవసరమా?

పరిపూర్ణానంద సరస్వతి: సమాజానికి ఇన్ని రకాల మీడియా అవసరమా? ఇన్ని చానెళ్లు, పేపర్లు ఉండాలా? ఒక్క మీడియా చాలు కదా?


ఆర్కే: కావాలి, ఎందుకంటే రకరకాల భావజాలాల్ని వ్యాపింపజేయాలి కాబట్టి! మీరందరూ ఒకే భావజాలాన్ని వ్యాపింపజేస్తారు.


ఆర్కే: స్వాములు భక్తులకు ఏ కోర్కెలు నెరవేరుస్తారు?

పరిపూర్ణానంద సరస్వతి: ఆరోగ్యం బాగోలేని వాడు ఒకరిద్దరు డాక్టర్ల దగ్గరకు వెళ్తాడు. అక్కడ నయం కాకపోతే స్వామీజీలను ఆశ్రయిస్తాడు. అటువంటి వర్గాలను నేను హ్యాండిల్‌ చేయలేను. ఆ కోణంలో.. నాకు భక్తులెవరూ లేరు. నాకు అందరూ శ్రోతలే.


ఆర్కే: మీ నేపథ్యం ఏమిటసలు?

పరిపూర్ణానంద సరస్వతి: మా పూర్వీకులంతా పాలఘాట్‌.. అంటే కేరళకు చెందినవారు. అక్కణ్నుంచి వలస వచ్చి నెల్లూరులో స్థిరపడ్డారు. నేను పధ్నాలుగున్నర సంవత్సరాల దాకా అక్కడే ఉన్నాను.


ఆర్కే: మీ సామాజిక నేపథ్యం ఏంటి?

పరిపూర్ణానంద సరస్వతి: ఒక సన్యాసి ఇలాంటివాటికి అతీతంగా ఉండాలి.


ఆర్కే: నెల్లూరు నుంచి శ్రీపీఠంలోకి ఎలా వచ్చారు?

పరిపూర్ణానంద సరస్వతి: మా అమ్మగారికి నేను శాస్త్రాధ్యయనం చేయాలని దృఢమైన సంకల్పం ఉండేది. నాకేమో క్రికెటర్‌ని అవ్వాలని ఉండేది. పధ్నాలుగేళ్ల వయసులో.. అండర్‌ 17కి నన్ను తీసుకెళ్లేవాళ్లు. కానీ, మా అమ్మ నన్ను వేదపాఠశాలలో చేర్చారు. వేదాన్ని ఊరకనే వల్లెవేయ డం కాదు.. దానికి అర్థం చేసుకోవలనే తపనతో రుషీకేశ్‌ చేరాను. పదిహేడేళ్ల వయసులో.. మా గురువుగారైన దయానంద సరస్వతి తో పరిచయమైంది. తర్వాత కోయంబత్తూరులో వారి ఆశ్రమంలో మూడున్నరేళ్లపాటు ఉండి ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు నేర్చుకున్నాను. ఆ కోర్సు అయిన తర్వాత ‘నేను చెప్పింది బోధించడం మొదలుపెట్టు’ అని గురువుగారు సూచించి విశాఖపట్నం పంపారు. అప్పుడు నాకు ఇరవై ఒకటిన్నర సంవత్సరాలు. తర్వాత గోదావరి జిల్లాల్లో పండితుల వద్ద ఇంకా చదువుకోవాలనే కోరికతో అక్కడికి వెళ్తే నన్ను బాగా ఆదరించారు. స్థలమిచ్చారు. ఆశ్రమం అలా వచ్చింది.


ఆర్కే: ఇప్పటికీ క్రికెట్‌ చూస్తుంటారా?

పరిపూర్ణానంద సరస్వతి: అవకాశం దొరికినప్పుడు చూస్తుంటాను.


ఆర్కే: మీకిష్టమైన క్రికెటర్‌?

పరిపూర్ణానంద సరస్వతి: సచిన్‌ టెండూల్కర్‌. అతని నిబద్ధత, లక్ష్యంపై దృష్టిపెట్టడం బాగా నచ్చుతాయి. అతనితోపాటే వచ్చిన కాంబ్లీకి కొద్దిగా పేరు రాగానే డైవర్షన్‌ వచ్చింది. లోపల అణగారిన కోరికలన్నీ బయటపడ్డాయి. అందుకే అతను క్రమంగా క్రికెట్‌ నుంచి నిష్క్రమించాడు. కానీ, సచిన్‌ మొదట్లో ఎలా ఉన్నాడో ఇప్పుడూ అలాగే ఉన్నాడు.


ఆర్కే: హిందూ మతాచార్యులకు ఆర్భాటాలెందుకు ఉండాలి? అది పరోక్షంగా ప్రజలను అన్యమతాలవైపు మళ్లేలా చేస్తోందని ఒక ఆరోపణ. దీనికి మీరేమంటారు?

పరిపూర్ణానంద సరస్వతి: కొన్ని గౌరవాలు స్థానానికి ఇస్తారుగానీ వ్యక్తికి కాదు. మతాచార్యులంటే.. ఆ స్థానానికి ఒక మర్యాద, గౌరవం ఉంది. ఆ లాంఛనం, మర్యాద ఇవ్వడంలో తప్పులేదు.


ఆర్కే: ఇంద్రియాలను జయించడం కష్టమంటారు కదా? మీ విషయంలో మీరెలా నిగ్రహాన్ని పాటించగలుగుతున్నారు?

పరిపూర్ణానంద సరస్వతి: దీనిపై ఆహారప్రభావం చాలా ఉంటుంది. మనం తినే ఆహారం, జపం చేయడం వంటి వాటి తో అదుపు చేసుకోగలిగే అవకాశం ఉంది. శారీరక ధర్మాలను అదుపు చేయడాన్ని.. అంటే అదిమి పెట్టడాన్ని నేను ఒప్పుకోను. దాన్ని అర్థం చేసుకుని, తదనుగుణంగాఎదగాలి. అదొక అద్భుతమైన ప్రక్రియ. దాన్ని నేను అవలంబిస్తాను.


ఆర్కే: శ్రీపీఠం భూములపై ఆరోపణలున్నాయి కదా?

పరిపూర్ణానంద సరస్వతి: అక్కడ ఒక ఎస్సీకి చెందిన పనికిరాని భూమిలో గోశాల పెట్టుకున్నాం. దాని చుట్టూ ఉన్న భూమిలో అతను వ్యవసాయం చేసుకుంటున్నాడు. దీనిపై కొందరు గొడవ చేశారు. దాన్ని నేను సమర్థంగా తిప్పికొట్టాను.


ఆర్కే: సామాజిక చైతన్యానికి మీ భవిష్యత్‌ కార్యాచరణ ఎలా ఉండబోతోంది?

పరిపూర్ణానంద సరస్వతి: నాకు, నా ఆశ్రమానికి రూపాయి కూడా ఇవ్వద్దు. నేను స్వచ్ఛందంగా ప్రతి ఊరూ తిరిగి ప్రబోధం చేస్తా. నాకొచ్చిన డబ్బును ఆ జిల్లాలో మంచి కార్యక్రమాలకే కేటాయిస్తానంటే ప్రజల్లో అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ కార్యక్రమాల్లో భాగంగా విరాట్‌ గోశాల ఏర్పాటు చేసి.. వట్టిపోయిన ఆవుల్ని పోషిస్తాం. అలాగే, మా గురువుగారు ‘ఎయిమ్‌ ఫర్‌ సేవ’ అని దేశవ్యాప్తంగా హాస్టళ్లు పెట్టాలని 576 జిల్లా కేంద్రాలు గుర్తించారు. మన రాష్ట్రంలోని 8 జిల్లా కేంద్రాల్లో ఛాత్రాలయాలు ఏర్పాటు చేసి నాకు అప్పగించారు. ఇప్పుడు నేను మిగతా జిల్లాల్లో కూడా ఛాత్రాలయాలు పెడుతున్నాను. కులంతో సంబంధం లేకుండా ఆర్థికంగా వెనకబడినవారికి అక్కడ చదువు చెప్పిస్తున్నాం. మా ఛాత్రాలయాల నుంచి వచ్చే విద్యార్థి ఐఏఎస్‌ అయితే.. నీతిమంతుడైన అధికారి అవుతాడు. ఒక విద్యార్థి ఎమ్మెల్యే అయితే నీతిమంతుడైన ఎమ్మెల్యే కాగలడని కచ్చితంగా చెబుతాను.


ఆర్కే: విదేశీ పర్యటనల్లో జీన్స్‌ ప్యాంటులు వేస్తారనే ఆరోపణలు..?

పరిపూర్ణానంద సరస్వతి: నేను కైలాస మానససరోవరానికి వెళ్లినప్పుడు ఈ దుస్తులతో వెళితే నేను తిరిగిరాను. వాళ్లిచ్చిన బట్టలు వేసుకున్నాను. సౌతాఫ్రి కా పర్యటనకు వెళ్లినప్పుడు ట్రెక్‌ చేయాల్సి వస్తే పంచెతో చేయలేను కదా? అయితే, అదికూడా కాషాయం ప్యాంటులే వేస్తాను.

Updated Date - 2020-05-19T22:49:16+05:30 IST