గడ్కోల్‌లోని పాఠశాల ఆవరణలో కుంటను తలపిస్తున్న వాన నీరు
ఇబ్బంది పడుతున్న విద్యార్థులు
పట్టించుకోని అధికారులు
సిరికొండ, జూన్ 22: మండలంలోని గడ్కోల్‌లో ఇటీవల కురిసిన వర్షానికి పాఠశాల ఆవరణలో వరద నీరు నిలిచి కుంటను తలపిస్తోంది. పాఠశాల ఆవరణలో నుంచి వరద నీరు బయటికి వెళ్లడానికి మార్గం లేక నీరు నిలిచి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం ప్రార్థన సమయంలో విద్యార్థులు నిలుచుండలేని దుస్థితి నెలకొంది. చిరు వర్షానికే ఇలాఉంటే రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి పాఠశాల ఆవరణలో నుంచి వరద నీటిని బయటికి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. కాగా, మన ఊరు-మన బడి కార్యక్రమంలో పాఠశాలకు నిధులు మంజూరైనా పనులు చేయకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని పీవైఎల్ జిల్లా సహాయ కార్యదర్శి పిట్ల కారల్‌మార్క్స్ అన్నారు. ఇప్పటికైనా సమస్య పరిష్కరించాలని తహసీల్దార్ బీసా అనిల్‌కుమార్‌కు వినతి పత్రం అందజేశారు.