ఈత.. కడుపుకోత

ABN , First Publish Date - 2022-06-22T06:22:49+05:30 IST

వేసవి సెలవులు కావడం, ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు నిండటంతో పిల్లలు ఇంట్లో చెప్పకుండా వెళ్లి మునిగిపోతున్నారు. ఈత సరదా వారి బంగారు భవిష్యత్‌ను తుంచేస్తోంది. కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపుతోంది.

ఈత.. కడుపుకోత
కాలువలో ఈత కొడుతున్న చిన్నారులు ,అక్కచెరువుపాలెంలో విద్యార్థుల మృతదేహాల వద్ద విలపిస్తున్న కుటుంబ సభ్యులు (ఫైల్‌)

వేసవి సెలవుల్లో పెరిగిన ప్రమాదాలు

జనవరి నుంచి 11 ఘటనలు..20 మంది మృతి

ఈనెలలోనే 12మంది.. చిన్నారులే అధికం

పుల్లలచెరువు మండలం పిడికిటివారిపల్లె హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న కవలకుంట్ల, కొత్తూరులకు చెందిన ఐదుగురు విద్యార్థులు ఈత కొట్టేందుకు సోమవారం కవలకుంట్ల  చెరువు వద్దకు వెళ్లారు. వీరిలో నలుగురు లోపలికి దిగారు. మరో విద్యార్థి గట్టుపై కూర్చున్నాడు. అయితే వీరు దిగిన ప్రాంతంలో లోతు ఎక్కువగా ఉండటంతో నలుగురూ ఒక్కసారిగా మునిగిపోయారు. గ్రామస్థులు వచ్చి బయటకు తీసేసరికి అప్పటికే మృతిచెందారు.  

ఈనెల 11న జరుగుమల్లి మండలం అక్కచెరువుపాలెం గ్రామంలోని బానకుంటలో ఈతకు దిగి నలుగురు చిన్నారులు చనిపోయారు. అందరూ పక్కపక్క ఇళ్ల వారే. సెలవులకు బంధువుల ఇంటికి వచ్చిన వారితో కలిసి ఆరుగురు సరదాగా కుంట వద్దకు వెళ్లి అందులోకి దిగడంతో మునిగిపోయారు. గ్రామస్థులు వెళ్లి ఇద్దరు బాలికలను మాత్రం కాపాడగలిగారు. 

జిల్లాలో ఇలాంటి దుర్ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. వేసవి సెలవులు కావడం, ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు నిండటంతో పిల్లలు ఇంట్లో చెప్పకుండా వెళ్లి మునిగిపోతున్నారు. ఈత సరదా వారి బంగారు భవిష్యత్‌ను తుంచేస్తోంది. కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపుతోంది. తల్లిదండ్రులకు కడుపుకోతను మిగుల్చుతోంది. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పిల్లలు ఇలా అర్ధంతరంగా నీళ్లపాలైపోతే వారి జీవితాల్లో శూన్యమే మిగులుతోంది. ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నప్పుడు బాధిత గ్రామాలు ఘొల్లుమంటున్నాయి. వరుస ప్రమాదాల నేపథ్యంలో పిల్లల తల్లిదండ్రులు వణికిపోతున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం అప్రమత్తమై నీటివనరులు ఉన్నచోట్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే ప్రమాదాలను అరికట్టడం సాధ్యమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఒంగోలు,జనవరి 21 (ఆంధ్రజ్యోతి) : ఈత సరదా చిన్నారుల ఉసురు తీస్తోంది. అడుతూపాడుతూ వేసవిలో సరదాగా గడిపే చిన్నారులు ఉత్సాహంగా చెరువులు, కుంటల్లో దిగి మృత్యువాత పడుతున్నారు. బంగారు భవిష్యత్‌ నీటిపాలు చేస్తున్న ఈ ఘటనలు వారి కుటుంబాలలో అంతులేని విషాదాన్ని నింపుతున్నాయి. జనవరి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 11 వేర్వేరు ఘటనల్లో 20మందికిపైగా ఇలా నీళ్లలో దిగి దుర్మరణం పాలయ్యారు. అందులో గడిచిన 20 రోజుల్లోనే ఆరు ప్రమాదాల్లో ఏకంగా 12మంది మరణించారు. సాధారణంగా వేసవి కాలంలో స్కూళ్లు, కళాశాలలకు సెలవులు కావడంతో స్నేహితులుగా ఉండేవారు కలిసి ఆటపాటలతో గడుపుతుంటారు. మారిన జీవనశైలి, సాంకేతిక పరిజ్ఞానం కారణంగా పలు గ్రామీణ క్రీడలు కనుమరుగవుతున్నా యువకులు, పిల్లలలో ఈత సరదా అధికంగా ఉంటోంది. పట్టణాలు, నగరాలలో స్విమ్మింగ్‌ పూల్స్‌ రాగా గ్రామీణప్రాంతాల్లో చెరువులు, కుంటలు, సమీపంలోని వాగులు, వంకలు, ఏరులలో  సరదాగా ఈత కొడుతుంటారు. అయితే అధిక ప్రాంతాల్లో ఈతరహా నీటి వనరులు గ్రామాలకు దూరంగా ఉంటుండటం, పెద్దలు లేకుండా పిల్లలు ఈతకు వెళ్తుండటంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వెళ్లిన వారిలో నీళ్లపై సరైన అవగాహన, ఈత వచ్చిన వారు లేక పోవడం అందుకు కారణమవుతోంది. దీంతో ప్రాణాలు కోల్పోతున్న వారిలో చిన్నారులు అధికంగా ఉంటున్నారు. 


90శాతం మంది చిన్నారులే

జిల్లాలో జనవరి నుంచి ఇప్పటివరకు జరిగిన 11 ప్రమాదాల్లో 20 మంది దుర్మరణం చెందారు. వారిలో 90శాతం మంది చిన్నారులే ఉన్నారు.  ఈనెలలో జరిగిన రెండు ప్రధాన ఘటనలను పరిశీలిస్తే ఏకంగా ఒక్కోచోట నలుగురేసి చిన్నారులు ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదాలు ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపాయి. కొందరికి కొడుకుల వారసత్వం కూడా లేకుండా పోతోంది. ఈ ఘటనలు ఆ కుటుంబాలు, బంధువులు, సంబంధిత గ్రామాలనే కాక జిల్లా ప్రజానీకం మొత్తాన్ని కలవరపాటుకు గురిచేస్తున్నాయి. 


జాగ్రత్త చర్యలు శూన్యం

గతంలో ఇలాగే ప్రమాదాలు చోటుచేసుకున్న సందర్భంలో హడావుడి చేసిన రెవెన్యూ, పోలీసు యంత్రాంగం తర్వాత ఎందుకో పట్టించుకోవడం లేదు. బోర్డులను ప్రదర్శించడం, తగిన హెచ్చరికలు జారీచేయడం వంటివి కూడా ప్రస్తుతం లేవు. కనీసం వేసవిలోనైనా కొంతమేర ముందుస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటే కొంతవరకు చిన్నారులను కాపాడుకునేందుకు అవకాశం ఉంటుందని బాధిత గ్రామాల ప్రజలు కోరుతున్నారు. సాయంత్రం వేళ ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలోని నీటి వనరుల వద్ధ గస్తీ, సచివాలయ సిబ్బంది పర్యవేక్షణ ఉంటే బాగుండనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేకించి వేసవిలో ప్రమాదాలు చోటుచేసుకుంటుండగా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాల్సి పరిస్థితి. లేకుంటే ప్రమాదాలను వారించలేని పరిస్థితి  నెలకొంది. చెరువులు, కుంటల రక్షణ చర్యలు కల్పించే పరిస్థితి యంత్రాంగం వద్ద లేదు.


ఇటీవల జిల్లాలో జరిగిన ఘటనలు కొన్ని..

సంతనూతలపాడు మండలం మద్దులూరులో ఈనెల 18న చెరువులో ఈతకు వెళ్లి మునిగిన ఎనిమిదేళ్ల బాలుడు మరుసటిరోజు శవమై తేలాడు

కొత్తపట్నం మండలం అల్లూరులో ఈతకు వెళ్లి యువకుడు మృతిచెందాడు. చీమకుర్తి సమీపంలోని గ్రానైట్‌ క్వారీల్లో ఈతకు వెళ్లి ఈ నెలలో ఒకరు, గతనెలలో మరొకరు మృతిచెందారు. రామతీర్థం రిజర్వాయర్‌లో మునిగి ఒకరు మృతిచెందారు.

 టంగుటూరు మండలం ఎం.నిడమానూరు దళితవాడకు చెందిన ముగ్గురు చిన్నారులు ముసిలో ఈతకు వెళ్లి మృతిచెందారు. అలాగే కనిగిరి మండలంలో ముగ్గురు, రాచర్లలో ఒకరు మరణించారు. 


Updated Date - 2022-06-22T06:22:49+05:30 IST