ఫలిస్తున్న ట్రంప్ వ్యూహం.. మరోసారి ‘స్వింగ్’ కింగ్..!

ABN , First Publish Date - 2020-11-04T18:11:00+05:30 IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న కొద్ది ఉత్కంఠతను రేపుతున్నాయి. మొదట ఆధిక్యం ప్రదర్శించిన డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ తరువాత వెనుకబడ్డారు. కానీ, వెనుకంజలో ఉన్న రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అనూహ్యంగా పుంజుకున్నారు.

ఫలిస్తున్న ట్రంప్ వ్యూహం.. మరోసారి ‘స్వింగ్’ కింగ్..!

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న కొద్ది ఉత్కంఠతను రేపుతున్నాయి. మొదట ఆధిక్యం ప్రదర్శించిన డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ తరువాత వెనుకబడ్డారు. కానీ, వెనుకంజలో ఉన్న రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అనూహ్యంగా పుంజుకున్నారు. అధ్యక్ష పీఠానికి దగ్గర చేసే కీలకమైన ఫ్లోరిడాలో కూడా ట్రంప్ జయకేతనం ఎగురవేశారు. అటు అధ్యక్ష అభ్యర్థి భవిత్యాన్ని తేల్చే స్వింగ్ స్టేట్స్‌లో చాలా వరకు ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. దీంతో మరోసారి ట్రంప్ స్వింగ్ కింగ్‌గా మారబోతున్నారు. 


2016లో కూడా కీలకమై ఏడు స్వింగ్ రాష్ట్రాలే ఆయనను అధ్యక్ష పీఠం ఎక్కించిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు ట్రంప్ కంటే 30 లక్షల దాకా ఓట్లు ఎక్కువగా వచ్చాయి.. కానీ స్వింగ్ స్టేట్స్ ఫలితం పుణ్యమాని ట్రంప్‌కు ఎలక్టోరల్ ఓట్లు ఎక్కువ రావడంతో ట్రంప్ అధ్యక్షుడయ్యారు. ఈసారి కూడా ఆయన స్వింగ్ స్టేట్స్‌పైనే పూర్తిగా దృష్టిపెట్టారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత స్వింగ్ స్టేట్స్‌లోనే ఎక్కువగా ప్రచారం చేశారు. అప్పటి వరకు ఆ రాష్ట్రాల్లో బైడెన్‌దే పైచేయి అన్నట్టుగా సర్వేలు తేల్చిచెప్పినా.. ట్రంప్ ప్రచారంతో హోరాహోరీగా పోరు సాగింది.. ప్రస్తుతం ఆ రాష్ట్రాల్లో ట్రంప్‌ హవా నడుస్తోంది.. 


అరిజోనా, ఫ్లోరిడా, జార్జియా, మిచిగాన్, మిన్నెసోటా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, టెక్సాస్, ఓహియో, విస్కాన్సిస్ రాష్ట్రాలు ఈ స్వింగ్ స్టేట్స్ జాబితాలో ఉన్నాయి. వీటిలో విజయం సాధించిన అభ్యర్థి అమెరికా అధ్యక్షుడు అవుతారు.  తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ స్వింగ్ స్టేట్స్ ఫలితాలు ఇలా ఉన్నాయి...


న్యూ హాంప్‌షైర్: ఈ రాష్ట్రాన్ని బైడెన్ కైవసం చేసుకున్నారు. జో బైడెన్‌‌కు ఇక్కడ 53.6 శాతం ఓట్లు వస్తే.. ట్రంప్‌కు 44.8శాతం ఓట్లు ట్రంప్‌కు వచ్చాయి. దీంతో విజయం సాధించిన బైడెన్‌కు 4 ఎలక్టోరల్ ఓట్లు దక్కాయి. 


అరిజోనా: ఈ రాష్ట్రంలో మొత్తం ఎలక్టోరల్ ఓట్ల సంఖ్య 11. ఇప్పటివరకు జరిగిన 75 శాతానికి పైగా ఓట్ల లెక్కింపులో బైడెన్ 52.5 శాతం, ట్రంప్‌కు 46.2 శాతం ఓట్లు పోలయ్యాయి. దీంతో ఇక్కడ బైడెన్ స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. 


ఫ్లోరిడా: అధ్యక్ష పీఠానికి దగ్గర చేసే ఫ్లోరిడాను మరోసారి ట్రంప్ కైవసం చేసుకున్నారు. దీంతో ఈ రాష్ట్రంలోని 29 ఎలక్టోరల్ ఓట్లు ట్రంప్‌కు దక్కాయి. 


జార్జియా: ఇక్కడ ట్రంప్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు నమోదైన 90 శాతానికి పైగా ఓట్ల లెక్కింపులో ట్రంప్ ఖాతాలో 50.7 శాతం ఓట్లు పడితే... బైడెన్‌కు 48.1 శాతం ఓట్లు దక్కాయి. దీంతో ఈ రాష్ట్రంలో ట్రంప్ విజయం సాధించడం ఖాయమనే చెప్పాలి. జార్జియాలో మొత్తం 16 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. 


లొవా: ఈ రాష్ట్రంలో ట్రంప్ విజయకేతనం ఎగురవేశారు. దీంతో ఆరు ఎలక్టోరల్ ఓట్లు గెలుచుకున్నారు. 


మిచిగాన్: ఈ రాష్ట్రంలో సైతం ట్రంపే ముందంజలో ఉన్నారు. ఇప్పటివరకు జరిగిన 65 శాతం ఓట్ల లెక్కింపులో ట్రంప్‌కు 53.7 శాతం ఓట్లు వస్తే... బైడెన్‌కు 44.7 శాతం ఓట్లు వచ్చాయి. ఈ రాష్ట్రంలో 16 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. 


నెవెడా: ఇక్కడ బైడెన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు జరిగిన 67 శాతం ఓట్ల లెక్కింపులో ట్రంప్‌కు 47.6 శాతం ఓట్లు రాగా... బైడెన్ ఖాతాలో 50.3 శాతం ఓట్లు పడ్డాయి. ఇక్కడి ఎలక్టోరల్ ఓట్ల సంఖ్య 6. ఈ రాష్ట్రంలో బైడెనె గెలిచే అవకాశం ఉంది. 


ఓహియో: ఈ రాష్ట్రాన్ని ట్రంప్ దక్కించుకున్నారు. దీంతో 18 ఎలక్టోరల్ ఓట్లు ఆయన సొంతమయ్యాయి. 


నార్త్ కరోలినా: ఈ రాష్ట్రంలో అధ్యక్షుడు ట్రంప్ ముందంజలో ఉన్నారు. 94 శాతం వరకు జరిగిన ఓట్ల లెక్కింపులో ట్రంప్‌కు 50.1 శాతం ఓట్లు వస్తే.. బైడెన్‌కు 48.7 శాతం ఓట్లు వచ్చాయి. ఇక్కడ ట్రంప్ గెలవం ఖాయం. 


పెన్సిల్వేనియా: 20 ఎలక్టోరల్ ఓట్లు గల ఇక్కడ కూడా ట్రంపే ఆధిక్యంలో ఉన్నారు. ట్రంప్‌, బైడెన్ మధ్య 14 శాతం ఓట్ల తేడా ఉంది. కనుక ఈ రాష్ట్రంలో కూడా ట్రంప్ విజయం నల్లేరుమీద నడకనే చెప్పాలి.


టెక్సాస్: ఈ రాష్ట్రంలో సైతం ట్రంప్ జోరు కొనసాగింది. బైడెన్‌పై గెలిచి కీలకమైన 38 ఎలక్టోరల్ ఓట్లు దక్కించుకున్నారు.  


విస్కాన్సిన్: ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నారు. ఇప్పటివరకు జరిగిన 90 శాతం ఓట్ల లెక్కింపులో ట్రంప్‌కు 51.3 శాతం ఓట్లు పోలైతే... బైడెన్‌కు 47.2 శాతం ఓట్లు వచ్చాయి. ఈ రాష్ట్రంలో 10 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి.   


కాగా.. తాజాగా అందిన సమాచారం మేరకు బైడెన్ 225 ఎలక్టోరల్ ఓట్లు గెలిచి ముందంజలో ఉన్నారు.. 213 ఎలక్టోరల్ ఓట్లతో ట్రంప్ గెలుపు కోసం పోరాడుతున్నారు.. స్వింగ్ స్టేట్స్‌లో వచ్చే ఫలితాలు.. గెలుపును తారుమారు చేయొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.. 

Updated Date - 2020-11-04T18:11:00+05:30 IST