యానిమేటర్ల మెడపై కత్తి

Published: Mon, 28 Mar 2022 01:24:43 ISTfb-iconwhatsapp-icontwitter-icon
యానిమేటర్ల మెడపై కత్తిస్వయం సహాయకసంఘాల సమావేశం (ఫైల్‌)

వదిలించుకునేందుకు ప్రభుత్వం చర్యలు

రోడ్డున పడనున్న వేలాది మంది

కక్షపూరితమంటూ బాధితుల ఆవేదన


యానిమేటర్లపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష గట్టింది.

ఇటీవలే సమస్యలపై ఉద్యమించిన వారి మెడపై 

కత్తి పెట్టింది. వేలాది మందిని ఏకంగా 

ఇంటికి పంపేందుకు పూనుకుంది..

కుదింపు పేరుతో తొలగింపు

 కుతంత్రం పన్నింది. దానిని నిర్దయగా 

అమలు చేస్తోంది.వేలాది కుటుంబాలను 

రోడ్డున పడేస్తోంది


అనంతపురం క్లాక్‌టవర్‌ : స్వయం సహాయక సంఘాల నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తున్న యానిమేటర్ల మెడపై కత్తి వేలాడుతోంది. వారిని తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. డ్వాక్రా సంఘాల నిర్మాణం, నిర్వహణ, రికార్డులు భద్రపరచడం, రాయడం వంటి పనులన్నీ చేసేది యానిమేటర్లు. అలాంటి వారిని ఇంటికి సాగనంపేందుకు ప్రభుత్వం కుదింపు మాటున కసరత్తు చేస్తోంది. దీంతో 2500మందికిపైగా యానిమేటర్లు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. 1995లో డ్వాక్రా మహిళా సంఘాలను ప్రారంభించిన నాటి నుంచి నేటివరకు వాటి పురోగతిలో యానిమేటర్ల పాత్ర కీలకం. అలాంటి వారిని వదిలించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వేలాది మంది ఉపాధి కోల్పోయి, వారి కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉంది. 


అందుకే కక్ష

గ్రామ సచివాలయాలు ఉన్నప్పటికీ యానిమేటర్లను ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు చేరవేసేందుకు, మహిళా సంఘాలను బలోపేతం చేయడానికి ఉపయోగించుకుంటోంది. ఈ క్రమంలో యానిమేటర్ల సేవలకు స్వస్తి పలకాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై గుర్రుగా ఉన్నారు. యానిమేటర్లపై రాజకీయ ఒత్తిళ్లు, కక్షసాధింపులు అధికమవుతున్నాయని చెబుతున్నారు. స్వయంసహాయక సంఘాల అంశంలో రాజకీయ పెత్తనమేంటని రాష్ట్ర ప్రభుత్వాన్ని యానిమేటర్లు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా యానిమేటర్లు ‘చలో విజయవాడ’ చేపట్టి ఉద్యమానికి దిగారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా తమను తొలగించేందుకు కుట్రలు చేస్తోందని బాధిత యానిమేటర్లు ఆవేదన చెందుతున్నారు.


యానిమేటర్ల విధులివీ..

స్వయం సహాయకసంఘాల (డ్వాక్రా) ఏర్పాటు, నిర్వహణ, పుస్తకాలు రాయడం, ఆర్థిక లావాదేవీలు, మొబైల్‌ బుక్‌కీపింగ్‌, ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు వర్తింపజేయడం, ప్రతినెలా గ్రామైక్య సంఘాల సమావేశ నిర్వహణ, పురోగతిపై సభ్యులకు తెలియజేయడం, అభివృద్ధికి తీసుకోవాల్సిన అంశాలను వివరించడం, సంఘాల అర్హత ఆధారంగా రుణాలు ఇప్పించడానికి బ్యాంకర్లతో మాట్లాడడం, వాటిని సక్రమంగా రికవరీ చే యడం యానిమేటర్ల ముఖ్య విధులు. జిల్లావ్యాప్తంగా 63 మండలాల పరిధిలో 2838 గ్రామైక్య సంఘాలకు యానిమేటర్లు సేవలు అందిస్తున్నారు. మొదట వారికి పారితోషికంగా రూ.250 మాత్రమే చెల్లించారు. 2014లో అప్పటి ప్రభుత్వం రూ.3 వేలకు పెంచింది. దానిని తరువాత రూ.8 వేలకు పెంచారు. ఇప్పుడు వారిని ఇంటికి సాగనంపాలనే ఉద్దేశంతోనే సర్కులర్‌ నంబరు-22ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఉత్తర్వుల ప్రకారం 30 గ్రామైక్య సంఘాలకు ఒక యానిమేటర్‌ చొప్పున జిల్లాలో ఉన్న 2838 వీఓలకుగాను వందమందిని మాత్రమే ఉంచనున్నారు. కొన్ని గిరిజన ప్రాంతాలకు మాత్రం కొనసాగించనున్నారు. అధికారుల అంచనా ప్రకారం 2500 మందిని తొలగించే అవకాశం ఉంది.


పథకాలను చేరవేయడంలోనూ..

గతంలో కేవలం డ్వాక్రా సంఘాల నిర్మాణం, నిర్వహణ, విస్తరణ, రుణాలు చెల్లింపు, రికవరీ వంటి విధులు మాత్రమే యానిమేటర్లు నిర్వహించేవారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పథకాలను ప్రజలకు చేరవేయడంలో యానిమేటర్ల పాత్రను కీలకం చేసింది. ఉన్నతి, పావలావడ్డీ, జగనన్న చేనేత నేస్తం, చేదోడు, రేషనకార్డుల సర్వే, ఆధార్‌కార్డుల లింకేజీ, వైఎస్సార్‌ బీమా, పెళ్లి కానుక, బ్యాంకు లింకేజీ, మహిళలకు ఆర్థికసహాయం వంటి ప్రభుత్వ పథకాలను సర్వే చేయడానికి, ప్రజలకు చేరవేయడంలో యానిమేటర్లను కీలకం చేసింది. ఇన్ని సేవలు చేయిస్తూ వేతనం పెంచినట్టే పెంచి తొలగించడంపై బాధిత యానిమేటర్లు.. ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. 



యానిమేటర్ల మెడపై కత్తి

నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

స్వయం సహాయకసంఘాలతోపాటు ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను ప్రజలకు చేరవేయడంలో కీలకంగా పనిచేస్తున్న యానిమేటర్లను తొలగించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలి. ఉద్యోగభద్రత కల్పించి, కనీసవేతనం చెల్లించాలి. రాజకీయ పెత్తనం, ఒత్తిళ్లను మానుకోవాలి. యానిమేటర్లపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందనిపిస్తోంది. ఇది సరికాదు. 25 ఏళ్లుగా మహిళా సంఘాల పురోగతికి యానిమేటర్లు కీలకంగా పనిచేస్తున్నారనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి.

-  ఈశ్వర్‌రెడ్డి, యానిమేటర్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి

యానిమేటర్ల మెడపై కత్తి

రాష్ట్ర అధికారుల ఉత్తర్వుల మేరకు చర్యలు

ప్రభుత్వ ఆదేశాల మేరకే యానిమేటర్ల కుదింపు ప్రక్రియ ఉంటుంది. 30 నుంచి 60 గ్రామైక్య సంఘాలకు ఒక యానిమేటర్‌ ఉండాలనేది ప్రభుత్వ ఆలోచన. ఇప్పటి వరకు స్పష్టమైన ఆదేశాలు రాలేదు. రాష్ట్ర ఉన్నతాధికారుల ఉత్తర్వులు వచ్చాక యానిమేటర్ల అంశంపై నిర్ణయం తీసుకుంటాం.

-  నరసింహారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.