సైదాపురంలో ఏసీబీ కలకలం

ABN , First Publish Date - 2022-07-03T05:16:44+05:30 IST

స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంపై ఏసీబీ అధికారులు శనివారం మధ్యాహ్నం మెరుపుదాడులు నిర్వహించారు.

సైదాపురంలో ఏసీబీ కలకలం
తహసీల్దార్‌ కృష్ణను విచారిస్తున్న ఏసీబీ అధికారులు

తహసీల్దారు కార్యాలయంలో మెరుపు దాడులు

అర్ధరాత్రి వరకు రికార్డుల పరిశీలన

ఉలిక్కిపడ్డ రెవెన్యూ సిబ్బంది


సైదాపురం, జూలై 2 : స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంపై ఏసీబీ అధికారులు శనివారం మధ్యాహ్నం మెరుపుదాడులు నిర్వహించారు. లోపల ఉన్న సిబ్బందిని బయటకు రాకుండా, బయట ఉన్న వారిని లోపలకు వెళ్లనీయకుండా కట్టడి చేశారు. సిబ్బంది వద్ద ఉన్న సెల్‌ఫోన్లతో సహా రికార్డులను  ఏసీబీ బృందం స్వాధీనం చేసుకుంది. కొంతకాలంగా రెవెన్యూ కార్యాలయంలో పైసా ఇవ్వందే పనులు జరగడం లేదు. చేతులు తడిపితేనే పనులు జరుగుతున్నాయని రైతులు విమర్శిస్తున్న సమయంలో ఏసీబీకి చెందిన ముగ్గురు సీఐలు, 13 మంది సిబ్బంది దాడులు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ పి మోహనరావు మాట్లాడుతూ  తహసీల్దార్‌ కార్యాలయంలో  ప్రభుత్వ భూములు, అసైన్డ భూములు, పట్టా పాస్‌బుక్‌లలో అవతవకలు చోటు చేసుకుంటున్నాయని, రికార్డులు తారుమారు చేస్తున్నారని రైతులు 14400కి కాల్‌ చేయడంతో ఈ దాడులు చేపట్టినట్లు తెలిపారు. 2017 నుంచి రికార్డులను స్వాధీనం చేసుకుని విచారణ చేపడుతున్నట్లు చెప్పారు. ప్రతి విభాగంలోని  సిబ్బంది నుంచి వివరాలు సేకరించామని అన్నారు.  ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు  కిరణకుమార్‌, వేణు, రమేష్‌బాబు, సిబ్బంది పాల్గొన్నారు. కాగా, ఏసీబీ దాడుల విషయాన్ని నెల్లూరు ఆర్డీవో మోహనరావు తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకుని  వివరాలు తెలుసుకుని వెళ్ళారు. 


చేజర్లలో ఈడీ అధికారులు


చేజర్ల : మండలంలోని మడపల్లి, యనమదల గ్రామాలలో పలు సర్వే నెంబర్లలోని పట్టా భూములను శనివారం విశాఖపట్టణం సబ్‌ జోనల్‌ ఆఫీస్‌కు చెందిన డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎన్‌పోర్స్‌మెంట్‌ (ఈడీ) అధికారులు పరిశీలించారు. రెండు రోజుల్లో పూర్తి వివరాలు తెలియజేస్తామని ఆ అధికారులు పేర్కొన్నారు.

Updated Date - 2022-07-03T05:16:44+05:30 IST