త్యాగానికి ప్రతీక.. బక్రీద్‌

ABN , First Publish Date - 2021-07-21T05:22:20+05:30 IST

త్యాగానికి ప్రతీకగా ముస్లింలు జరుపుకొనే పర్వదినం బక్రీద్‌. బుధవారం ఈ పండుగను ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు. ఈ రోజున ముస్లింలు లోక కల్యాణం కోసం అల్లాకు నైవేద్యాలను సమర్పించడం ఆనవాయితీ.

త్యాగానికి ప్రతీక.. బక్రీద్‌

నేడు పర్వదినం
ప్రార్థనలకు ముస్తాబైన ఈద్గాలు, మజీదులు

నిజామాబాద్‌ కల్చరల్‌, జూలైౖ 20: త్యాగానికి ప్రతీకగా ముస్లింలు జరుపుకొనే పర్వదినం బక్రీద్‌. బుధవారం ఈ పండుగను ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు. ఈ రోజున ముస్లింలు లోక కల్యాణం కోసం అల్లాకు నైవేద్యాలను సమర్పించడం ఆనవాయితీ. మానవులు తమ నీతి నిజాయితీని మరిచిపోకుండా ఉండడానికి.. ఉత్తమమైన వ్యక్తులుగా ఉండి స్వచ్ఛమైన, నిజమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాలని.. అల్లా దిగివచ్చిన రోజుగా భావిస్తారు. అల్లా వచ్చిన ఈ రోజుని ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో అతిథ్యాన్ని ఇచ్చి అల్లా పేరిట బలిదానం ఇవ్వడం ప్రత్యేకంగా భావిస్తారు. ముస్లింలు రంజాన్‌ పండుగ తర్వాత జరుపుకొనే అతి ముఖ్యమైన పండుగగా బక్రీద్‌ను నిర్వహిస్తారు. బక్రీద్‌ పండుగను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా ఈద్గాలు, మజీదులలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. అంటు రోగాలు తొలగిపోయి ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని వేడుకుంటూ నిర్వహించే ప్రార్థనలు సఫలీకృతం అవుతాయని ముస్లింలు విశ్వసిస్తారు. బక్రీద్‌ పండగను పురస్కరించుకుని కరోనా నిబంధనలు అనుసరించి ఈద్గాలు, మజీదులలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ముస్లింలకు ప్రముఖుల శుభాకాంక్షలు
నిజామాబాద్‌ అర్బన్‌: బక్రీద్‌ పండుగను పురస్కరించుకుని ముస్లింలకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు డీ.శ్రీనివాస్‌, సురేష్‌రెడ్డి, ధర్మపురి అర్వింద్‌, జడ్పీచైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు, నగర మేయర్‌ దండు నీతూకిరణ్‌, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్‌, జీవన్‌రెడ్డి, షకీల్‌, బిగాల గణేష్‌గుప్తా, ఎమ్మెల్సీలు వీజీగౌడ్‌, రాజేశ్వర్‌, కల్వకుంట్ల కవిత, కలెక్టర్‌ సీ.నారాయణరెడ్డి ముస్లింలకు బక్రీద్‌ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు.
బందోబస్తు పకడ్బందీగా నిర్వహించాలి : సీపీ కార్తికేయ
ఖిల్లా: జిల్లాలోని ముస్లింలు బక్రీద్‌ పండుగను శాంతియుతంగా జరుపుకొనే విధంగా పోలీసు బందోబస్తును పకడ్బందీగా నిర్వహించాలని సీపీ కార్తికేయ పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌ డివిజన్‌ల పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు సమన్వయంతో బందోబస్తు నిర్వహించాలన్నారు. అప్రమత్తంగా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్‌ రఘువీర్‌, నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌ ఏసీపీ లు వెంకటేశ్వర్లు, రామారావు, రఘు తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా బక్రీద్‌ పండుగను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని నెహ్రూపార్కు వద్ద నిజామాబాద్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్‌ బలగాలతో పికెటింగ్‌ ఏర్పాటు చేశారు.

Updated Date - 2021-07-21T05:22:20+05:30 IST