Advertisement

నిశ్చలత్వానికి ప్రతీక

Mar 5 2021 @ 00:24AM

ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి మహాశివరాత్రి ఎంతో విశిష్టమైనది.  కుటుంబ బంధాల్లో ఉన్నవారు మహాశివరాత్రిని శివుడి పెళ్ళి రోజుగా పరిగణిస్తే, ప్రాపంచిక లక్ష్యాలతో ఉన్నవారు దీన్ని శివుడు తన శత్రువులందరినీ జయించిన రోజుగా చూస్తారు. యోగుల దృష్టిలో ఇది శివుడు నిశ్చలత్వాన్ని పొందిన రోజు. 


ఒకప్పుడు భారత సంస్కృతిలో సంవత్సరానికి 365 పండుగలు ఉండేవి. ఒక రకంగా చెప్పాలంటే ప్రతీరోజూ పండుగే! రోజూ వేడుక చేసుకోవడానికి వారికి ఒక సాకు అవసరమయ్యేది. ఈ 365 పండుగలూ వేర్వేరు కారణాలతో... జీవితంలోని వేర్వేరు ప్రయోజనాల కోసం ఏర్పాటయ్యాయి. చరిత్రలో జరిగిన సంఘటనలకూ, విజయాలకూ సూచనగానో, లేదా విత్తనాలు నాటడం, పంట కోయడం లాంటి నిత్య జీవితంలోన్ని కొన్ని సందర్భాల కోసమో ఈ పండుగలు చేసుకొనేవారు. ఇలా ప్రతి సందర్భానికి ఒక పండుగ ఉండేది. కానీ మహాశివరాత్రికి మాత్రం ఒక విశిష్టత ఉంది. చాంద్రమానంలో... ప్రతి అమావాస్యకూ ముందు రోజును ‘శివరాత్రి’ అంటే ‘మాస శివరాత్రి’ అంటారు. ఇలా ఏడాదికి పన్నెండు శివరాత్రులు ఉంటాయి. కానీ మాఘ మాసంలో... అంటే ఫిబ్రవరి, మార్చి నెలల మధ్యలో వచ్చే శివరాత్రికి ఆధ్యాత్మికంగా విశేష ప్రాధాన్యం ఉంది. ఆ రోజు రాత్రి భూమి ఉత్తరార్థగోళం ఉన్న స్థితి రీత్యా... మనిషిలో శక్తి సహజసిద్ధంగా ఉప్పొంగుతుంది. ప్రకృతి మానవులను ఆధ్యాత్మిక శిఖరం వైపు తీసుకువెళుతుంది. ఈ శక్తిని ఉపయోగించుకోవడానికి... ఆ రోజు రాత్రంతా జరుపుకొనే ఒక పండుగగా శివరాత్రిని నిర్దేశించారు. రాత్రంతా జాగారం చేసి, వెన్నెముకను నిటారుగా ఉంచి, ధ్యానం చేయడం ద్వారా ఈ శక్తులు ఉత్తేజితమవడానికి దోహదం చేసుకోవచ్చు. 


సన్న్యాసుల దృష్టిలో మాత్రం... ఈ రోజు... శివుడు కైలాస పర్వతంతో ఏకమైన రోజు. ఆయన పరిపూర్ణ నిశ్చలత్వంతో పర్వతంలా మారిపోయాడు. యోగ శాస్త్రంలో శివుణ్ణి దేవుడిగా భావించరు. యోగ శాస్త్రానికి మూలకారకుడైన ‘ఆది యోగి లేదా ‘ఆది గురువు’గా చూస్తారు. ధ్యానంలో ఎన్నో సంవత్సరాలు ఉన్న శివుడు ఒక రోజు పూర్తిగా నిశ్చలుడైపోయాడు. ఆ రోజే మహా శివరాత్రి. ఆయనలో అన్ని కదలికలూ సంపూర్ణంగా నిలచిపోయాయి. అందుకనే మహా శివరాత్రిని నిశ్చలత్వానికి ప్రతీక అయిన రాత్రిగా పరిగణిస్తారు. 


ఇతిహాసాలను పక్కన పెడితే... యోగ సంప్రదాయంలో శివరాత్రికి ఇంత ప్రాధాన్యం లభించడానికి కారణం - ఈ రోజు యోగ సాధకుడికి అందించే అపారమైన అవకాశాలే! ‘మనకు జీవంగా పరిచయమైన ప్రతీదీ, మనకు తెలిసిన ప్రతీ పదార్థం, వాటి ఉనికి, మనకు తెలిసిన జగత్తు, పాలపుంతలూ... ఇవన్నీ వివిధ రూపాల్లో ఒకే శక్తి తనకు తానుగా చేసుకున్న వ్యక్తీకరణ’ అని ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఎన్నో దశల్లో చేసిన అధ్యయనం తరువాత వెల్లడి అవుతోంది. ఈ శాస్త్రీయ వాస్తవం నిజానికి ప్రతి యోగికీ ఎదురయ్యే అనుభవపూర్వకమైన వాస్తవికత. ‘యోగి’ అనే పదానికి అర్థం ‘ఈ ఉనికి తాలూకు ఏకత్వాన్ని గ్రహించిన వాడు’ అని. ఆ ఏకత్వాన్ని అనుభవించాలన్న కోరిక ఉన్నవారికి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చే రోజు మహాశివరాత్రి.  


సద్గురు జగ్గీవాసుదేవ్‌(మహాశివరాత్రి రోజున సద్గురు జగ్గీవాసుదేవ్‌ శక్తిమంతం చేసిన రుద్రాక్షలను isha.co/Rudraksh8Tel వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ కావడం ద్వారా ఉచితంగా పొందవచ్చు)

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.